మణిపూర్‌ హింసపై ప్రధాని మౌనం వీడాలి

– తక్షణమే శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
– సీపీఐ(ఎం) నేతలతో మణిపూర్‌ ప్రతిపక్షాల బృందం భేటీనవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్‌ పరిణామాలపై ప్రధాని మోడీ మౌనం వీడాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హితవు పలికారు. ఈ అంశంపై స్పందించేందుకు మోడీ సిద్ధంగా ఉండాలని సూచించారు. మణిపూర్‌కు చెందిన పది ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం పాటు ప్రధాని మోడీతో పాటు వివిధ పార్టీల నేతలను కలిసేందుకు ఢిల్లీకి చేరుకుంది. అయితే పది రోజులకుపైగా ఎదురు చూస్తున్నారు. కాని ప్రధాని మోడీ ఇంకా సమయం (అపాయింట్‌ మెంట్‌) కేటాయించలేదు. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ఆయన తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులను కలవాలని, దాదాపు యాభై రోజులుగా అల్లర్లు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఎన్‌ బిరాన్‌ సింగ్‌కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయా పార్టీల నేతలు విమర్శించారు. బిరాన్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్‌)లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, నిలోత్పల్‌ బసులతో మణిపూర్‌ ప్రతిపక్ష పార్టీ నేతల బృందం సమావేశం అయింది. అనంతరం సీతారాం ఏచూరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మణిపూర్‌లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా కొనసాగుతోందని, అక్కడ శాంతి పునరుద్ధరణే ప్రధాన ప్రాధాన్యతని అన్నారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పాలని పేర్కొన్నారు. ఇది మణిపూర్‌ సమస్య కాదని, దేశ సమస్య అని, అందుకే దీన్ని వెంటనే పరిష్కరించాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడాలని సూచించారు. మే 3న ప్రారంభమైన ఈ హింసా ఘటనలపై ప్రధాని మోడీ స్పందించలేదని విమర్శించారు. దాదాపు 60,000 మంది శరణార్థి శిబిరాల్లో ఉన్నారన్నారు. మణిపూర్‌లో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వ్యతిరేక దిశలో పయనిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రిని తొలగిస్తేనే శాంతి చర్చలు అర్థవంతంగా ప్రారంభమవుతాయని ఏచూరి అన్నారు. పది రోజులుగా ప్రధాని మోడీ మణిపూర్‌ రాజకీయ నేతలకు సమయం కేటాయించలేదని, 20 రోజుల తరువాత కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా మణిపూర్‌ లో పర్యటించారని, అయితే ఫలితం శూన్యమని అన్నారు. మణిపూర్‌ ప్రతినిధి బృందాన్ని ప్రధాని మోడీ కలవకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
వారి అభిప్రాయాలను వినకపోవడం, పరిస్థితి చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. సీపీఐ(ఎం) నేతలను కలిసిన వారిలో మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడు కైషామ్‌ మేఘచంద్ర, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి క్షేత్రమయుమ్‌ శాంత, సీపీఐ కార్యదర్శి ఎల్‌ తోయిరన్‌ సింగ్‌, జేడీయూ అధ్యక్షుడు కెఎస్‌హెచ్‌ బిరాన్‌ సింగ్‌, ఎన్సీపీ అధ్యక్షుడు సోరం ఇకోయామా సింగ్‌, టీఎంసీ, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే), ఆప్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆర్‌ఎస్పీ తదితర పార్టీల నేతలు ఉన్నారు. ప్రధానమంత్రి సమావేశానికి సమయం ఇవ్వకపోతే, తన కార్యాలయానికి వినతిపత్రాన్ని పంపుతానని, ఆపై మీడియాను కలుస్తానని ఇబోబీ సింగ్‌ చెప్పారు.

Spread the love