ముగ్గురూ ముగ్గురే!

ముగ్గురూ ముగ్గురే!అదొక ఊరు. ఊరన్నాక వాడలు, వాడలన్నాక మేడలు ఉండాల్సిందే కద. వాడలూ, మేడలూ ఉన్నచోట మనుషులుంటారు మరి. మనుషుల్లో కొందరు చీమల్లా కష్టపడేవాళ్లయితే కొందరు దోమల్లా ఇతరుల నెత్తురు తాగేవాళ్లు మరి. మనుషుల్లో రకరకాల వాళ్లున్నా, పెద్ద మనుషులు వేరే కదా! పెద్దమనుషులంటే వయసులో పెద్దవాళ్లని కాదు, పెత్తనం చలాయించే వాళ్లన్నమాట! పెత్తనం చలాయించే పెద్దమనుషులు ఒకరా ఇద్దరా ముగ్గురున్నారు ముచ్చటగా ఆ ఊళ్లో!
పెద్దమనుషులంటే తెల్సిందే కద, ఊళ్లేలేవాళ్లని అర్ధం. ఊళ్లు ఏలేవాళ్లు తాము హద్దుమీరి ప్రవర్తిస్తారు గాని, తతిమ్మా వాళ్లని హద్దుల్లో పెట్టాలని అనుకుంటారు. దెయ్యాలూ, తామూ మాత్రమే వేదాలు వల్లించాలనుకుంటారు.
ఊరి మీద పెత్తనం చలాయించాలనుకునే వారున్న ఆ ఊరి పెద్దల్లో ఒకడు ఎల్లారావయితే మిగతా ఇద్దరు పుల్లారావు, మల్లారావులు. ముగ్గురికీ ఉన్న ఏకైక జీవితాదర్శం ఒక్కటే! ఆ ఊరిని తామే ఏలాలని, తమ మాటే చెల్లుబడి కావాలనివారి పంతం.
ఈ ముగ్గురిలోనూ అనేక విశేష లక్షణాలున్నాయి. ఒకడు కోతలరాయుడైతే, మరొకడు అస్తమానూ ప్రతి దాంట్లో వేలు పెట్టేవాడు. ఇంకొకడు ఎదురుపడ్డ ప్రతివాడి చెవుల్లో పూలు అలంకరించేవాడు. ఈ ముగ్గురూ ఒకరిమీద ఒకరు గేదెపేడ, పందులు పొర్లాడిన బురద చల్లుకోవడంతో పాటు కారాలు, మిర్యాలు నూరుకుంటుంటారు. ముగ్గురూ ఒకరికొకరు బద్ధశత్రువులేననుకుంటారు ఊరిజనం. కాదు పైకి శత్రువుల్లా కనిపిస్తారు కానీ లోపల్లోపల మిత్రులే అనుకునేవాళ్లూ లేకపోలేదు. ఈ విషయమే ఒకడెవడో పట్టుబట్టి అడిగాడు ముగ్గుర్నీ.
అప్పుడు ఎల్లారావు ‘నాకు పుల్లారావు, మల్లారావు ఇద్దరూ శత్రువులే. కానీ ఓ రహస్యం చెప్తా. అదేమిటంటే పుల్లారావు, మల్లారావు మాత్రం పైకి చెప్పరు గానీ మంచి మిత్రులు, జిగ్రీ దోస్తులు’ అన్నాడు. ఇదే విషయం పుల్లారావునడిగితే ‘నాకు ఎల్లారావు, మల్లారావు ఇద్దరూ శత్రువులే. కానీ రహస్యంగా మాత్రం ఎల్లారావు, మల్లారావులిద్దరూ ఫ్రెండ్సే’ అన్నాడు. మల్లారావు ‘ఉన్నదున్నట్టు చెప్పాలంటే.. నాకు శత్రువులు కానీ వాళ్లిద్దరూ మంచి మిత్రులే. ఎల్లారావు, పుల్లారావులిద్దరూ జిగ్రీదోస్తులే’ అన్నాడు.
ఈ విషయం విన్న జనానికి విషయం తిన్నగా అర్ధం కాలేదు. ఓ లెక్కల మాస్టారు విషయం తేలిగ్గా అర్ధం అయ్యే పద్ధతిలో వివరణ ఇచ్చాడు. ఏ,బీ,సీ అనే ముగ్గురు వ్యక్తులున్నారనుకోండి… ఇప్పుడు ‘ఏ’ అనే వాడి ప్రకారం బీ,సీ లు మిత్రులు. ‘బీ’ అనేవాడి ప్రకారం ‘ఏ, సీ’లు మిత్రులు, ఇక ‘సీ’ అనేవాడి ప్రకారం ‘ఏ,బీ’లు మిత్రులు. ఈ వివరణ విన్నాక జనం విషయం బాగా అర్ధం చేసుకోగలిగారు. వీళ్లు ఎవళ్లకి ఎవళ్లు ఏమీ కారు, కానీ మిగతా ఇద్దరినీ కలిపి తమను మాత్రం వేరుగా ఉంచుకుని, అవతలివాళ్లు కుట్రదారులు అని చెప్పాలనుకుంటారన్నమాట. అవసరం లేకపోతే జుట్లు పట్టుకునేవాళ్లు, అవసరం అయితే ఎవరికాళ్లు ఎవరైనా పట్టుకోగలరని అర్ధం అవనివాళ్లు చాలా కొద్దిమందే మిగిలారు ఆ ఊళ్లో.
ఊరిమీద పెత్తనం చలాయించాలనుకుంటున్న ఈ ముగ్గురు పెద్దమనుషుల్లో ఉన్న అనేక విశేషాల లక్షణాల్లో చెప్పుకోదగ్గది మరొకటి ఉన్నది. ఈ ముగ్గురినోళ్లల్లోనూ నరంలేని నాలుకలున్నాయి. అందరి నాలుకల మీదా ‘టేస్ట్‌ బడ్స్‌’ ఉంటాయి. కాని వీళ్ల నాలుకల మీద ఉన్న బడ్స్‌ ఏవో పరిశోధించే వారెవరూ లేరు మరి. వీరు మాట్లాడేది సంస్కృతం అని ఒకరంటే, వీరి విషయంలో సంస్కృతం అంటే పచ్చిబూతు అని మరొకరు విడమర్చారు.
ఎల్లారావు తన తల్లో పురుగులు తిరిగితే నాలుకకి పూర్తి స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. అవతలివాడ్ని సన్నాసీ అంటాడు. అడ్డొచ్చినవాడి తోలు తీసేస్తానంటాడు, నాలుక చీరేస్తానంటాడు, కంఠం ముక్కలుగా నరికేస్తానంటాడు. పుల్లారావు నాలుక మరీ చప్పటిదేంకాదు. అవతలివాడ్ని నూరు అడుగుల గొయ్యి తీసి బొందపెడ్తానంటాడు. మల్లారావు మరింత దూకుడుగా ఎవడైనాసరే, గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తానంటాడు. ఇలాగ ప్రతి ఒక్కడూ మిగతా ఇద్దరికీ కలిపి ‘బూతు పంచాంగ శ్రవణం’ చేస్తుండటంతో ఊరంతా బూతుమయం అయిపోయింది. జనం ఒకళ్లమీద ఒకళ్లకు వచ్చిన కోపాగ్నిని చల్లార్చుకోడానికి ఫైర్‌ ఇంజన్లను పిలవకుండా, ముగ్గురు పెద్ద మనుషుల నాలుకల నుండి జాలువారిన అమృతధారలను అందిపుచ్చుకోసాగారు. నీటి పంపుల దగ్గర తిట్టుకునే ఆడవాళ్లు ఇన్నేళ్లుగా మనం తిట్టుకున్న తిట్లు ‘అవుట్‌ డేటెడ్‌’ అయినయి అంటూ ఆ ముగ్గురిపేరు చెప్పుకుని ‘అప్‌డేట్‌’ అవసాగారు. మన భాషలో ఇంత బూతుసంపద ఉన్నదన్న విషయం ఇప్పుడే తెల్సింది. ‘బ్రౌన్‌’ మహాశయుడి లాంటి వాడు మళ్లీ పుట్టి ‘లక్ష బూతు పదార్చన’ చేస్తూ ఓ గ్రంథం రాస్తే బాగుండును అనుకున్నారు బడిపంతుళ్లు. బడి పిల్లలు ఒకడిని ఒకడు, నువ్వో శనిగ్రహానివి అని తిడితే, ఆ ఒకడు నువ్వో గారడీ వాడివి, బుడబుక్కలోడివి అని జవాబిస్తున్నాడు. ముక్కు నేలకు రాయిస్తాననడం, చెప్పుతో కొడ్తాననడమే కాదు ‘చెప్పెత్తి’ చూపడం వంటివి మామూలైపోయినవి. ఇదొక కొత్త భాష. ఇదొక రాజకీయ పరిభాష. ఈ భాష మీద విశ్వ విద్యాలయాలు సమగ్ర పరిశోధన జరిపించాల్సిందేనన్నారు కొందరు భాషాప్రయోగవాదులు.
ముగ్గురు పెద్ద మనుషులు స్వపక్షం అయినా, విపక్షం అయినా ప్రజల్ని, సమస్యల్నీ పట్టించుకోవాలి కాని, ఒకరి ‘తాట’ ఒకరు తీసుకోవడం, నాలుకలు చీరేసుకోవడం వల్ల ఊరు బాగుపడదు అనుకోసారు. ‘ఆధార్‌ కార్డులూ’, ‘ఓటర్‌ ఐడీ కార్డులూ’ ఉన్న సామాన్యులు.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

Spread the love