దిక్కుతోచని రైతన్న

– కొనుగోళ్లలో ఆలస్యం..
– తడిసిన ధాన్యం
– రెండ్రోజులుగా భారీ వర్షం
– పేచీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని అన్నదాతల డిమాండ్‌
రైతు బతుకు ఆగమవుతోంది.. యాసంగి వరి పంట కోతలు పూర్తయి రెండు నెలలు కావస్తున్నా.. కొనుగోళ్లు ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పటి వరకు 50లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. అయితే చాలా ధాన్యం కేంద్రాల్లోనే ఉండటం గమనార్హం. కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించడం.. లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం కూడా కేంద్రాల్లోనే వారాల తరబడి ఉండటంతో అకాల వర్షాలకు రైతు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. తాజాగా సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన భారీ వర్షానికి మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు.
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
ఇప్పటికే దాదాపు పూర్తికావాల్సిన కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరగడం.. మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు లేవనే సాకుతో అధికారులు అలసత్వం వహించడమే ఈ దుస్థితికి కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తూకం వేసి వారం రోజులు గడుస్తున్నా మిల్లులకు తరలించకపోవడంతో క్వింటాళ్ల కొద్దీ ధాన్యం వర్షార్పణమైంది. తడిసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల ఆందోళన చేశారు.
ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాలలో యాసంగిలో లక్షకు పైగా ఎకరాల్లో వరి సాగు చేశారు. పంట చేతికొచ్చిన తర్వాత వడ్లను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్నదాతలకు ఊహించని పరిణామం ఎదురైంది. వారం, పది రోజుల పాటు రైతులు తూకం వేసిన ధాన్యం వద్దే నిరీక్షించాల్సి వస్తోంది. రెండ్రోజులపాటు కుండపోత వర్షం కురవడంతో ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు. టార్ఫాలిన్లు పూర్తిగా కప్పే సమయం లేకపోవడంతో చాలా వరకు ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దండేపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు హామీనివ్వడంతో నిరసన విరమించారు.
నల్లగొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో నేతన్న విగ్రహం రోడ్డుపై రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వడ్ల రాశులు పోసుకొని నిరీక్షిస్తున్నామని, వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైపోతుందని బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు వెంట వెంటనే లారీలను పంపించకపోవడంతో కాంటా వేసిన ధాన్యం అక్కడే నిల్వ ఉంటోందని, దాంతో మిగతా ధాన్యం తూకం బంద్‌ చేస్తున్నారని తెలిపారు. మరోవైపు మిల్లర్లు తరుగు పేరిట మోసం చేస్తున్నారని, ధాన్యం సరిగా లేదంటూ కొనుగోలును పొడిగిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు రైతులకు సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు.
మల్హర్‌లో గాలివాన బీభత్సం
హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో వడగండ్ల వానతో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. శాయంపేట మండల కేంద్రంలో పీఏసీఎస్‌ మక్కల కొనుగోలు కేంద్రంలో వెయ్యి బస్తాల వరకు తూకం వేసి రవాణా కొరతతో వదిలేశారు. లారీల కొరతతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ వేల సంఖ్యలో ధాన్యం బస్తాలు నిల్వలు పేరుకుపోయాయి. మంగళవారం ఉదయం వీచిన గాలి దుమారం.. భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు గత్యంతరం లేక ధాన్యం సంచుల చుట్టూ నీరు జాలు వారకుండా మట్టితో కట్టలు కట్టి, నీటిని ఎత్తి పారబోశారు. చెన్నారావుపేట మండల పరిధిలో అకాల వర్షాలకు రైతులు నిండా మునిగిపోయారు. మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం మార్కెట్‌ యార్డులో ఐకేపీ కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం తడిసి ముద్ద అయింది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో కొయ్యుర్‌, రుద్రారం, కొండంపేట, ఎడ్లపల్లి, తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల గ్రామాల్లో వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించ డానికి పోసిన ధాన్యం కుప్పలు, అరబోసిన మిర్చి తడిసింది. మామిడి కా యలు రాలాయి. వరద తాకిడికి మిర్చి, వరి ధాన్యం కొట్టుకు పోయింది. పెద్ద తూండ్ల, అడ్వాలపల్లి, గాదంపల్లి గ్రామాల్లో మిర్చి, ధాన్యం తడిసి వరదలో కొట్టుకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. గణపురం మండలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కాంటాలు పెట్టినప్పటికీ లారీలు రాకపోవడంతో వర్షానికి తడిసింది. ధాన్యం చుట్టూ నీరు నిలిచింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మంథనిలో ధర్నా..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షానికి ధాన్యం రాశులు.. కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిశాయి. మంథని-పెద్దపల్లి రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. సుమారు 20 రోజులు కావస్తున్నా మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు జరగడం లేదని, సక్రమంగా కాంటాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన రైతులు కోరుట్ల, వేములవాడ రహదారిపై బైటాయించి ధర్నా నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love