అన్ని రంగాల్లో దూసుకుపోయేందుకు మహిళలు నిత్యం తపిస్తున్నారు. కానీ అనేక రకాల వివక్షలు వారిని నిలువరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మహిళల కోర్కెలను అణచివేస్తున్నాయి. అంతరిక్షంలో ఇంజనీర్లుగా కెరీర్‌ను అత్యున్నతంగా ఊహించుకునే సాధారణ మహిళలు తమ కలలను నిజం చేసుకోవడం అంత సులభం కాదు. అటువంటి మహిళలకు ఓ మంచి అవకాశం కల్పించింది స్పేస్‌టెక్ కంపెని. స్కైరూట్ ఏరోస్పేస్ అంతరిక్ష రంగంలో మహిళల కోసం ప్రముఖ వ్యోమగామి కల్పనా చావ్లా పేరుతో కల్పనా ఫెలోషిప్‌ను ఇటీవలె ప్రారంభించింది. ఈ ఫెలోషిప్ రాబోయే మహిళా ఇంజనీర్‌లను అంతరిక్ష రంగంలో తమ పరిధులను విస్తరించేందుకు ప్రోత్సహించడం, సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది మహిళా ఇంజనీర్లకు అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ ప్రాజెక్ట్‌లతో కలిసి పనిచేయడానికి, స్కైరూట్‌లో కెరీర్ అవకాశాలు పొంది వృత్తిలో ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ రంగంలో తమ సత్తా చాటుకోవాలని తపించే మహిళలకు సృజనాత్మకత, ఆవిష్కరణలు, నాయకత్వ మార్గాలను పెంపొందించడం ఈ ఫెలోషిప్ లక్ష్యం అని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది నెలవారీ అందించే స్టైపెండ్, నాణ్యమైన శిక్షణ, అనుభవజ్ఞులైన నిపుణుల నుండి మార్గదర్శకత్వం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకోవడంతో పాటు స్కైరూట్ ఏరోస్పేస్‌లో వినూత్న సాంకేతికతలను అందిస్తుంది.
మహిళలు అగ్రభాగంలో ఉంటారు
‘అంతరిక్ష రంగంలో మనకు ఎక్కువ మంది మహిళలు అవసరం. కొత్త ఆవిష్కరణలు చేయడంలో, సృజనాత్మకంగా ఆలోచించడంలో మహిళలు అగ్రభాగంలో ఉంటారు. అందువల్ల మహిళా ఇంజనీర్లకు అత్యాధునిక అంతరిక్ష ప్రాజెక్టులలో పని చేయడానికి, అగ్రశ్రేణి నిపుణుల నుండి మార్గదర్శకత్వం పొందేందుకు, స్కైరూట్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను పొందేందుకు ఉత్తేజకరమైన అవకాశాలను అందించడానికి మేము కల్పనా ఫెలోషిప్‌ను రూపొందించాం’ అని సహ వ్యవస్థాపకులు, సీఈఓ అయిన చందన అంటున్నారు.
ఎంపిక మూడు దశల్లో…
స్కైరూట్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు నెలవారీ భత్యం అందించబడుతుంది. సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల నుండి చివరి ఏడాది విద్యార్థులు, ఇటీవల గ్రాడ్యుయేట్లు ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2024 ఫెలోషిప్ నమోదు కోసం ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపిక తీరును పరిశీలిస్తే ఇందులో మూడు దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఫెలోషిప్ పొందేందుకు, లక్ష్యాలను సాధించడానికి కల్పనా ఫెలోకు అవసరమైన మానసిక, విద్యాపరమైన సామర్థ్యాలను గుర్తించడానికి, అంచనా వేయడానికి ఈ దశలను రూపొందించారు.
అభ్యర్థులు తమ ఫెలోషిప్‌ని పూర్తి చేసిన తర్వాత
వారిలో అత్యంత నైపుణ్యం కలిగిన, అర్హులైన వారు కంపెనీలో పూర్తి స్థాయి ఉద్యోగులుగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం స్కైరూట్ ఏరోస్పేస్ అత్యాధునిక అంతరిక్ష ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడానికి అంకితమైన 300 మంది అంతరిక్ష నిపుణుల బృందాన్ని కలిగి ఉంది. భారతదేశంలో మొట్టమొదటి సారి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన ఘనత దీనికి ఉంది. ‘హోరిజోన్‌లో ఉత్తేజకరమైన మిషన్‌లు, అత్యున్నత సాంకేతికతలను నిరంతరం ఉపయోగిస్తూ కల్పనా ఫెలోషిప్ ప్రతిభా వంతులైన స్పేస్ ఇంజనీర్ లకు పరివర్తనాత్మక పురోగతికి దోహదపడే అవకాశాలను అందిస్తుంది’ అని స్కైరూట్ సహ వ్యవస్థాపకులు, సీఓఓ భరత్ డాకా అన్నారు. ‘మేము ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. దీని ద్వారా అర్హులైన అభ్యర్థులు ఫెలోషిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మా టీమ్‌లు భారతదేశంలోని వివిధ విద్యా సంస్థలకు అవగాహన కల్పించడానికి, అవకాశాన్ని పొందేందుకు అభ్యర్థులు దీన్ని విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు.