ఇవి కారణాలు కావొచ్చు…

These could be the reasons...మహిళల రుతుచక్రం వారి ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యం సరిగా ఉంటే, రుతుచక్రం క్రమంతప్పకుండా వస్తుంది. ఇందులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి అంటే వారి ఆరోగ్యంలో, జీవనశైలిలో మార్పులు చోటు చేసుకున్నాయని అర్థం. క్రమరహిత రుతుస్రావం రెండు సందర్భాలలో మాత్రమే ఉంటుంది. ఒకటి రుతుక్రమం ప్రారంభం కాగానే, రెండోది రుతుక్రమం ఆగిపోయే సమయంలోనే. కానీ స్త్రీ శరీరం అనేక మార్పులకు అనుగుణంగా, రుతుచక్రంలో మార్పులు ఉండవచ్చు. ప్రతి నెలా 28 రోజులకు ఒకసారి రుతుక్రమం జరగాలి. 21 నుండి 35 రోజుల మధ్య కాలం ఆరోగ్యకరమైనది. ఈ వ్యవధిలో రుతుక్రమం జరగకపోతే దానిని క్రమరహిత రుతుస్రావం అంటారు. అలాంటప్పుడు శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఈ క్రమరహితానికి ఏమేమి కారణాలో తెలుసుకుందాం.

ఒత్తిడి : శారీరక లేదా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు అధికంగా ఉంటే, అది పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోవచ్చు. దీని ద్వారా రుతుచక్రం ఆలస్యం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గర్భనిరోధక మాత్రలు : గర్భనిరోధక మాత్రల వల్ల రుతుక్రమం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. గర్భనిరోధక మాత్రలు శరీరంలో అండాల విడుదలను నిలిపివేస్తాయి. అండం విడుదల కాకపోతే రుతుక్రమం రాదు. ఈ అత్యవసర గర్భనిరోధక మాత్రలు రుతుస్రావం ఆలస్యం లేదా వాయిదా వేయవచ్చు. యాంటిడిప్రెసెంట్స్‌ కూడా రుతుస్రావం ఆలస్యం చేయవచ్చు. యాంటిసైకోటిక్స్‌, కార్టికోస్టెరాయిడ్స్‌, కీమోథెరపీ కూడా దీనికి కారణం అవ్వొచ్చు.
మధుమేహం : మధుమేహం లేదా పేగు సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు మారినప్పుడు హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చాలా అరుదు. కానీ మధుమేహం క్రమరహిత రుతుచక్రాలకు దారి తీస్తుంది.
అధిక బరువు : ఊబకాయం శరీరం హార్మోన్ల మార్పులకు కారణం అవుతుంది. దీని వల్ల కూడా రుతుస్రావం ఆలస్యం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయంలో వైద్యులు సూచించిన ఆహారం, వ్యాయామాలు పాటించాలి. అలా చేస్తేనే ప్రతినెలా సరైన సమయంలో పీరియడ్స్‌ వస్తాయి. అయితే కొందరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారు తక్కువ శరీర బరువు కలిగి ఉంటారు. ఇది కూడా రుతుక్రమం ఆలస్యం లేదా కోల్పోయేందుకు కారణం అవుతుంది. అందుకే బరువును కూడా సరిగా మెయింటెన్‌ చేయాలి. పీరియడ్స్‌ సరిగా ఉంటే స్త్రీల ఆరోగ్యం బాగుంటటుంది.
థైరాయిడ్‌ : ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్‌. ఈ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి ఇది ఇతర శరీర వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ థైరాయిడ్‌ అసమతుల్యత రుతు చక్రంలో మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉంది.
పాలిచ్చే తల్లులు : పాలు తాగే పిల్లలు ఉన్న తల్లులకు కొంత కాలం వరకు పీరియడ్స్‌ రాకపోవచ్చు. తల్లి పాలను ఉత్పత్తి చేయడానికి కారణమయ్యే ప్రోలాక్టిన్‌ అనే హార్మోన్‌ కారణంగా ఇది జరుగుతుంటుంది. అందువల్ల పాలిచ్చే తల్లులకు పీరియడ్స్‌లో సమస్యలు ఉండవచ్చు.
అందువల్ల స్త్రీ తానున్న పరిస్థితిని బట్టి వైద్యుని సలహాలు సూచనలు పాటిస్తూ రుతుక్రమం క్రమంగా ఉండేలా చూసుకోవాలి.

Spread the love