మైదానాన్ని స‌మం చేసేందుకు

To level the playing fieldపురుషాధిక్య సమాజంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఆ మహిళా నాయకులకు సరైన గౌరవం ఉండదు. నిర్ణయాల్లో సముచిత స్థానం ఇవ్వరు. పురుషులే పెత్తనం చెలాయిస్తుంటారు. ప్రజాప్రతినిధులైనా తమ హక్కు గురించి మాట్లాడలేని వారెందరో మన సమాజంలో ఉన్నారు. అలాంటి మహిళా నాయకులను శక్తివంతం చేసేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీ షీ రిప్రజెంట్స్‌ ఏడు రోజుల నాయకత్వ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాజకీయ మైదానంలో సమానత్వం కోసం కృషి చేస్తోంది. స్థానికంగా ఎన్నికైన పట్టణ, గ్రామీణ మహిళా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు…
అస్సాంకు చెందిన సహనాజ్‌ ఖానోమ్‌కు అవినీతి వల్ల తన ప్రాంతంలోని నిరుపేద ప్రజలు ప్రభుత్వ పథకాలకు ఎలా దూరమవుతున్నారో గమనించే వరకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. 2014లో తన ప్రాంతంలో మార్పు తెచ్చేందుకు ఆమె మెరిగావ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నిలబడి కమిషనర్‌ అయ్యారు. 2022లో కూడా తిరిగి ఎన్నికయ్యారు. స్థానికంగా ఎన్నికైన మహిళా ప్రతినిధుల కోసం ఢిల్లీలో రూపొందించబడిన ఏడు రోజుల నాయకత్వ కార్యక్రమమైన షీ రిప్రజెంట్స్‌లో పాల్గొన్న 55 మంది మహిళా ప్రతినిధులలో ఆమె కూడా ఉన్నారు.
సానుకూల స్ఫూర్తితో…
‘సవాళ్లను ఎదుర్కొన్న వివిధ రంగాలకు చెందిన అనేక మంది మహిళలను కలిశాను. అసమానతలతో ఎలా పోరాడుతున్నారో, వారి గొంతులను ఎలా వినిపిస్తున్నారో తెలుసుకున్నాను. ఈ అనుభవాలు సానుకూల స్ఫూర్తిని నాలో కలిగించాయి’ అని సహనాజ్‌ చెప్పారు. పార్టీ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండటమే రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన విలువ అని ఆమె ఈ కార్యక్రమం నుండి తెలుసుకున్నారు. అందుకే కార్యక్రమం తర్వాత ఆమె తన పార్టీ సభ్యులతో సబంధాలు మెరుగుపరుచుకున్నారు. కార్యక్రమాలను అమలు చేయడంలో వారిని కూడా భాగస్వాములను చేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ సహనాజ్‌ మహిళా ప్రజాప్రతినిధి అయినందున ఆమెను అప్పటి వరకు వెనక వరుసలో కూర్బోబెట్టేవారు. దీనికి వ్యతిరేకంగా ఆమె ఎప్పుడూ తన స్వరాన్ని పెంచలేదు. ‘ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకున్న తర్వాత నా స్థానాన్ని నేను నిలబెట్టుకోవడం కోసం స్వరాన్ని పెంచాను’ అని ఆమె చెప్పారు.
భిన్నమైన సవాళ్లు
2020లో ప్రారంభమైన షీ రిప్రజెంట్స్‌ అనేది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీ నిర్వహించే కార్యక్రమాలలో ఒకటి. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఇది రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు అట్టడుగు స్థాయి నుండి ఎలా వెళ్లాలో అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజకీయాల విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలకు భిన్నమైన సవాళ్లు ఉంటాయని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీ సహ వ్యవస్థాపకురాలు హేమాక్షి మేఘాని అంటున్నారు. పురుషులు, మహిళలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించిన తర్వాత ఇది ఆమె గ్రహించారు. అందుకే మహిళల కోసం ప్రత్యేక కోహోర్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందులో వారు తమ సవాళ్ల గురించి మాట్లాడవచ్చు. రాజకీయ నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా రాజకీయాల్లో చేరేందుకు ఆసక్తి చూపే మహిళలకు ఆన్‌లైన్‌లో ఆమె శిక్షణ ఇస్తున్నారు.
7 రోజుల కార్యక్రమం
‘రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించడం, నైపుణ్యాలు, జ్ఞానం, నాయకత్వంతో వారిని సన్నద్ధం చేసి ఇతర మహిళలకు రోల్‌ మోడల్‌లను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని మేఘాని చెప్పారు. దాని మొదటి రెండు కోహోర్ట్‌లలో ఎన్నికైన మహిళా ప్రతినిధులు, ఔత్సాహిక మహిళా రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే 2022లో గ్రామీణ, పట్టణ స్థానిక ప్రభుత్వాల నుండి ఎన్నికైన మహిళా ప్రతినిధుల కోసం మాత్రమే దీన్ని పరిమితం చేశారు. ఏడు రోజుల కార్యక్రమం పూర్తిగా విషయాలను మార్చలేనప్పటికీ కొంత వరకైనా వారిలో ఉత్సుకతను, జ్ఞానాన్ని నింపుతుందని సీనియర్‌ ప్రోగ్రామ్‌ అసోసియేట్‌ పౌసలి సర్కార్‌ నమ్ముతున్నారు. ఇది మహిళా నాయకులు వారి తక్షణ రాజకీయ ప్రణాళికలను మెరుగ్గా రూపొందించడంలో సహాయపడుతుంది. ఏడు రోజుల పాటు రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తారు.
సవాళ్ల గురించి మాట్లాడతారు
మహిళల పట్ల ఉన్న వివక్షను అర్థం చేసుకోవడానికి కొన్ని కార్యకలాపాలు నిర్వహిస్తారు. మండల్‌ కమిషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లు మొదలైనవాటితో సహా వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. మహిళలు తమ సవాళ్ల గురించి మాట్లాడతారు. ఆ సమస్యలు పరిష్కరించుకునేందుకు పద్ధతులు వెదుకుతారు. కొన్ని ప్రాంతాల్లో సమస్యలను ఎలా పరిష్కరించారో కూడా చర్చిస్తారు. గత ఏడాది 73, 74వ సవరణలు, ఎన్నికైన ప్రతినిధుల విధులు, బాధ్యతలు, ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఎదుర్కొనే సవాళ్లు, నిధులు ఎలా కేటాయించ బడతాయి, ఎన్నికైన సంస్థలకు నిధులను సేకరించే ఇతర మార్గాలపై సెషన్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఈ మహిళలు పార్లమెంట్‌ను కూడా సందర్శి స్తారు. చివరి రెండు రోజులు అవగాహన ప్రచారాలు, వారి ప్రాంతా ల్లోని కీలక అంశాలు, రాజకీయాల్లో సోషల్‌ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించడంతో పాటు ఇతర విషయాలపై దృష్టి పెడుతుంది. మేఘాని ప్రకారం ఇప్పటివరకు షీ రిప్రజెంట్స్‌ 124 మంది మహిళా ప్రతినిధులతో నాలుగు కోహార్ట్‌లను నిర్వహించింది. ఇది 21 నుండి 50 ఏండ్ల మధ్య వయసు గల మహిళల నుండి దరఖాస్తులను తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
విడుదల కోసం వేచి ఉంది
‘మేము ప్రజలకు సేవ చేయాలని తపించే వారిని, నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారిని, స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులను ఎన్నుకుంటాము. రాజకీయాల్లో చాలా మంది మహిళలకు నిర్ణయాధికార పదవులు ఇవ్వడం లేదు. మన పితృస్వామ్య సమాజంలో మహిళలకంటూ కొన్ని పాత్రలు నిర్వచించబడ్డాయి. రాజకీయ నాయకుడి గురించి మనల్ని అడిగినప్పుడు వెంటనే మన మనసులో కచ్చితంగా ఒక వృద్ధుడి ఇమేజ్‌ వస్తుంది. ఆ స్థానంలో చాలా అరుదుగా స్త్రీలు కనిపిస్తారు. రాజకీయ వాతావరణం కూడా మహిళలకు అనుకూలంగా లేదు. ప్రచారాల్లో టాయిలెట్లు అందుబాటులో లేకపోవడం, పరుష పదజాలం వాడటం కూడా ఇందులో భాగమే. మరో ప్రధాన సమస్య మహిళా రాజకీయ నాయకులకు రోల్‌ మోడల్స్‌ లేకపోవడం. ఇతర మహిళలు ఎవరైనా ఇలా చేయడం చూస్తే, నేను కూడా చేయగలనని వారు నమ్ముతారు. భారతీయ మహిళలకు అపారమైన సామర్థ్యం ఉంది. అయితే అది విడుదల కోసం వేచి ఉంది’ అని అంటారు మేఘాని.

Spread the love