హింసకు కేంద్రమే కారణం

– అమిత్‌ షాతో మణిపూర్‌ విద్యార్థి సంఘాలు
న్యూఢిల్లీ : మణిపూర్‌లో గత కొంతకాలంగా కొనసాగుతున్న హింసాకాండకు కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలే కారణమని మణిపూర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఢిల్లీ (ఎంఎస్‌ఏడీ) విమర్శించింది. రాష్ట్రంలోని కుకీలు,మీతీల ప్రాణాలు, ఆస్తులను పరిరక్షించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడింది. ఈ మేరకు ఎంఎస్‌ఏడీకి చెందిన విద్యార్థులు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు మెమొరాండం సమర్పించారు. రాష్ట్రంలో సుస్థిర శాంతి స్థాపనకు కృషి చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న హింసాకాండ నేపథ్యంలో అమిత్‌ షా సోమవారం సాయంత్రం మణిపూర్‌ చేరుకొని గవర్నర్‌తో, రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఉద్దేశపూర్వకంగా జాతి ఘర్షణలను ప్రేరేపించాయని విద్యార్థులు ఆరోపించారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఈ శక్తులు కుట్ర పన్నాయని మండిపడ్డారు. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల వలలో పడవద్దని రాష్ట్ర ప్రజలను కోరారు. మణిపూర్‌ ఐక్యత, సమగ్రతలకు భంగం కలిగించేందుకు జరుగుతున్న మతపరమైన ప్రచారానికి వ్యతిరేకంగా ప్రజలందరూ సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. నెల రోజులుగా రాష్ట్రం హింసతో అట్టుడుకుతుంటే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పైగా జాతుల మధ్య హింసను ప్రేరేపించిందని చెప్పారు. రాష్ట్రంలో సాయుధ సిబ్బంది తగిన సంఖ్యలో ఉన్నప్పటికీ హింస చల్లారలేదని గుర్తు చేశారు. విధి నిర్వహణలో సాయుధ దళాలు ఘోరంగా విఫలమయ్యాయని, ఇప్పటికే రెండు జాతులకు చెందిన 40 వేల మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు.
మణిపూర్‌ హింసపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం విచ్ఛిన్నకర రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజలకు రక్షణ, భద్రత కల్పించాలని కోరారు.

Spread the love