అమెరికా ఆజ్యంతో మండుతున్న ఉక్రెయిన్‌ రావణ కాష్టం!

సోవియట్‌ పతనం తర్వాత ఇక నాటో అవసరం ఉండదని అందరూ అనుకున్నారు. అయితే నాటో మెల్లమెల్లగా రష్యా చుట్టూ విస్తరించనారంభించింది. మొదటి విస్తరణ బిల్‌ క్లింటన్‌ కాలంలో 1999లో జరిగింది. చెక్‌ రిపబ్లిక్‌, హంగరి, పోలెండ్‌ నాటోలో చేరాయి. రెండవ విస్తరణ 2004లో జరిగింది. బల్గేరియా, ఇస్టోనియా, లత్వియా, లిథ్యూనియా, రుమేనియా, స్లొవేకియా, స్లొవేనియా దేశాలు నాటోలో చేరాయి. ఇలా నాటో తమ దేశం చూట్టూ విస్తరించటంపట్ల రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అయినా.. రష్యా హెచ్చరికలను అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలు పెడచెవిన పెట్టాయి. రష్యన్లు గణనీయంగా నివసించే రష్యా పొరుగుదేశాలైన ఉక్రెయిన్‌, జార్జియాలను కూడా తమ కూటమిలో చేర్చుకోవాలని వచ్చిన ప్రతిపాదనలను గమనంలోకి తీసుకున్నామని నాటో కూటమి దేశాలు 2008లో ప్రకటించాయి. అలా ఉక్రెయిన్‌, జార్జియా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం రోజురోజుకూ పెరగటం మొదలైంది. 2008లో జార్జియా నుంచి వేరుపడదలచిన ప్రాంతాలకు రష్యా మద్దతిచ్చింది. అలా జార్జియాను కట్టడిచేసి రష్యా తన వైఖరిని చెప్పకనే చెప్పింది. అలాగే ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరితే ఆ దేశం మిగలదని పుతిన్‌ హెచ్చరించారు. అయినప్పటికీ అమెరికా జోక్యం ఆగలేదు. 2014 పిబ్రవరిలో ప్రజలచేత ఎన్నుకోబడిన, రష్యా అనుకూల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యానుకోవిచ్‌ను అమెరికా కుట్రపన్ని కూలదోసింది. అలా అమెరికా, ఐరోపా దేశాలు ఆలోచనారహితంగా రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ను తమ బలమైన స్థావరంగా మార్చుకునే ప్రయత్నం చేశాయి. దానికి ప్రతీకారంగా పుతిన్‌ క్రైమియాను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం అమెరికా అనాలోచిత చర్యల పర్యవసానాన్ని మనం చూస్తున్నాం. జార్జియా, ఉక్రెయిన్‌లను నాటోలో చేర్చుకోవటమంటే అది రష్యా అస్థిత్వాన్ని ప్రశ్నించటమే అవుతుందని పుతిన్‌ ప్రకటించారు. రష్యా ఇంతగా నిరసన తెలుపుతున్నా 2009లో అల్బేనియా, క్రొయేషియాలను కూడా నాటోలో చేర్చుకున్నారు. 2013కు ముందు అమెరికా ఉక్రెయిన్‌లోని వివిధ శక్తులను తనవైపు తిప్పుకోవటానికి కనీసం 5బిలియన్‌ డాలర్లను హెచ్చించింది. 2014లో ప్రజలచేత ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన విక్టర్‌ యానుకోవిచ్‌ను అమెరికా కుట్రపూరితంగా కూలదోసి పచ్చి రష్యా వ్యతిరేక ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. దీనితో ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా నిర్ణయాత్మకంగా వ్యవహరించవలసి వచ్చింది. క్రైమియాను స్వాధీనం చేసుకోవాలని పుతిన్‌ తన సైన్యాన్ని ఆదేశించాడు. ఆ తరువాత దాన్ని రష్యాలో విలీనం చేశాడు. రష్యన్లు గణనీయంగా నివసించే తూర్పు ఉక్రెయిన్‌లో చెలరేగిన తిరుగుబాటుకు రష్యా తన మద్దతునిచ్చింది.
ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న స్థితిలో, అమెరికా మద్దతుతో సైనికంగా బలోపేతమౌతున్న నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ పైన సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధాన్ని ఎటువంటి కారణంలేకుండా రష్యా ప్రకటించిందని పశ్చిమ దేశాల మీడియా ఊదరగొట్టింది. అయితే నాటో సెక్రటరీ జనరల్‌, జెన్స్‌ స్టోల్టేన్‌ బర్గ్‌ వాషింగ్టన్‌ పోస్టుకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వాస్తవాలను బయటపెట్టాయి. ఆయన ఇలా చెప్పాడు: ”ఉక్రెయిన్‌ యుద్ధం 2022లో ప్రారంభం కాలేదు. అది 2014లోనే మొదలైంది. అప్పటినుంచి నాటో కూటమి దేశాలు తమ రక్షణ బడ్జెట్లను పెంచుకున్నాయి”. అంటే ఉక్రెయిన్‌ యుద్ధం 2022 ఫిబ్రవరిలో రష్యా సైనిక చర్యతో ప్రారంభం కాలేదు. అది ఎనిమిదేండ్లకు ముందే 2014లో ప్రారంభమైంది.
స్టోల్టెన్‌ బర్గ్‌ 2014లోనే ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైందని చెప్పారుకానీ, అది ఎలా మొదలయిందో వివరించలేదు. ఇంతకుముందే చెప్పినట్టు ఉక్రెయిన్‌ ప్రజలచేత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన విక్టర్‌ యానుకోవిచ్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రష్యా వ్యతిరేక ఫాసిస్టు శక్తులను ఎగదోయటానికి అమెరికా 5బిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించిదని అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి విక్టోరియా న్యూలాండ్‌ గొప్పగా చెప్పుకున్నారు. ఆ తర్వాత అధ్యక్షుడైన పెట్రో పొరొషెన్కో రష్యన్లు గణనీయంగావుండే తూర్పు ఉక్రెయిన్‌లో దమనకాండను సాగించి 14,000 మంది రష్యన్‌ మాట్లాడే ప్రజల మరణాలకు కారకుడయ్యాడు. ఈ చర్య రష్యా అస్థిత్వానికి సవాలు విసిరే చర్య తప్ప మరొకటి కాదు. ఈ చర్యలన్నీ క్రైమియాలోని సెవాస్టొపోల్‌ రేవులోగల రష్యా నల్ల సముద్ర నౌకాదళాన్ని తరలించి దాన్ని అమెరికా నౌకాదళ స్థావరంగా మార్చాలనే కుట్రవున్నట్టు రష్యా భావించింది. అటువంటి చర్యను నిర్వీర్యం చేయటానికి రష్యా క్రైమియాను ఒక రిఫరెండం ద్వారా తనలో కలుపుకుంది.
ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా లక్షలాదిమంది మరణించారు. ఒక కోటిమందికి పైగా ఉక్రెయిన్‌ ప్రజలు కాందిశీకులుగా మారి వివిధ దేశాలలో తలదాచుకుంటున్నారు. అయినా వందలాది బిలియన్ల సాయుధ, ఆర్థిక సహాయంతో అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి దేశాలు యుద్ధాన్ని ఎగదోస్తున్నాయి. రష్యామీద దాడిచేయటానికి దాదాపు 50వేల ఉక్రెయిన్‌ సైన్యానికి పశ్చిమ దేశాలు శిక్షణనిచ్చాయి. ఉక్రెయిన్‌ వెంటనే రష్యాపైన దాడి చెయ్యాలని అమెరికా వత్తిడి తెస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్టు ఇటీవల రాశాయి. అయితే ఉక్రెయిన్‌ చేయబోయే ప్రతిదాడి ప్రభావం పైనే ఉక్రెయిన్‌ భవిత ఆధారపడివుంది. ‘తమ ప్రతిదాడిపైన ప్రపంచంలో అతి అంచనాలున్నాయి… ఇది నిరాశకు దారితీసే అవకాశం ఉంది. ‘విజయం’ అనేది మహా అయితే ఒక 10కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగిపొందటంగా ఉండొచ్చు”అని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి, ఒలెక్సీ రెజ్నికోవ్‌ వాషిగ్టన్‌ పోస్టుకు చెప్పారు.
ఏదైనా జరిగి ఉక్రెయిన్‌ చేయనున్న ప్రతిదాడి విఫలమైతే (విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ) ఉక్రెయిన్‌కు మరో అవకాశం ఉండదని చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు పెట్ర పావెల్‌ గార్డియన్‌తో మాట్లాడుతూ అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తన పరువు, ప్రతిష్టనంతా ఈ యుద్ధాన్ని గెలవటంపైనే పెట్టారు. అమెరికా, నాటో దేశాలు ప్రత్యక్షంగా రష్యాతో తలపడకుండా పరోక్షంగా ఉక్రెయిన్‌తో దాడిచేయించి రష్యాను గెలవలేవని అందరికీ తెలిసిపోయింది. అదే జరిగితే మానవాళి భవితను ప్రశ్నార్థకంచేసే మూడవ ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టే!

– నెల్లూరు నరసింహారావు

Spread the love