ఘోర రోడ్డు ప్రమాదం

– భార్య, భర్త, కుమారుడు మృతి
– మరో కుమారుడికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-కొణిజర్ల
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో భార్య, భర్తతో పాటు కుమారుడు మృతిచెందారు. మరో కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్‌ (38), సుజాత (34) దంపతులు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, ఆ కుటుంబమంతా తమ కారులో హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో కొణిజర్ల వద్ద వారి కారు ముందు వెళ్తున్న లారీ ముందు మరో వాహనం మరమ్మతులకు గురై ఆగి ఉండటంతో లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దాంతో రాజేష్‌ కూడా తన కారు వేగం తగ్గించి లారీ వెనక ఆపాడు. అది గమనించని రాజేష్‌ కారు వెనుక వస్తున్న మరో లారీ డ్రైవర్‌ వేగంగా వచ్చి కారును ఢ కొట్టడంతో రెండు లారీల మధ్య కారు నుజ్జు నుజ్జు అయింది. నలుగురూ కారులో ఇరుక్కున్నారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే రాజేష్‌, సుజాతలతో పాటు కుమారుడు అశ్విత్‌ (8) మరణించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రెహమాన్‌, సీఐ, ఎస్‌ఐ, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను ప్రొక్లె యిన్‌ సహకారంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీలో ముగ్గురి మృతదేహాలను చూసి వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Spread the love