స్పీడు పెంచిన సారు..

– అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సీఎం కార్యాచరణ…
– ప్రతి రోజూ సచివాలయానికి
– సమీక్షల మీద సమీక్షలు

– క్రమబద్ధీకరణలు..పలువురికి పదవులు
– పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలంటూ ఆదేశాలు

– ఎలక్షన్లే టార్గెట్‌గా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు
      ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారు స్పీడు పెంచారు. వచ్చే డిసెంబరులో నిర్వహించబోయే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ఆయన బరిలోకి దిగారు. ఏప్రిల్‌ 30 దాకా తన నివాసమైన ప్రగతి భవన్‌ నుంచే పరిపాలన సాగించిన సీఎం కేసీఆర్‌… డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరిట నిర్మించిన నూతన సచివాలయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అక్కడి నుంచే పాలన కొనసాగిస్తున్నారు. తద్వారా గతంలో ‘సీఎం సచివాలయానికి రారు…’ అనే ముద్రను ఆయన చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కొత్త సెక్రటేరియల్‌లో అనునిత్యం వివిధ శాఖలు, రంగాల పురోగతిపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఇప్పటికే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఈ నెలాఖరులో తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పక్కన ఏర్పాటుచేసిన అమరవీరుల స్మారక కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టటంద్వారా దేశం దృష్టిని ఆయన ఆకర్షించారు. ఇవన్నీ రాజకీయంగా కేసీఆర్‌ ముందుచూపునకు నిదర్శనాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖలు, విభాగాల్లో ఏండ్ల తరబడి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ దస్త్రంపై సంతకం చేశారు. ఫలితంగా మొత్తం 11,103 మంది ఉద్యోగులు, సిబ్బంది పర్మినెంట్‌ అయ్యారు. వీరిలో 5,544 మంది విద్యాశాఖకు చెందిన వారే ఉన్నారు. వీరిలో కూడా 3,897 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. ఇక తమ డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం కొద్ది రోజుల క్రితం వరకు ఆందోళనలు నిర్వహించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్‌)లు, వీఆర్‌ఏలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, విద్యుత్‌ సంస్థల్లో పని చేసే ఆర్టిజన్లకు పలు హమీలను ఇవ్వటం ద్వారా సీఎం వారి ఆందోళనలను విరమింపజేశారు. మరోవైపు శుక్రవారం నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మూడు వారాలపాటు నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ద్వారా ఆయన స్పీడు మరింతగా పెంచనున్నారని తెలిసింది. 21 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఒకవైపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రచారంలో పెడుతూనే మరోవైపు గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టేందుకు వీలుగా ఆయన వ్యూహం రచించారు. తద్వారా కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించనున్నారు. మోడీ హయాంలో మతోన్మాదం ఎలా పెచ్చరిల్లిందనే విషయాన్ని ఆయన ప్రజలముందు పెట్టనున్నారు. దాంతోపాటు బీజేపీ చేపట్టిన ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ దుష్ఫలితాలను కూడా ప్రజలకు విడమరిచి చెప్పనున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో యువతకు అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీ పరంగా పలు కీలక పదవులను కట్టబెట్టటం ద్వారా వారిని ఎలక్షన్లలో వినియోగించుకునేందుకు సీఎం మార్గం సుగమం చేసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్‌ పెట్టుబడుల కోసమంటూ ఇటీవల లండన్‌, అమెరికాల్లో పర్యటించారు. అక్కడి ప్రవాస తెలంగాణవాసులను కలిసి…రానున్న ఎన్నికల్లో సహాయ సహకారాలను అందించాలంటూ కోరారు. వివిధ పరిశ్రమాధిపతులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, ప్రతినిధులతో ఆయన సమావేశాలు నిర్వహించి, కొంతమేర పెట్టుబడులను ఆకర్షించినప్పటికీ ఆ పర్యటన అంతిమ లక్ష్యం…’వచ్చే ఎన్నికలే’నని వినికిడి. మరో మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలంటూ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయన సభలు ఇప్పటికే ‘ఎన్నికల మీటింగుల’ను తలపిస్తున్నాయి. వారిద్దరినీ ఇప్పటికే రంగంలోకి దించటం ద్వారా కేసీఆర్‌… రాష్ట్రంలో ‘ఎలక్షన్‌ మూడ్‌’ను తెప్పించారు. కాలికి గాయం కారణంతో నిన్న మొన్నటి వరకూ విశ్రాంతి తీసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం బుధవారం నిజామాబాద్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించటం విశేషం. తద్వారా ఆమె కూడా రంగంలోకి దిగినట్టయింది. ఇక దశాబ్ది ఉత్సవ వేదికల ద్వారా రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలను జనానికి వివరించాలంటూ కేసీఆర్‌ ఇప్పటికే మంత్రులు, తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. అందుకనుగుణంగా నియోజకవర్గాల్లోనే ఉండాలి తప్ప హైదరాబాద్‌లో ఎవరూ కనబడకూడదంటూ ఆయన సూచించారు. ఎన్నికలయ్యేంత వరకూ జనంతోనే ఉండాలని ఆదేశించారు. ఈ రకంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా గులాబీ దళపతి అన్ని వైపుల నుంచి శరవేగంగా పావులు కదుపుతుండటం గమనార్హం.

Spread the love