ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు కిసింజర్‌ ప్రతిపాదనపై స్పందించిన చైనా

ఉక్రెయిన్‌ నాటోలో చేరితే అది ఉక్రెయిన్‌ ప్రయోజనాలకు, రష్యా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్‌ చేసిన ప్రతిపాదనను చైనా త్రోసిపుచ్చింది. ఐరోపాలో శాంతి కోసం ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదని చైనా సూచించింది. నాటోలో ఉక్రెయిన్‌ చేరితే రష్యాకు, నాటో దేశాలకు మధ్య ఘర్షణలు పెరుగుతాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్బిన్‌ వాదించాడు. ”ప్రధాన దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు ఉక్రెయిన్‌ సరిహద్దుగా ఉండ కూడదు. ఒక దేశ భద్రతకు ఇతర దేశాల భద్రత ఫణం కారాదు” అని ఆయన అన్నాడు. ఎకనామిస్ట్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా కూటమికి బయట ఉక్రెయిన్‌ ఉండటం ప్రమాదకరమని హెన్రీ కిసింజర్‌ అన్నాడు. ఉక్రెయిన్‌ నాటోలో సభ్యత్వం తీసుకోవటం ఉక్రెయిన్‌ కే కాకుండా రష్యాకు కూడా అనుకూలంగా ఉంటుందని ఆయన తన అభిప్రాయంగా చెప్పాడు. అయితే ఐరోపాలో భద్రతా నిర్మాణం పదిలంగా ఉండాలంటే శాంతియుత చర్చలే ఆధారమని చైనా అధికార ప్రతినిధి విశదీకరించాడు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపటానికి చైనా ఫిబ్రవరిలో 12 సూత్రాల శాంతి ప్రతిపాదన చేసింది. చైనా ప్రతిపాదన ఆధారంగా ఉక్రె యిన్‌తో చర్చలు జరపటానికి సిద్ధంగా ఉన్నానని పుతిన్‌ ప్రకటించాడు. అయితే అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలు 12 సూత్రాల చైనా ప్రతిపాదనను త్రోసి పుచ్చాయి. చైనా సూచనలు ఊహాజనితంగా ఉన్నా యని యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ విధాన అధినేత జోసెప్‌ బోర్రెల్‌ అన్నాడు. చైనా ప్రతిపాదన రష్యాకు అనుకూలంగా ఉన్నదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాడీమీర్‌ జెలెన్‌ స్కీ సలహాదారు వాదించాడు.

Spread the love