మరోసారి సమ్మెకు టీచర్ల సన్నద్ధం

– వేతన పెంపుపై సర్కారు మీనమేషాలపై ఆగ్రహం
లండన్‌ : దీర్ఘకాలంగా వేతన పెంపునకు సంబంధించి రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్సర్వేటివ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిని నిరసిస్తూ ఇంగ్లండ్‌ వ్యాప్తంగా టీచర్లు మరోసారి సమ్మె చేయనున్నారు. జులై 5, 7 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు సమ్మె ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడతాయి. ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణానికన్నా చాలా తక్కువ స్థాయిలో అంటే 4.3శాతం వేతన పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని నాలుగు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తిరిగి చర్చలు చేపట్టాల్సిందిగా సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా పాఠశాలల బడ్జెట్‌ను పెంచాలని, వేతన పెంపు కోసం అదనుపు నిధులు అందచేయాలని ఎన్‌ఈయూ, ఎన్‌ఏఎస్‌యూడబ్ల్యూటీ, ఎన్‌ఏహెచ్‌టీ, ఎఎస్‌సీఎల్‌ డిమాండ్‌ చేశాయి.. తీసుకోవాల్సిన కార్యాచరణ అంతా విద్యాశాఖ మంత్రి గిలియన్‌ కీగన్‌ పరిధిలోనే వుందని ఎన్‌ఇయు జాయింట్‌ ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ మేరీ బూస్ట్‌డ్‌, కెవిన్‌ కోర్ట్నీ చెప్పారు.
ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు సత్వరమే చర్చలు జరపాల్సిందిగా ప్రతీసారి తాము విద్యా శాఖ మంత్రిని కోరుతున్నామని వారు చెప్పారు. స్కాట్లండ్‌, వేల్స్‌ల్లో వేతన వివాదాలను పరిష్కరించారు. ఇంగ్లండ్‌లో మాత్రం ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకురాకపోవడంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు స్పందిస్తూ, ఎవరూ కావాలని సమ్మె కార్యాచరణకు దిగాలని అనుకోరు, కానీ ఈ వివాదాన్ని పరిష్కరించే ఉద్దేశ్యమే తమకు లేనట్టు విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తున్నప్పుడు ఉపాధ్యాయులకు మరో ప్రత్యామ్నాయం లేకపోయిందని చెప్పారు.

Spread the love