– కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం
సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం 6 గంటల నుంచే ప్రచార పర్వం మొదలెట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మువ్వా విజరుబాబు, నిరంజన్‌రెడ్డిలతో కలిసి నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ వాకింగ్ చేస్తున్న వారితో కలిసి..ముందుకు నడుస్తూ.. అక్కా, అన్నా అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. హస్తం గుర్తుపై ఓటేసి..తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మైదానంలో క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి, ఇండోర్ షటిల్ కోర్టులో గేమ్ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. మైదానంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డి వాకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాసేవకే పోటీ చేస్తున్నానని, అందరికీ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు మొహమ్మద్ జావిద్, కార్పొరేటర్లు చావా నారాయణ, మిక్కిలినేని మంజుల నరేందర్, నాయకులు కొత్త సీతారాములు, కొప్పుల చంద్రశేఖర్‌రావు, మద్ది కిషోర్ రెడ్డి, హుస్సేన్, వడ్డెబోయిన శ్రీనివాస్, నెల్లూరు చంద్రయ్య, వాకర్స్ క్లబ్ బాధ్యులు మలీదు నాగేశ్వరరావు, కేతినేని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
మంత్రులు తుమ్మల, పొంగులేటి
ఖమ్మంరూరల్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల ముఖ్యనాయకుల సమావేశం మండల పరిధిలో సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల ఓట్ల ఆధిక్యతను ఇచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో అంతకు నాలుగురెట్లు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రస్తుతం తాము అనుభవిస్తున్న పదవులు ప్రజల చలువే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కోసమైనా అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
అధికార మదం, అహంకారంతో విర్రవీగిన బీఆర్‌ఎస్ పాలకులకు ఓటర్లు చెంప చెల్లుమనిపించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్లీ ఇదే పునరావృతం అవుతుందన్నారు. మతోన్మాద బీజేపీ సర్కార్‌ను కేంద్రంలో గద్దెదింపుతామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తప్పనిసరిగా అమలు చేస్తుందని అందులో ఎటువంటి అనుమానాలకు తావులేదన్నారు. ఇప్పటికే అమలు జరుగుతున్న పథకాల గురించి వివరించారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా 15 రోజులు కష్టపడాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధి కంగా ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వివరించారు. సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో పీసీసీ నుంచి వచ్చిన పాలేరు నియోజకవర్గ పరిశీలకుడు అశోక్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీపీఎం నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, నండ్ర ప్రసాద్, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, కొమ్ము శ్రీను, నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని స్వర్ణకుమారి, శ్రీనివాసరెడ్డి, నరేష్ రెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, బండి జగదీశ్, మల్లారెడ్డి, తిరుమలాయపాలెం జడ్పీటీసీ బెల్లం శ్రీనివాసరావు, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, సీపీఐ నాయులు మౌలానా, దండి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది ఆర్‌ఆర్‌ఆర్ చారు..ఎంతో స్పెషలోరు….
ఖమ్మం: సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి (ఆర్‌ఆర్‌ఆర్) శనివారం ఉదయం ప్రచారంలో భాగంగా.. ఓ హౌటల్‌లో చారు కాచారు. నగరంలోని టీడీపీ కార్యాలయం ఎదుట ఉన్న హౌటల్‌కి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు మద్ధినేని స్వర్ణ కుమారి, మువ్వా విజరు బాబు, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తదితరులతో కలిసి వెళ్లారు. అక్కడ..వంట శాల వద్ద గరిట చేతబట్టి సలసలా.. మరుగుతున్న టీని చక్కగా కలిపేసి ఆపై ఎంచక్కా..గ్లాస్‌లోకి పోసి అందించారు. ఇలా అందరితో మమేకమవుతూ..రఘురాంరెడ్డి తన ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అక్కడే అల్పాహారం గావించి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.