ఈ లక్షణాలను గుర్తించారా…?

Recognize these features...?మానవ శరీరంలోని వివిధ అవయవాలు ఎన్నో పనులు చేస్తుంటాయి. అన్ని వయసుల వారికి బాడీకి పోషకాలు అవసరం. ఆరోగ్య పరంగా చోటుచేసుకునే కొన్ని కొన్ని మార్పులకు, శరీరంలో కొన్ని లోపించడం కారణం కావచ్చు. అందులో బాడీ పెయిన్స్‌, సడెన్‌గా బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా ముసలివారు కాళ్ళనొప్పులు, చేయి నొప్పులని పట్టించుకోరు. కానీ వయసులో ఉన్నవారికీ ఈ నొప్పులు వస్తుంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. వాటిని త్వరగా గుర్తిస్తే, సమస్యను అంతే త్వరగా పరిష్కరించుకోవచ్చు. లేదంటే పెద్ద సమస్యలకుదారి తీయవచ్చు. వీటికి సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో ప్రధానం చెప్పుకోవలసినది కాల్షియం లోపం. దీని వల్ల శరీరంలో ఏమేమి సమస్యలు వస్తుంటాయి. కాల్షియం మెరుగుపరుచుకునేందుకు ఏమేం చేయాలో ఇప్పుడు చూద్దాం..

శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల అనేక సమస్యలొస్తాయి. ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకి కాల్షియం చాలా ముఖ్యమైనది. చిన్నప్పట్నుంచి పాల ఉత్పత్తులు తీసుకునేవారికి ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. సాధారణంగా యుక్త వయస్సు, వద్ధాప్యంలో మాత్రమే ఎముక సంబంధిత సమస్యలొస్తాయి. కనుక పాలతో పాటు పెరుగు, బచ్చలికూర, బ్రకోలీ, ఆకుకూరలు, కాల్షియం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
ఏర్పడే సమస్యలు
– శరీరంలో కాల్షియం లోపించడం వల్ల ఇమ్యూనిటీ సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల తరచుగా వ్యాధికారక క్రిములు మన ఆరోగ్యంపై దాడి చేసి అనారోగ్యానికి గురిచేస్తాయి.
– శ్వాసకోశ, పేగుల్లో ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది.
– కాల్షియ లోపం ఉన్నవారికి రెగ్యులర్‌గా ఎముకలు, కీళ్ళ నొప్పులు వస్తాయి.
– కాల్షియం స్థాయి తక్కువగా ఉంటే రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తద్వారా మానసిక సమస్యలుంటాయి.
– గోర్లు బలహీనంగా మారి విరిగిపోతుంటాయి.
– దంతాల నొప్పులు కూడా కాల్షియం లోపం వల్లే కావచ్చు.
– కండరాల నొప్పులకు కూడా కాల్షియం లోపం కారణమయి వుండవచ్చు.
– ఆడవారిలో కాల్షియం లోపం ఉంటే పీరియడ్స్‌ టైమ్‌లో వారికి నొప్పి ఎక్కువగా ఉంటుంది. బాడీలో తగినంత కాల్షియం ఉంటే నొప్పి తగ్గుతుంది. కానీ, కాల్షియం తక్కువగా ఉంటే అధిక రక్తస్రావం, నొప్పి ఎక్కువగా ఉంటుంది.
– మహిళల్లో గర్భాశయం సరైన పెరుగుదల, అండాశయాల హార్మోన్‌ ఉత్పత్తిలో కాల్షియం కీ రోల్‌ పోషిస్తుంది.
కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు
పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
– పాలు, పాల పదార్థాలలో అధికంగా కాల్షియం ఉంటుంది. అందువల్ల వాటిని రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
– మనం అప్పుడప్పుడు చపాతీల రూపంలో తీసుకునే గోధుమ పిండిలోనూ కాల్షియం మోతాదు ఉంటుంది.
– ముల్లంగి, క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికం, బ్రకోలి వంటి కూరగాయలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
– ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూరలో కాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.
– కిస్‌మిస్‌, బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌లోనూ కాల్షియం ఉంటుంది.
– రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు తినాలని గవర్నమెంటే సూచిస్తుంది.
– లివర్‌, బోన్‌లెస్‌ చికెన్‌లోనూ కాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.
– చేపలు తినడం వల్ల కాల్షియం పుష్కలంగా అందుతుంది.

Spread the love