– ఇంకాతేలని సీఎం ఎంపిక
– కొనసాగుతున్న కాంగ్రెస్ మార్క్ రాజకీయం
– సీఎం కుర్చీ సిద్ధూదేనని.. డీకేకు బుజ్జగింపులని వార్తలు
– పుకార్లను నమ్మవద్దంటున్న రణదీప్ సూర్జేవాలా
న్యూఢిల్లీ/బెంగళూరు : కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిని త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కర్నాటక ఎన్నికల ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఒక నిర్ణయానికి రాగానే వెంటనే తెలియచేస్తామనీ, ఆ తర్వాత 48-72 గంటల్లోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని చెప్పారు. 18న ప్రమాణస్వీకారం అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. అవన్నీ నమ్మవద్దని కోరారు. ప్రమాణస్వీకార తేదీని ఇంకా నిర్ణయించలేదనీ, ముఖ్యమంత్రిగా ఎంపికైనవారే ఆ తేదీని నిర్ణయిస్తారని చెప్పారు. సీఎం ఎంపికపై వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దనీ, బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. అయితే, కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకూ తీవ్రంగా ప్రయత్నించిన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను బుజ్జగించి ఒప్పించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవిని చెరికొంత కాలం పంచుకునే విషయంపై ఓ ఫార్ములాను రూపొందించారని తెలిసింది. దీని ప్రకారం సిద్ధరామయ్య, శివకుమార్‌లు చెరో రెండున్నరేండ్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తారన్న వార్తలు వస్తున్నాయి. శివకుమార్ ప్రస్తుతం ప్రభుత్వంలో చేరరు. కానీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. అయితే అధికారాన్ని పంచుకునే విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన పట్టుబడుతు న్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు సిద్ధరామయ్యకే మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ విజయానికి ఎనలేని కృషి చేసిన శివకుమార్‌కు న్యాయం చేయాలని మరికొందరు నేతలు కోరుతున్నారు. మరో సమాచారం ప్రకారం శివకుమార్ కేబినెట్‌లో చేరతారని, కీలక మంత్రిత్వ శాఖలు చేపడతారని తెలుస్తోంది. నూతన ముఖ్యమంత్రి గురువారం ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం.
ఉప ముఖ్యమంత్రులుగా ఎంబీ పాటిల్ (లింగాయత్), జీ పరమేశ్వర (దళితుడు), యూటీ ఖాదర్ (ముస్లిం)లను నియమిస్తారని సమాచారం. కర్నాటక ముఖ్యమంత్రి పీఠంపై బుధవారం రోజంతా దేశ రాజధానిలో హైడ్రామా నడిచింది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న సిద్ధరామయ్య, శివకుమార్‌లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమై తమ వాదనలు వినిపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కూడా వారు చర్చలు జరిపారు. ఖర్గేతో సమాలోచనల అనంతరం శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్ నివాసంలో మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో మంతనాలు సాగించారు.
సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిందంటూ మీడియాలో వచ్చిన వార్తలతో శివకుమార్ మద్దతుదారులు తీవ్ర ఆశాభంగానికి గురయ్యారు. వారు నిరసనలకు దిగుతారేమోనన్న అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భద్రతను పెంచారు. ఖర్గేతో చర్చల తర్వాత విలేకరులతో ముచ్చటించకుండానే డీకే వెళ్లిపోయారు. కాగా ఇంకా సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా చెప్పారు. మరోవైపు సిద్ధరామయ్య మద్దతుదారులు ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బెంగళూరులోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని బాణసంచా పేలుస్తూ, నృత్యాలు చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య నియమితులయ్యారని వార్తలు రావడంతో ఆయన నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు.
ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఖరారు చేయకపోవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యంగ్యోక్తులు విసిరారు. ఆ పార్టీలో అంతర్గత పరిస్థితికి ఇది అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా అక్రమాస్తుల కేసులో శివకుమార్‌కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. శివకుమార్‌పై చేపట్టిన దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు గతంలో మధ్యంతర స్టే మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణను సుప్రీంకోర్టు జూలై 14వ తేదీకి వాయిదా వేసింది.