పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– దామరచర్లకు చెందిన ఆరుగురు కూలీలు మృతి
– మిరపకాయలు ఏరేందుకు వెళ్తుండగా ఘటన
– బాధితులకు ఎమ్మెల్యే భాస్కరరావు, జూలకంటి పరామర్శ
– ఆర్థిక సాయం అందజేత
– మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-దామరచర్ల
పొట్ట తిప్పల కోసం పక్కనే ఉన్న మరో జిల్లాకు మిరపకాయలు ఏరేందుకు వెళ్లిన మహిళా కూలీలను రోడ్డు ప్రమాదం మింగేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పొందుగుల వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలానికి చెందిన ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన 20 మంది మహిళాకూలీలు పల్నాడు జిల్లా గురుజాల మండలం పులిపాడు గ్రామంలో మిరపకాయలు ఏరడానికి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ఆటో పులిపాడు బయల్దేరింది. ఆంధ్రా ప్రాంతం లోని పొందుగుల వద్ద ముందు నుంచి లారీ అతి వేగంతో ఢకొీంది. దీంతో ఆటోలో ఉన్న ఇస్లావత్‌ మంజుల (26), భూక్యా పద్మ (28) మాలోతు కవిత (30), ఇస్లావాత్‌ పార్వతి (44), భూక్యా సోని (48), వడ్త్య సక్రి (49) అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గురజాల ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
ప్రమాదం విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వెంటనే వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేశారు. ఆయన వెంట డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మెన్‌ డి.నారాయణరెడ్డి, జెడ్పీటీసీ ఏ.లలిత హాతిరాం నాయక్‌, రైతు బంధు నల్లగొండ జిల్లా కమిటీ మెంబర్‌ వీరకోటిరెడ్డి, ఎంపీటీసీ బాలలక్ష్మి సత్యనారాయణ, పాచు నాయక్‌ తదితరులున్నారు.
సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావును సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ వినరు కృష్ణారెడ్డి వైద్య సేవలపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.
బాధితులకు జూలకంటి పరామర్శ
ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు అందజేత
కూలీల కుటుంబాలను నర్సాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆరుగురి కుటుంబాలకు రూ.60 వేల సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని.. ఈ ఘటనకు అదే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది పేదలు పొట్ట చేతబట్టుకొని ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్తున్నట్టు చెప్పారు. పల్నాడు జిల్లా పులిపాడులో మిర్చి ఏరేందుకు కూలీలు ఆటోలో వెళ్తుండగా లారీ ఢకొీనడంతో ఆరుగురు కూలీలు ప్రాణం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ అవకాశం కలిపించడంతోపాటు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. వారి పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్నారు. ఆయన వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కమిటీ సబ్యులు వీరెల్లి వెంకటేశ్వర్లు, రావు నాయక్‌, పాపానాయక్‌, మండల కార్యదర్శి వినోద్‌ ఉన్నారు.
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి:సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మహిళా కూలీల ఆటోను లారీ ఢకొీట్టిన ఘటనలో ఆరుగురు మరణించారని, తొమ్మిది మందికి గాయాలయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.పది లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన బుధవారం లేఖ రాశారు.

Spread the love