పృథ్వీ షా ఔట్‌..

– గాయంతో వన్డే కప్‌కు దూరం
– నార్తంప్టన్‌ షైర్‌కు ఎదురుదెబ్బ
లండన్‌: వన్డే కప్‌లో బ్యాట్‌ ఝుళిపిస్తున్న భారత స్టార్‌ క్రికెటర్‌ పృథ్వీ షా గాయ పడ్డాడు. మంగళవారం డుర్హం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా షా మోకాలికి గాయం అయ్యింది. మొదట్లో చిన్న గాయమే అనుకున్నా.. స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువ ఉందని తేలింది. దాంతో, భారత క్రికెట్‌ బోర్డు వైద్య బృందానికి పృథ్వీ షా ఈ విషయం తెలియ చేశాడు. దీంతో నార్తంప్టన్‌షైర్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో.. ‘ఇది మాకు నిజంగా పెద్ద షాక్‌. అద్భుత ఆటతో పృథ్వీ మా క్లబ్‌పై ప్రభావం చూపాడు. ఒకవేళ అతడు మిగతా మ్యాచ్‌లకు దూరమైతే అది మాకు పెద్ద ఎదురుదెబ్బ’ అని నార్తంప్టన్‌షైర్‌ హెడ్‌కోచ్‌ జాన్‌ సాడ్లర్‌ తెలిపాడు. ఈ టోర్నమెంట్‌లో సోమర్‌సెట్‌పై డబుల్‌ సెంచరీ(244), డుర్హంజట్టుపై సెంచరీ(125 నాటౌట్‌)తో చెలరేగాడు.

Spread the love