– రచయిత సల్మాన్ రష్దీ హెచ్చరిక
లండన్ : వేదికపై ప్రసంగిస్తుండగా, కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన రచయిత సల్మాన్ రష్దీ తొమ్మిది మాసాల తర్వాత మళ్ళీ ప్రసంగం చేశారు. పశ్చిమ దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని హెచ్చరించారు. బ్రిటీష్ బుక్ అవార్డ్స్ కార్యక్రమానికి రష్దీ వీడియో సందేశం పంపారు. సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమంలో రష్దీకి అవార్డు ఇచ్చారు. ‘ఎన్ని ముప్పులు, బెదిరిం పులు ఎదుర్కొంటున్నా రచయితలు, ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు అందరూ కృత నిశ్చయంతో అసహనానికి వ్యతిరేకంగా వైఖరి తీసుకుంటున్నారనీ, దాన్ని గుర్తిస్తూనే ఈ గౌరవం’ అని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. రష్దీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, పశ్చిమ దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇప్పుడున్న ముప్పును తన జీవిత కాలంలో ఎన్నడూ చూడలేదని, ప్రస్తుతం మనం అలాంటి కాలంలో జీవిస్తున్నామని అన్నారు.
‘నేనిప్పుడు అమెరికాలో వున్నా, లైబ్రరీలు, స్కూళ్ళలో పిల్లల పుస్తకాలపై అసాధారణ రీతిలో జరుగుతున్న దాడులను చూస్తున్నా’ అని రష్దీ పేర్కొన్నారు. లైబ్రరీలపై దాడి ఆలోచనే అందోళన కలిగిస్తోంది. వాటి పట్ల అప్రమత్తంగా వుండాల్సి వుంది. ఈ ధోరణులన్నింటిపై ధృఢంగా పోరాడాల్సి వుందని పేర్కొన్నారు. గత ఆగస్టులో న్యూయార్క్‌లో సాహితీ ఉత్సవంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనకు ఒక కన్ను పోయింది. ఒక చేయి తీవ్రంగా దెబ్బతింది. ఆధునిక భావజాలం కోసం దశాబ్దాల నాటి పుస్తకాలను మారుస్తున్నారంటూ ప్రచురణకర్తలను రష్దీ తీవ్రంగా విమర్శించారు.