ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు..

– తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్‌ అభివృద్ధే కాదు..
– ఫలాలు మారుమూల ప్రాంతాలకు చేరినపుడే సార్థకత : ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఒక్కటే అభివృద్ధి చెందితే రాష్ట్రమంతా అభివద్ధి చెందినట్టు కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు మారమూల ప్రాంతాల ప్రజలకు దక్కినప్పుడే నిజమైన సార్థకత అని అన్నారు. రాష్ట్రావిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజ్‌ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అదే సమయంలో ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసిన అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ కొంత మంది ఉన్నత పదవుల్లో ఉన్న వారు అభివద్ధి చెందితే అది అందరూ అభివృద్ధి చెందినట్టుగా భావించలేమని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయిన రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్ఫూర్తిదాయక పోరాటానికి తెలంగాణ పోరాటం ప్రతిరూపమనీ, పూర్తిగా అహింసాయుతంగా ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఎదగాలనీ, స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ విద్యార్థులు, యువకులతో పాటు ఎందరో ఆత్మబలిదానాలు చేశారని స్మరించుకున్నారు. 1969 తొలి దశ ఉద్యమంలో 300 మందికిపైగా ప్రాణాలర్పిస్తే, తుది దశ ఉద్యమంలో 85 లక్షల కుటుంబాల్లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారని తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వారు సైతం పాల్గొన్న అద్భుత ఉద్యమమంటూ అభివర్ణించారు. హైదరాబాద్‌ ఐటీ, లైఫ్‌సైన్సెస్‌ తదితర రంగాల్లో సహజసిద్ధంగా ఎదిగి అంతర్జాతీయ నగరంగా పేరుగాంచిందని తెలిపారు. ఇక్కడి నీళ్లు, నియామకాలు, నిధులు తెలంగాణ వారికే చెందాలని ఉద్యమించారనీ, కానీ అది పూర్తిగా నెరవేర లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అంతర్జాతీయంగా ఉన్న ప్రవాస తెలంగాణీయులు మరింత చురుగ్గా భాగస్వాములు కావాలని ఆమె కోరారు. విద్యారంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు జీ-20, వై-20 వంటి కార్యక్రమాలను ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. జై తెలంగాణ ఒక నినాదం మాత్రమే కాదనీ, అది ఒక ఆత్మగౌరవ నినాదమంటూ అమరవీరులకు జోహార్లు తెలిపారు.
నా జీవితం ప్రజలకు అంకితం
తన జీవితంలోని ప్రతి నిమిషం ప్రజల కోసమేనని గవర్నర్‌ స్పష్టం చేశారు. తెలంగాణకు గవర్నర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజల పురోగతిలో తన పాత్ర కూడా ఉందని గుర్తుచేశారు. తాను ప్రజలతో ఉన్నాననీ, ప్రజలు తనతో ఉన్నారని గవర్నర్‌ తెలిపారు.వేడుకల సందర్భంగా పలువురు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ విద్యార్థులతో కలిసి కొంత సేపు నృత్యం చేశారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్రాంచీలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్జున్‌ మిశ్రా, ఏపీవీఎన్‌ శర్మ, ఎ.కె.మొహంతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love