డైట్‌లో అపోహలు – వాస్తవాలు

చాలా వరకు బరువు తగ్గడానికి డైట్‌ చేస్తుంటారు. దానికి కొన్ని అపోహల వల్ల చాలా కఠినంగా చేస్తూ వేరే ఇతర ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. లేదా డైట్‌ మధ్యలోనే ఆపేసి, వున్నప్పటి కంటే ఇంకా ఎక్కువ బరువు పెరుగుతుంటారు. వీటన్నింటికీ కారణం సరైన అవగాహన లేకపోవడం. అపోహలను నమ్మి వాస్తవాలను విస్మరించడం. బరువు తగ్గడానికి ఆహారం తీసుకోవడంలో వున్న కొన్ని అపోహల్ని, వాస్తవాల్ని ఇక్కడ చూద్దాం.

1. అపోహ : ఉపవాసాలు చేస్తే బరువు తగ్గుతారు. ఏమీ తినకుండా వుండడం వల్ల బరువు తగ్గుతారు అనుకోవడం.
వాస్తవం : ఉపవాసాలు చేయడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు శరీరంలోని గ్లూకోన్‌ స్థాయిలు తగ్గడం వలన అతి చిన్న వయసులోనే షుగర్‌ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఉదయం నుంచి తినకుండా మైండ్‌ని కంట్రోల్‌ చేయడం వలన ప్రతి రోజు తినాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారు. దీని వలన బరువు పెరుగుతారు.
2.అపోహ : కార్బోహైడ్రేట్స్‌ అస్సలు తినకూడదు. రైస్‌ని (కార్బోహైడ్రేట్స్‌) పూర్తిగా మానేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు అనుకోవడం.
వాస్తవం : భారతీయ జీవన విధానంలో అన్నానికి ప్రత్యేక స్థానం వుంది. ఆహారపు అలవాట్లలో ఇది ఒక భాగం. సడన్‌గా రైన్‌ని మానేయడం కరెక్ట్‌ కాదు. పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందకపోవడం వల్ల కార్బోహైడ్రేట్‌ డెఫిషియన్సీ వల్ల త్వరగా నీరసపడిపోతారు. దీనివల్ల ‘లాంగ్‌ టైమ్‌’ వరకు డైట్‌ చేయలేరు. డైటింగ్‌ లో వున్నప్పుడు మద్యాహ్నం పూట ఒక కప్పు రైస్‌ ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి.
నోట్‌ : ఫాస్టింగ్‌లో వున్నప్పుడు షుగర్‌ లెవల్స్‌ 200 వున్నట్లయితే ఆ రోజు రైస్‌కి బదులు రోటి, ఓట్స్‌, జొన్న అన్నం తినాలి. పూర్తిగా కార్బోహైడ్రేట్స్‌ (పిండి పదార్థాలు) లేని ఆహారం తీసుకోకూడదు.
3 అపోహ : ఆహారంలో నూనె పూర్తిగా మానేయాలి. కూరలు వండేటప్పుడు నూనె అసలు వుపయోగించకపోతే బరువు తగ్గుతారు అనుకోవడం.
వాస్తవం : శరీరానికి కనీస ఫ్యాట్‌ ప్రతిరోజూ అవసరం. ఫ్యాట్‌ లేకుండా డైట్‌ చేసినట్లయితే ఫ్యాట్‌ లో కరిగే విటమిన్‌ (ఎ,డి,ఇ,కె) డెఫిషియన్సీ (లోపాలు) వస్తాయి. ముఖ్యంగా జుట్టురాలడం మొదలవుతుంది. ఎందుకంటే జుట్టు, గోళ్ల సంరక్షణకు విటమిన్‌ ఇ వుపయోగపడుతుంది. ఫ్యాట్‌ లేకపోతే విటమిన్‌ ఇ శరీరానికి అందదు. ఇంకా కొత్త న్యూట్రిషన్‌ డెఫిషియన్సీస్‌ వస్తాయి.
4 అపోహ : మీల్స్‌ స్కిప్‌ చేయడం వల్ల బరువు తగ్గుతారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసి డైరెక్ట్‌గా డిన్నర్‌ చేయడం. 12 గంటలకోసారి ఆహారం తీసుకోవడం. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు అనుకోవడం.
వాస్తవం : భోజనం మానేయడం వల్ల మెటబాలిజం ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల బరువు కోల్పోవడం ఇంకా కష్టమవుతుంది. భోజనం స్కిప్‌ చేసినప్పుడు శరీరం ఆకలి మోడ్‌ లోకి వెళ్లిపోతుంది. అంటే శక్తిని సంరక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. మెటబాలిజం ప్రక్రియను నెమ్మది చేస్తుంది. దీని వలన తర్వాత మీల్‌ చాలా ఎక్కువగా తీసుకుంటారు. ఇది పూర్తిగా బరువు తగ్గే డైట్‌ కి విరుద్దంగా జరుగుతుంది.
5 అపోహ : డీటాక్స్‌ డైట్‌లోనే బరువు తగ్గుతారనుకోవడం. డీటాక్స్‌ డైట్‌తో వారంలో 5 కెజీల ఫ్యాట్‌ను కోల్పోతారు అనుకోవడం, శరీరంలో మలినాలన్నీ తొలగుతాయి అనుకోవడం. డీటాక్స్‌ చేస్తేనే ఆరోగ్యకరం అ నుకోవడం.
వాస్తవం : బరువు తగ్గే డైట్‌లో ‘డీటాక్స్‌ డైట్‌’ కేవలం వాటర్‌ రిటెన్షన్‌ మాత్రమే. మార్కెట్‌లో చాలా హెర్బల్‌ ప్రొడక్ట్స్‌ వున్నాయి. వీటి వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మొటిమలు, షుగర్‌ కంట్రోల్‌ అవుతుందని, ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయని అనుకోవడం. ‘డీటాక్స్‌’ దీర్ఘకాలంటా మంచిది కాదు.
6 అపోహ : నిర్దిష్ట ప్రాంతంలో కొవ్వు తగ్గించడం, కొన్ని నిర్దిష్ట కండరాలను ట్రైన్‌ చేస్తే బరువు తగ్గుతుందన్న అపోహ వుంది. 100 సిట్‌అప్స్‌ చేస్తే ఆబ్స్‌ వస్తాయన్న అపోహ కూడా వుంది. కాళ్లలో బరువు తగ్గడం వల్ల తొడల మధ్య గ్యాప్‌ పెరుగుతుంది అని అపోహ పడుతుంటారు.
వాస్తవం : కొవ్వు, కండరాలు రెండూ వేర్వేరు కాంపోనెంట్స్‌. ఆబ్స్‌ చేయడం వల్ల లేదా లెగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల సన్నగా అవరు. కొవ్వు ఎక్కడ చేరింది, ఎక్కడ తొలగించాలో తెలుసుకోలేరు. కాస్త ఓపికగా డైట్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తే ఓవరాల్‌గా బాడీలో ఫ్యాట్‌ కరిగి బరువు తగ్గుతారు.
ఎక్కువగా కొవ్వు నిల్వలు వున్న ప్రాంతాల్లో కొవ్వు తగ్గుతుంది. తరువాత కండరాల నిర్మాణం కోసం వ్యాయామాలు చేయాలి.
డైట్‌ చేసేటప్పుడు అవగాహనతో చేయడం చాలా అవసరం. లేకపోయినట్లయితే నూట్రిషన్‌ డెఫిషియన్సీ (పోషకాహార లోపాలు), ఇతర సమస్యలు కచ్చితంగా వస్తాయి.
– పి.వాణి, 9959361180
క్లినికల్‌ డైటీషియన్‌

Spread the love