– మహిళా మహా పంచాయతీకి తుది దశ సన్నాహాలు
మీడియాతో రెజ్లర్లు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఈనెల 28న ప్రారంభంకానున్న కొత్త పార్లమెంట్ ఎదుట దేశ మహిళా క్రీడాకారులు నిరసనకు సన్నద్ధమవుతున్నారు. మహిళా మహాపంచాయతీకి సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి.
శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెజ్లర్లు మాట్లాడుతూ కొత్త పార్లమెంట్ భవనం ముందు మహిళా సమ్మాన్ మహాపంచాయత్ జరుగుతుందని, ఇందులో హర్యానా, పంజాబ్ నుంచి వచ్చే రైతు, కూలీ సంఘాల తరపున వేలాది మంది ఉదయం 11:00 గంటలకు సింఘు సరిహద్దుకు చేరుకుంటారని తెలిపారు. మరోవైపు, హర్యానాలోని ఖాప్ పంచాయతీలు, టోల్ ప్లాజాల పోరాట కమిటీల తరపు వేలాది మంది ఉదయం 11:00 గంటలకు టిక్రీ సరిహద్దుకు చేరుకుంటారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే రైతు సంఘాలు, ఖాప్ పంచాయితీల తరపున వందలాది మంది ఉదయం 11:00 గంటలకు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకుంటారు. వీరే కాకుండా దేశం నలుమూలల నుంచి రైలు, బస్సుల్లో వచ్చే సహచరులు ఉదయం 11:00 గంటలకు జంతర్ మంతర్ వద్ద నిరసన స్థలానికి చేరుకుంటారు. ఢిల్లీలోని అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు కూడా జంతర్ మంతర్ చేరుకుంటారు. ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ ముందుకు ప్రతిపాదించిన మహిళా సమ్మాన్ మహాపంచాయత్ కోసం మార్చ్ శాంతియుతంగా ప్రారంభమవుతుంది. ఇది పార్లమెంట్ ముందు చేరిన తరువాత సభ జరుగుతుంది. శాంతియుతంగా ఉంటామని, పూర్తి క్రమశిక్షణతో నడుచుకుంటామని రెజ్లర్లు తెలిపారు. పోలీసులు లాఠీ చార్జీ చేసినా, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినా, వాటర్ క్యానన్ ప్రయోగించినా, మేం ఎలాంటి హింసా పద్ధతిని అవలంభించం, అన్నింటినీ సహిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు అరెస్టు చేస్తే మేమంతా కూడా శాంతియుతంగా అరెస్టు అవుతామని తెలిపారు.
మహాపంచాయత్‌లో మహిళలను సత్కరించాలని మహిళా క్రీడాకారులు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ మహిళా సమ్మాన్ మహాపంచాయత్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపు ఇచ్చారు. ఈ మహాపంచాయత్‌లో ఐదుగురు మహిళా క్రీడాకారులు, మహిళా సంఘాల నాయకులు, గ్రామీణ మహిళలు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసి, దేశంలోని మహిళలు పెద్ద నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరనున్నారని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెజారిటీపై గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. దేశంలోని ఆడబిడ్డలు తమకు న్యాయం చేయాలని వీధుల్లో తిరుగుతున్నా పట్టించుకోవడంలేదుఅని విమర్శించారు. పతకాలు తెచ్చినప్పుడు ఇక్కడ ఆడబిడ్డలకు ఎంతో గౌరవం ఉండేదని, ఇప్పుడు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వీధుల్లో కూర్చునే పరిస్థితి నెలకొందని మహిళా రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడం వల్లనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ కు స్వేచ్ఛ లభించిందని విమర్శించారు. నిందితుడైనా.. బహిరంగంగా మీడియాలో రెచ్చగొట్టే ఇంటర్వ్యూలు ఇస్తూ దేశ పుత్రికల పరువు తీస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రోద్బలం, రక్షణ వల్లే నిందితులు మహిళలపై దూషణలకు దిగుతున్నారని పేర్కొన్నారు.