సుస్థిర వ్యవసాయమే లక్ష్యంగా..

హైదరాబాద్‌లో 15 నుంచి జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 17 వరకు జీ-20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆ సమావేశాలకు జి-20 దేశాలతో పాటు మరో తొమ్మిది దేశాల మంత్రులు కూడా హాజరు కాబోతున్నారన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో వ్యవసాయ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలున్న నేపథ్యంలో ఇక్కడ జీ-20 సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అటు రష్యాకు కొన్ని, ఇటు ఉక్రెయిన్‌కు కొన్ని దేశాలు మద్దతిస్తూ చీలిపోయిన నేపథ్యంలో మన దేశం తటస్థంగా ఉండి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జీ-20 దేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉందనీ, జీడీపీలో 85 శాతం ఈ దేశాల నుంచే వస్తున్నదని వివరించారు. 46 సెక్టార్లకు సంబంధించి 56 నగరాల్లో జీ-20 సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకూ 140 సమావేశాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో స్టార్టప్‌ ఎంగేజ్‌మెంట్‌, డిజిటల్‌ ఎకనామీ వర్కింగ్‌ గ్రూపుల సమావేశాలను నిర్వహించామని వివరించారు. వ్యవసాయానికి సంబంధించిన సమావేశాల్లో ఆహార భద్రత, పోషకాహార కోసం సుస్థిర వ్యవసాయం, మహిళల నేతృత్వంలో వ్యవసాయాభివృద్ధి, జీవ వైవిధ్య వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ రంగంలో రావాల్సిన మార్పులు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిపారు. పర్యాటక శాఖకు సంబంధించిన తుది సమావేశాలు గోవాలో ఈ నెల 19 నుంచి 22వరకు జరుగుతాయనీ, గోవా రోడ్‌ మ్యాప్‌ పేరుతో టూరిజంపై ఒక డిక్లరేషన్‌ ప్రకటిస్తామని చెప్పారు. జీ-20 చివరి సమావేశాలు సెప్టెంబర్‌ 9,10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతాయనీ, దానికి జీ-20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరవుతారని తెలిపారు.

 

Spread the love