ఏపీ అక్రమాలను నిరోధించాలి

– సమస్యలు పరిష్కరించండ కేఆర్‌ఎంబీకి సర్కారు లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలోని సాగునీటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి లేఖ రాసింది. ఈమేరకు గురువారం రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రధానంగా మూడు అంశాలను అందులో ప్రస్తావించారు. కేఆర్‌ఎంబీలో చేసిన నిర్ణయాలు, తీర్మానాలకు విరుద్ధంగా సాగునీటి వ్యవహారాలు జరుగుతున్నాయని బోర్డు దృష్టికి తెచ్చారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రభుత్వం చెబుతున్నట్టుగా 50:50 నిష్పత్తిలో కృష్ణాజలాలను పంపిణీ చేయాలని కేఆర్‌ఎంబీ చైర్మెన్‌ను కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని చెప్పారు. పలుమార్లు ఆ ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని లేఖలో పేర్కొన్నారు. కేఆర్‌ఎంబీ దృష్టికి కూడా అనేకమార్లు తెచ్చామని వివరించారు. ఇకపోతే 2022-23 నీటి సంవత్సరంలో ఏపీ అద నంగా నీటి వినియోగం చేపట్టిందని అన్నారు. ఈ చర్య తెలంగాణ ప్రయోజ నాలకు తీవ్ర నష్టం చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ మూడు అంశాలపై కేఆర్‌ఎంబీ దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love