27న బీసీసీఐ ఎస్‌జీఎం

– వరల్డ్‌కప్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుపై చర్చ
ముంబయి : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ నెల 27న కీలక సమావేశం కానుంది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో మెగా ఈవెంట్‌ నిర్వహణకు బీసీసీఐ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుపై చర్చతో పాటు సభ్యులను సైతం నియమించే అవకాశం కనిపిస్తుంది. మే 28న ఐపీఎల్‌ 16 ఫైనల్‌ అహ్మదాబాద్‌లో జరుగనుంది. ఐపీఎల్‌ ఫైనల్‌ ముందు రోజు అహ్మదాబాద్‌లోనే బీసీసీఐ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం (ఎస్‌జీఎం) భేటీ కానుంది. ఐదు పాయింట్లతో కూడిన ఎజెండాతో బీసీసీఐ కార్యదర్శి జై షా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు నోటీసు పంపించారు. మౌళిక సదుపాయల అభివృద్ది అండ్‌ సబ్సిడి కమిటీ ఏర్పాటు, రాష్ట్ర క్రికెట్‌ జట్లకు ఫిజియోథెరపిస్ట్‌లు, ట్రైనర్ల నియామకాలపై మార్గదర్శకాలు, 2023 ఐసీసీ ప్రపంచకప్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు, మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కమిటీ ఏర్పాటు సహా లైంగిక వేధింపుల నిరోధక విధానంపై ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో చర్చించనున్నారు.
వరల్డ్‌కప్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఈ కమిటీ ఏర్పాటుతో ప్రపంచకప్‌ వేదికల ఖరారు ప్రక్రియ పూర్తి కానుంది. ఇక ప్రపంచకప్‌ ముంగిట పలు స్టేడియాల ఆధునీకరణకు బీసీసీఐ భారీగా నిధులు వెచ్చించనుంది. స్టేడియాల ఆధునీకరణ పనులపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించేందుకు బోర్డు సిద్ధమవుతోంది. ఇక భారత రెజ్లింగ్‌ క్రీడాకారుల ఆందోళన నేపథ్యంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయకపోవటాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బీసీసీఐకి నోటీసులు ఇచ్చింది. దీంతో బీసీసీఐలో లైంగిక వేధింపుల నిరోధక వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర క్రికెట్‌ జట్ల ఫిజియోలు, ట్రైనర్ల నియామకాలకు కనీస అర్హత, అనుభవాన్ని బోర్డు నిర్దేశించే అవకాశం కనిపిస్తుంది.

Spread the love