– బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్రపంచ శాంతి, అభివృద్ధికి దోహదం
– అమెరికాకు స్పష్టం చేసిన చైనా
– జిన్‌పింగ్‌తో బ్లింకెన్ భేటీ
బీజింగ్ : చైనా – అమెరికా సంబంధాలు ప్రపంచ దేశాలకు అవసరమని చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్ గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్‌లో సోమవారం బ్లింకెన్‌తో సమావేశమయ్యారు. ఈ రెండు దేశాలు సరైన పంథాను కనుగొనగలిగి, ఆ మార్గంలో పయనించగలిగితే మానవాళి భవిష్యత్ మెరుగ్గా వుంటుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అమెరికన్ల మాదిరిగానే చైనీయులు కూడా విశ్వసనీయమైన, గౌరవప్రదమైన, స్వావలంబన కలిగిన వ్యక్తులని, ఇరువురికీ మరింత మెరుగైన జీవితం చేపట్టే హక్కు వుందని అన్నారు. ఇరు దేశాలు ఒకరికొకరు ముప్పుగా పరిగణించేకన్నా, ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను గుర్తించి, వాటికి విలువనిచ్చి, వారి రంగాల్లో విజయం సాధించడమనేది ఒక అవకాశమని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ప్రజల కోసం, ప్రపంచ దేశాల కోసం, ఇరు దేశాల మధ్య సంబంధాలు సక్రమంగా నిర్వహించడం కోసం బాధ్యతతో ఇరు దేశాలు వ్యవహరించాల్సి వుందన్నారు. ఈ రకంగా వ్యవహరించగలిగితేనే, ఈ రెండు దేశాలు ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడతాయన్నారు. తద్వారా ప్రపంచ దేశాలకు సాయపడతాయన్నారు.
ప్రధాన దేశాల మధ్య పోటీ అనేది అమెరికా సొంత సమస్యలను, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించవచ్చని, కానీ అది ప్రస్తుత ధోరణి కాదని అన్నారు. అమెరికా ప్రయోజాలను చైనా గౌరవిస్తుందని, అమెరికాను సవాలు చేయాలని గానీ లేదా పక్కకు నెట్టాలని గానీ చైనా భావించదని స్పష్టం చేశారు. అలాగే అమెరికా కూడా చైనాను గౌరవించాలన్నారు. చైనా చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను దెబ్బతీయరాదన్నారు. ఏ ఒక్క పక్షమూ కూడా ఎదుటి పక్షాన్ని తనకిష్టం వచ్చినట్లు మార్చడానికి ప్రయత్నించరాదన్నారు. అలాగే అభివృద్దికి గల చట్టబద్ధమైన హక్కును కూడా హరించివేయరాదన్నారు. చైనా, అమెరికా సంబంధాలు సక్రమంగా, స్థిరంగా వుండాలనే చైనా ఎల్లప్పుడూ కోరుకుంటుందని స్పష్టం చేశారు. వివిధ సవాళ్లను, ఇబ్బందులను అధిగమించి, ఒక సరైన పంథాను కనుగొని ఆ మార్గంలో ముందుకు పయనించాలని అన్నారు. పరస్పర గౌరవంతో, శాంతియుత సహజీవనంతో వ్యవహరించాలన్నారు. అమెరికా సహకారాన్ని కోరుకుంటుందా, సంఘర్షణనే కోరుకుంటుందా ఏదో ఒకటి తేల్చుకోవాలని జిన్‌పింగ్ సూటిగానే చెప్పారు. హేతుబద్ధమైన, ఆచరణాత్మక వైఖరి అవలంబించి, చైనాతో కలిసి పనిచేయాల్సిందిగా ఆయన బ్లింకెన్‌ను కోరారు.
సుదీర్ఘంగా విదేశాంగ మంత్రుల చర్చలు
ప్రస్తుతం బీజింగ్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌తో దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు. అయితే చర్చల గురించి ఇరు పక్షాలు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ”వాస్తవికతతో కూడిన నిర్మాణాత్మక చర్చలు” గా బ్లింకెన్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అభివర్ణించారు. ఇటీవల చైనా విదేశాంగ మంత్రిగా పనిచేసిన కిన్ గతంలో వాషింగ్టన్‌లో బీజింగ్ రాయబారిగా వున్నారు. ”బ్లింకెన్ అనేక అంశాలను ప్రస్తావించారు. అలాగే సహకారానికి గల అవకాశాలను అన్వేషిస్తూ, అంతర్జాతీయ అంశాలపై పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటూ చైనాతో ఆసక్తి, ప్రయోజనాలు కలిగిన పలు అంశాలను చర్చించారు.” అని మిల్లర్ పేర్కొన్నారు. అమెరికన్ల విలువలు, ప్రయోజనాల కోసం తాము ఎప్పుడూ నిలబడతామని బ్లింకెన్, కిన్‌కు తెలియజేశారని చెప్పారు. ప్రపంచం పట్ల తమకు గల దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ మిత్రులతో, భాగస్వాములతో కలిసి పనిచేస్తామని చెప్పారని తెలిపారు. ఈ చర్చల వివరాలను తెలియజేస్తూ చైనా క్లుప్తంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధానంగా తైవాన్‌పైనే చర్చ జరిగిందని పేర్కొంది. చైనా కీలక ప్రయోజనాలకు తైవాన్ అంశం కీలకమైనదని కిన్ గాంగ్ వ్యాఖ్యానించారు. చైనా-అమెరికా సంబంధాల్లో కూడా ఇదే అత్యంత కీలకాంశం, అత్యంత ముప్పు కలిగిన అంశం కూడా ఇదేనని కిన్, బ్లింకెన్‌కు తెలియజేసినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
బ్లింకెన్, కిన్‌ల మధ్య జరిగిన చర్చలు రెండు దేశాల మధ్య గల తీవ్రమైన విభేదాలను తేటతెల్లం చేశాయని చైనా విదేశాంగ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు విలేకర్లతో వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య విమానాల సంఖ్యను విస్తరించడానికి ఉభయులూ అంగీకరించారు.