మటన్‌తో వెరైటీలు…

Varieties with Mutton...నాన్‌వెజ్‌లో చాలా మంది మటన్‌ అంటే ఎంతో ఇష్టపడతారు. మటన్‌ లో అధికంగా ప్రొటీన్లుంటాయి. శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగిన మంచి పౌష్టికాహారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. అధికమోతాదులో తీసుకోవటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మటన్‌తో గోంగూర మటన్‌, బెండకాయ మటన్‌, బిర్యానీ ఇలా అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. మటన్‌లో లివర్‌, గుండె, కాళ్లు, తలకాయ ఇలా వేరు వేరుగా వండుకుంటుంటారు. అయితే మటన్‌తో చేసుకునే కొన్ని వంటలు చూద్దాం…
పోషకాలు
మటన్‌లో బి1, బి2, బి3, బి9, బి12 విటమిన్లు ఉంటాయి. విటమిన్‌ఇ, కె, సహజ ఫ్యాట్స్‌, కొలెస్ట్రాల్‌, అమినోయాసిడ్స్‌, మాంగనీసు, కాల్షియం, జింక్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, సెలేనియం, పొటాషియం, సోడియం, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఒమేగా6 ఫ్యాటీయాసిడ్స్‌ ఉంటాయి. మటన్‌లో ప్రొటీన్లు, న్యూట్రియంట్లు, బి12 బాగా ఉండడం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యం తోపాటు, ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి, దెబ్బతిన్న కణాలు సరికావటానికి దోహదపడుతుంది. గర్భిణులు తమ డైట్‌లో మటన్‌ని కూడా తింటే పుట్టే బిడ్డలకు న్యూరల్‌ ట్యూబ్‌ వంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. మటన్‌లో బీకాంప్లెక్స్‌, సెలినియం, కొలైన్‌ వంటివి క్యాన్సర్‌ బారిన పడకుండా దోహదపడతాయి. అధిక పొటాషియం, తక్కువ సోడియంలు ఉండడం వల్ల రక్తపోటు, స్ట్రోకు, మూత్రపిండాల సమస్యలు రాకుండా చూడవచ్చు. మటన్‌లో ఎక్కవగా ఉండే కాల్షియం ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. సొరియాసిస్‌, ఎగ్జిమా, వంటి చర్మ సమస్యలను తొలగిపోతాయి. చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్న వారు మటన్‌ తినటం అంత శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్‌ మరింత పెరగటంతోపాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఇందులో అధికంగా ఉండే కొవ్వు పదార్ధాలు షుగర్‌ లెవల్స్‌ పెరగటానికి కారణమౌతాయని పరిశోధనల్లో తేలింది. 40 సంవత్సరాలు పై బడిన వారు మటన్‌ అడపతడపా తప్ప అదేపనిగా మటన్‌ ను ఆహారంలో భాగం చేసుకోవటం మంచిదికాదు.
బెండకాయ మటన్‌
కావాల్సిన పదార్థాలు : బెండకాయలు – అర కేజీ, మటన్‌ – అర కేజీ, నెయ్యి – రెండు చెంచాలు, జీలకర్ర – చెంచా, దాల్చినచెక్క – రెండు అంగుళాల ముక్క, నల్లయాలకులు – నాలుగు, మిరియాలు – పది, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, టొమాటోలు – రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు చెంచాలు, పసుపు – అర చెంచా, ధనియాలపొడి – రెండు చెంచాలు, నూనె – రెండు చెంచాలు, కారం – చెంచా, గరం మసాలా పొడి – చెంచా, కొత్తిమీర తురుము – నాలుగు చెంచాలు, ఉప్పు – రుచికి సరిపడా
తయారుచేసే విధానం : బెండకాయలు కడిగి తొడిమలూ, చివర్లూ తీసేసి ఒకవైపున చీల్చినట్లుగా గాటు పెట్టాలి. ఓ బాణలిలో నూనె వేసి అరచెంచా జీలకర్ర వేసి వేగాక బెండకాయలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి వేసి కాగాక అర చెంచా జీలకర్ర, దాల్చినచెక్క, నల్ల యాలకులు, మిరియాలు, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత చీల్చిన పచ్చిమిర్చి, మటన్‌ ముక్కలు వేసి కలపాలి. ఇందులోనే అల్లంవెల్లుల్లి, ఉప్పు, పసుపు, ధనియాలపొడి వేసి కలపాలి. మంచినీళ్లు పోసి ఓ సారి కలిపి ఓ పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత టొమాటో గుజ్జు, కారం, గరంమసాలా వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర తురుము, వేయించిన బెండకాయలు కూడా వేసి ఉప్పు సరిచూసి కుక్కర్‌ మూతపెట్టి ఓ విజిల్‌ రానివ్వాలి. మంట తగ్గించి సిమ్‌లో ఇరవై నిమిషాలపాటు ఉడికించి దించాలి.
బిర్యాని
కావాల్సిన పదార్థాలు : బోన్‌లెస్‌ మటన్‌ – అర కేజీ, బాస్మతి బియ్యం – అర కేజీ, అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు చెంచాలు, ఉల్లిగడ్డ – ఒకటి, ధనియాల పొడి – రెండు చెంచాలు, గరం మసాలా – చెంచా, కారం – చెంచా, పచ్చిమిరపకాయలు – నాలుగు, లవంగాలు – ఐదు, దాల్చిన చెక్కలు – నాలుగు, కొత్తిమీర కట్ట – ఒకటి, నెయ్యి – రెండు చెంచాలు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా.
తయారుచేసే విధానం : ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, ఒక చెంచా అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేగించాలి. తర్వాత మటన్‌ వేసి బాగా ఉడికించి దించేయాలి. తర్వాత మరో మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఒక టీ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత బియ్యం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి వేయించాలి. ఓ ఐదు నిమిషాలు వేయించాక ఉడికించిన మటన్‌ వేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. బియ్యం కొలతకు సగం ఎక్కువగా నీళ్లు పోసుకుని ఉడికించి దించేయాలి. దించే ముందు కొత్తిమీర తురుము చల్లుకుని దించి, వేడివేడిగా వడ్డిస్తే సరి.
కొల్హాపురీ మటన్‌
కావాల్సిన పదార్థాలు : మటన్‌ – కేజీ, కారం – చెంచా, నూనె – కప్పు, టొమాటోలు – రెండు, ఉల్లిపాయలు – నాలుగు, కొత్తిమీర – కట్ట, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు చెంచాలు, పసుపు – పావు చెంచా, ఉప్పు – తగినంత, నువ్వులు – రెండు చెంచాలు, యాలకులు – నాలుగు, కొబ్బరి – రెండు చెంచాలు, ఎండు కొబ్బరి తురుము – రెండు చెంచాలు, ధనియాల పొడి – చెంచా, జీలకర్రపొడి – చెంచా, మిరియాలు – ముప్పావు చెంచా, దాల్చినచెక్క – పెద్ద ముక్క, లవంగాలు – నాలుగైదు, గసగసాలు – చెంచా, నెయ్యి – రెండు చెంచా,
తయారుచేసే విధానం : మందపాటి కడాయిలో నూనె లేకుండా నువ్వులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు వేయించుకోవాలి. తర్వాత మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీరా, తాజా కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అల్లంవెల్లుల్లి పేస్టు వేయించుకోవాలి. అందులో ముందుగా చేసుకున్న మసాలా పొడి వేయాలి. తర్వాత కొబ్బరి మిశ్రమం వేయాలి. పచ్చివాసన పోయాక మటన్‌ ముక్కలూ, తగినంత ఉప్పు వేసి మూతపెట్టేయాలి. మటన్‌ మెత్తగా ఉడికాక ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది. ఇది బిర్యానీ, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది.

Spread the love