మతిమరుపు దొంగ

మతిమరుపు దొంగఒక ఊర్లో ఒక దొంగ ఉండేవాడు. అతను పగలంతా కష్టపడి ఊరూరా తిరిగి రాత్రి ఎక్కడకు దొంగతనానికి వెళ్ళాలో నిర్ణయించుకునేవాడు. వాళ్ళ ఊరిలో మాత్రం దొంగతనం చేసేవాడు కాదు. తన వాళ్ళను దోచుకోవడం తప్పు అని నమ్మేవాడు. చుట్టు పక్కల ఊర్లలో దొంగతనాలు చేసేవాడు. అంతా బాగుంటే దొంగ దొరైపోడూ! అందుకే దేవుడు ఆ దొంగకు దోసకాయంత మతిమరుపు ఇచ్చాడు. ఒక రోజు మిట్ట మధ్యాహ్నం ఆ దొంగ పక్క ఊరిలో తిరుగుతూ ఉండగా అతనికి కొత్త ఇల్లు ఒకటి కనపడింది. ఇల్లు చిన్నదిగా ఉన్నా బాగా అందంగా ఉంది. బయటకే ఇంత అందంగా ఉంటే లోపల ఇంకెంత అందమైన వస్తువులు ఉన్నాయో అనుకున్నాడు. ఆ రాత్రికి తను ఆ ఇంట్లోనే దోపిడీ చేయాలని అనుకున్నాడు.
పగలు అదే ఊరిలో తిరిగితే జనానికి అనుమానం వస్తుందని అక్కడ నుండి బయల్దేరి తన ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడుతుండగానే అన్నం తినేసి చిన్న కునుకు కూడా తీశాడు. తరువాత దొంగతనానికి బయల్దేరుతూ నిద్రపోతున్న భార్యను లేపి ”నేను పని మీద పోతున్నా. నీ అదృష్టం బాగుంటే ఇవాళ కాసుల వర్షమే” అనేసరికి ఆమె మురిసిపోయింది. ఎప్పుడూ లేనిది మగనికి ఎదురొచ్చి మరీ దొంగతనానికి పంపింది. వెళ్తూ వెళ్తూ దొంగ ఆమెకు ”జాగ్రత్త! అసలే దొంగల భయం” అని చెప్పాడు. పక్క ఊరికి చేరుకునే సరికి అర్ధరాత్రి దాటింది. దొంగతనానికి ఇదే మంచి సమయం! అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. తన నేర్పుతో దొంగ ఇంటి లోపలకు వెళ్ళాడు. వంటింట్లో వెతికాడు. ఏమీ దొరకలేదు. వంటింటి బయటకు రాగానే కాలికి గడప తగిలి ఎదురుగా ఉన్న బియ్యం డబ్బాలో పడ్డాడు. చేతికి ఎదో గుడ్డ లాంటిది తగిలింది. చుస్తే ఎదో మూట కట్టి ఉంది. అదృష్టం అంటే బూరెల బుట్టలో పడతామని విన్నాడు గానీ ఇలా బియ్యం డబ్బాలో పడడమని ఇప్పుడే తెలిసింది. ఇంకో అదష్టమేంటంటే ఆ ఇంటి వాళ్ళు ఆదమరిచి పడుకోవడం. తన పంట పండిందనుకుని అక్కడ నుండి బయటపడ్డాడు.
ఇంటికెళ్ళగానే భార్యకు మూట తీసి చూపించాడు. అందులో బంగారు నగలు ఉన్నాయి. హారతి పట్టవలసిన భార్య కర్ర పట్టుకుని కొట్టడం మొదలుపెట్టింది. దొంగకు అర్ధం కాలేదు.” ఎవరింటికి దొంగతనానికి పోయావో తెలుసా.. మా అక్క ఇంటికి. వాళ్ళ ఇంట్లో నేను దాచిన మన బంగారాన్నే ఎత్తుకొచ్చావు” అంటూ చితకబాదింది. ”నేను దొంగతనం చేయడం వలనే మన బంగారం మనకు దక్కింది. వేరే ఎవరైనా దొంగిలించి ఉంటే …?” అన్నాడు భార్య చేతిలో కర్ర పట్టుకుంటూ. ”ఈ మూట కట్టిన చీర నాదే అని నీకింకా గుర్తురాలేదా?” అని ఇంకో నాలుగు తగిలించింది భార్య.
– డా|| హారిక చెరుకుపల్లి, 9000559913

Spread the love