– సీఐటీయూ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణలు
నవతెలంగాణ – మధిర/సిద్దిపేట అర్బన్
కార్మికుల పక్షాన నిరంతరం పోరాడేది సీఐటీయూ మాత్రమేనని సంఘం జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబా, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ అన్నారు. మంగళవారం సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జెండావిష్కరణలు, ‘మతోన్మాదం, కార్మిక వర్గంపై ప్రభావం’ అంశంపై సెమినార్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని మార్కెట్ యార్డులో సీఐటీయూ మండల కన్వీనర్ పడకండి మురళి అధ్యక్షతన నిర్వహించిన సెమినార్‌లో ఎం.సాయిబాబా మాట్లా డారు. దేశంలో కార్మికులు, కర్షకులు కష్టంతో సంపద సృష్టిస్తుంటుంటే.. దాన్నంతా బడా కాంట్రాక్టర్లు, కార్పొ రేట్లకు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కారు చౌకగా దోచిపెడుతోందని విమ ర్శించారు. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకుండాపోవడంతో కార్మికుల జీవన పరిస్థితి దుర్భరంగా మారింద న్నారు. అనంతరం పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు కనీస వేతనం లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వారందరినీ పర్మి నెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించా లని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల జీవన ప్రమాణ స్థాయి పెరగలేదని, కార్మికులకు రెండు పూటల తిండి కూడా సరిగా లేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. వీట న్నింటికీ వ్యతిరేకంగా కార్మికు లంతా ఏకమై ఐక్యంగా ఉద్యమించా లని, వారికి సీఐటీయూ అండగా ఉంటుం దని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో వివిధ కార్మిక సెంటర్లలో సీఐటీయూ జెండాను సంఘం అధ్యక్షకార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంక టేశ్వర్లు ఆవిష్క రించారు. అనంతరం ఖమ్మంలోని ఎఫ్‌సీఐ గోడౌన్ లో కార్మికులతో సభ నిర్వహించారు. వైరా, నేల కొండపల్లి, తిరుమలాయపాలెంలో జెండా ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని ఐటీసీ గేట్ వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ జెండా విష్కరించారు. ఇల్లందులో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అడ్డా వద్ద సంఘం మండల కన్వీనర్ కృష్ణ జెండావిష్కరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో చుక్క రాములు సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చడంతో అన్ని రంగాల కార్మికులు యాజమాన్యాలకు కట్టు బానిసలగా మారారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులను కాల రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లు కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తు న్నారని తెలిపారు. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చడం యాజమాన్యాల మెప్పు కోసం నరేంద్ర మోడీ చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానా లని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోంద న్నారు. 53 ఏండ్లుగా కార్మికుల పక్షాన ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేసిన సీఐటీయూ కార్మికులకు అండగా ఉంటోందన్నారు. కార్యక్రమంలో సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి, నాయకులు శశిధర్, రవికుమార్ పాల్గొన్నారు.