ఈ ఆశ్రమం విజ్ఞాన భాండాగారం

వృద్ధాశ్రమం అంటే సాధారణంగా గుర్తొచ్చేది నిరాదరణకు గురైన వృద్ధులు. ‘బిడ్డల ఆదరణ కరువై పట్టించుకునే దిక్కులేక, పలకరించే మనుషులు లేక బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా బతుకీడ్చే వృద్ధులే అలాంటి చోటు వెదుక్కుంటూ వస్తారు’ అని అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే చాలా వృద్ధాశ్రమాలు అలాంటివే. అయితే చండ్ర రాజేశ్వరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమం దానికి పూర్తిగా భిన్నం. జీవితాంతం తమ బిడ్డల కోసం తపించి వయసుడికిన వారి మాదిరిగానే… ఓపికున్నంత కాలం సమాజం కోసం తపించిన వారు కూడా మన చుట్టూ ఎందరో ఉన్నారు. అలాంటి వారు తమ చివరి జీవితాన్ని గౌరవంగా, స్వేచ్ఛగా గడపాలని కోరుకోవడం సహజం. అలాంటి వారికి హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఈ వృద్ధాశ్రమం ఘన స్వాగతం పలుకుతోంది. వారికి ఇష్టమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆగస్టు 21న జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అభ్యుదయ భావాలకు, వృద్ధుల స్వేచ్ఛకు మారుపేరుగా నిలిచిన ఆ వృద్ధాశ్రమ చరిత్ర గురించి ఈ వారం కవర్‌స్టోరీ…

అక్కడ అడుగు పెడితే చాలు విజ్ఞానం మన చుట్టూ అల్లుకుంటుంది. అదో విజ్ఞాన భాండాగారంగా అగుపిస్తుంది. ఉద్యమకారులు, కళాకారులు, రచయితలు, రచయిత్రులు, డాక్టర్లు, సైంటిస్టులు, జర్నలిస్టులు ఇలా ఎందరో… దేశం కోసం తమ వంతు సేవ చేసిన ప్రముఖులు మరెందరో మనకు కనిపిస్తారు. ఎవరిని కదిలించినా ఒక్కొక్కరిది ఒక్కో ఘన చరిత్ర. ఒక్కో స్ఫూర్తిదాయక జీవితం. అలాంటి వారందరినీ ఒక దగ్గరకు చేర్చడం ఆ ఆశ్రమ గొప్పదనం. స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజల మనిషి చండ్రరాజేశ్వరావు కన్న కల ఇది.
ఆవేదన చెందేవారు
ఓ కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన చండ్ర రాజేశ్వరరావు చివరి రోజుల్లో నడవలేని స్థితిలో ఉండగా ఆయన అభిమానులు, కార్యకర్తలు వంతుల వారీగా ఆయనకు తోడుగా వుండి సేవలు చేసేవారు. అది తమ బాధ్యతగా భావించి ఆయన అవసరాలు తీర్చేవారు. అదంతా చూసిన ఆయన ‘నాకంటే మీరంతా ఉన్నారు. నాపై ఉన్న అభిమానంతో ఈ వయసులోనూ నేనేం చేయాలనుకుంటే అది చేసే అవకాశం నాకు కల్పిస్తున్నారు. అయితే ప్రజల కోసం పని చేసిన నాలాంటి వృద్ధులు ఇంకా ఎందరో ఉన్నారు. దేశం కోసం పోరాడి, సమాజం కోసం కృషి చేసి, పేదల కోసం త్యాగాలు చేసిన వారు ఉన్నారు. వారంతా తమ చివరి రోజుల్లో నాలా గౌరవంగా బతకలేకపోతున్నారే..?’ అంటూ నిత్యం ఆవేదన చెందేవారు. అలా ఆలోచిస్తూనే 1994, ఏప్రిల్‌ 9వ తేదిన ఆయన తుది శ్వాస విడిచారు.
ఆయన కల నిజం చేసేందుకు
సమాజం కోసం నిత్యం తపించిన ఆయన తన చివరి రోజుల్లో వృద్ధులకు ఎలాంటి జీవితం కావాలని భావించారో అలాంటి జీవితం అందించడం తమ బాధ్యతగా భావించారు తోటి నాయకులు. ఆయన కల నిజం చేసే ప్రయత్నంలో 1994లో సీఆర్‌ ఫౌండేషన్‌ స్థాపించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఐదు ఎకరాల స్థలం ఇచ్చింది. 1995 చండ్రరాజేశ్వరావు మొదటి వర్థంతి సదర్భంగా దాతల సహకారంతో సీపీఐ అప్పటి రాష్ట్ర కార్యదర్శి దాసరి నాగభూషణరావు ఆధ్వర్యంలో భవనం నిర్మాణానికి పునాది వేశారు. అప్పట్లో బీడు భూమిగా ఉన్న దీన్ని బాగు చేసేందుకు కమిటీ చాలా కష్టపడాల్సి వచ్చింది. అలా నాలుగేండ్ల శ్రమతో 1999 అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున ఆ స్థలంలో ఐదుగురు వృద్ధులతో వృద్ధాశ్రమం ప్రారంభమయింది. అలాంటి ఆశ్రమం ప్రస్తుతం మూడు అంతస్తుల భవనంలో 110 గదులతో 150 మంది ఉండటానికి అవసరమైన సదుపాయాలతో విస్తరించింది.
గౌరవంతో బతికేందుకు
ఇక్కడ ఉంటున్న వారందరూ గతిలేక, ఆదరించే వారుల లేక వచ్చిన వారు కాదు. చివరి రోజుల్లోనూ స్వేచ్ఛగా తాము అనుకున్నది చేసేందుకు, తాము కోరుకున్నట్టు జీవించేందుకు వచ్చిన వారే. చాలా వరకు బాగా చదువుకొని వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందిన వారే. సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్నవారే. పేదల సంక్షేమ కోసం, సమాజం కోసం, కృషి చేసి తమ జీవితాలను త్యాగం చేసిన ప్రఖ్యాత రచయితలు, సినీ నటులు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ శాసన సభ్యులు, ప్రొఫెసర్లు, చార్డెడ్‌ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, విశ్రాంత సంఘసేవకులు ఇలా ఎందరో ఇక్కడ ఉన్నారు.
అనుభవాల గని
ఈ ఆశ్రమంలో ఉన్న వారంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఉన్నతమైన తమ భావాలు పంచుకుంటూ, నిశ్చింతగా ఇది మన కుటుంబం అనే భావనలో ఉంటారు. వాస్తవానికి దీన్ని వృద్ధాశ్రమం అనకూడదు. మేధావుల ఆశ్రమం అంటే సరిగ్గా సరిపోతుంది. ఇదొక అనుభవాల గని. దీన్ని తవ్వే మనిషి ఉండాలే గానీ తవ్వినకొద్ది జ్ఞాన భాండాగారం బయటపడుతూనే ఉంటుంది. అప్పట్లో వృద్ధాశ్రమ స్థలం మొత్తం బీడు భూమి. కనుచూపు మేరా మనుషులు కనిపించేవారు కాదు. నగరానికి చాలా దూరంగా ఉండేది. దాంతో చాలా మంది ”వృద్ధులంటే ఇలా ఊరు బయటే ఉండాలా” అనేవారు. తర్వాత కాలంలో చాలా అభివృద్ధి చెందింది. ఆశ్రమం ప్రారంభించిన మొదట్లో మహిదర్‌ రామ్మెహన్‌రావు, ఎన్‌.శివరామిరెడ్డి (కడప మాజీ ఎమ్మెల్యే), కొండపల్లి కోటేశ్వరమ్మ, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, జేఎన్‌యు ప్రొఫెసర్‌ శేషాద్రితో పాటు ఆయన భార్య ఇక్కడే ఉండేవారు. పాత్రికేయులు ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి చివరి వరకు ఇక్కడే ఉండి మరణించారు. ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయదేవి తన చివరి రోజుల్లో ఈ ఆశ్రమంలోనే గడిపారు. ఆమెకు వచ్చిన ఇన్విటేషన్లను అందమైన కళారూపాలుగా చేసి భద్రపరిచేవారు. వాటన్నింటినీ ఆశ్రమంలో ఇప్పటికీ జాగ్రత్త చేశారు. అలాగే సుడోకు పజిల్స్‌ రాస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రిటైర్డ్‌ సైంటిస్ట్‌ ఏవీరావ్‌ ఒక యూటూబ్‌ ఛానల్‌ ఈ ఆశ్రమంలోనే ఉండి నడిపించేవారు. వీటిపై ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. అలాగే మొదటి తరం జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌తో పాటు, విశ్రాంత ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌, డా.రంగనాయకీల జంట గత 22 ఏండ్ల నుండి ఈ ఆశ్రమంలోనే ఉంటున్నారు. ఈ జంట ఇక్కడ ఉండే 12 పుస్తకాలు రచించారు. అలాగే ప్రముఖ సినీ నటులు కాకరాల సత్యన్నారాయణ ఆయన జీవన సహచరితో పాటు ఇక్కడ చేరారు. ఆవిడ ఇటీవల కాలంలో మరణించారు. ఆయన మాత్రం ఇక్కడే కొనసాగుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఐద్వా సీనియర్‌ నాయకులు సుగుణమ్మ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు.
పక్కా టైం టేబుల్‌…
ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 138 మంది ఉన్నారు. అందులో 21 జంటలు ఉన్నాయి. 81 మంది మహిళలు, 57 మంది పురుషులు ఉన్నారు. వీరి కోసం 110 రూములు ఏర్పాటు చేశారు. అలాగే మూడు డార్మెట్రరీలు ఉంటాయి. మంచానికే పరిమితమైన వారి కోసం ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు కాఫీ, టీ, పాలు… ఇలా వాళ్ళకు ఏం కావాలంటే అది అందిస్తారు 8.30 నిమిషాలకు బ్రేక్‌ ఫాస్ట్‌ ఉంటుంది. ఇందులో రోజుకొక వెరైటీ ఉంటుంది. ఏదైనా వాళ్ళు సులభంగా తినగలిగేది పెడతారు. అంటే ఇడ్లీ, ఉప్మా వంటివి. టిఫిన్‌ తర్వాత మళ్ళీ టీ, కాఫీ ఉంటుంది. అలాగే ఉడకబెట్టిన గుడ్డు కూడా ప్రతిరోజూ ఇస్తారు. 12 గంటలకు మధ్యాహ్న భోజనం సిద్ధంగా ఉంటుంది. భోజనంలో అన్నంతో పాటు పప్పు, కూర, తొక్కుడు చట్నీ, రసం లేదా సంబార్‌, పెరుగుతో కలిపి మొత్తం ఐదు వెరైటీలు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటారు. మళ్ళీ మూడు గంటలకు స్నాక్స్‌ ఏర్పాటు చేస్తారు. అందులో గుగ్గిళ్ళు, బిస్కెట్స్‌ వంటివి ఉంటాయి. వీటితో పాటు టీ, కాఫీ ఇస్తారు. 7 గంటల్లా డిన్నర్‌ పూర్తవుతుంది. అందులో పుల్కాలు, చపాతీ, రైస్‌… ఇలా ఎవరికి ఏది ఇష్టమో అది ఏర్పాటు చేస్తారు. అందులోకి గుజ్జుకూర, రసం, పెరుగు లేదా మజ్జిగ ఉంటాయి. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాంసాహారం అస్సలు పెట్టరు. ఇన్ని సదుపాయాలతో, సౌకర్యాలతో, విలువలతో నడుస్తున్న ఈ ఆశ్రమంలో చేరేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం 300 పైగా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఆశ్రమంలో చేరాలంటే కచ్చితంగా 65 ఏండ్లు నిండి వుండాలి.
కావల్సినంత సందడి
ఉదయాన్నే పేపర్లు చదువుకునేవారు చదువుకుంటారు. అలాగే వీరి ఆరోగ్యం కోసం దాసరి నాగభూషణరావు పేరుతో ఒక వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. అలాగే ఓపెన్‌ జిమ్‌ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. ఇక సాయంత్రం పూట క్యారమ్స్‌, చెస్‌ ఆడేవారు, కబుర్లు చెప్పుకునే వారితో ఆశ్రమం మొత్తం సందడిగా ఉంటుంది. భోజనం కోసం, పేపర్లు చదువుకోవడం కోసం ఏ అంతస్తులో వారికి ఆ అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇందులో ఉండే వారు సాధారణంగా అందరూ పూర్తి స్థాయి అవగాహన ఉన్న వారు కాబట్టి కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఆడుకోవడం సర్వసాధారణం. అవి కాకుండా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే సీఆర్‌ కళాక్షేత్రం పేరుతో ఇటీవలెను ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ చేతుల మీదుగా ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఒకటి ప్రారంభించారు. ఇందులో సుమారు వంద మంది కూర్చునే ఏర్పాటు ఉంది. ప్రొజెక్టర్‌ పెట్టుకొని ఇష్టమైన పాత సినిమాలు చూస్తుంటారు.
నిబద్ధత కలిగిన కమిటీ, సిబ్బంది
ఆశ్రమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ డైరెక్టర్‌గా వి.చెన్నకేశవరావు, ఆశ్రమ వాసులు చెన్నమనేని వెంకటేశ్వరరావు, సోమూరు తుకారాం, డాక్టర్‌ సరస్వతి, రాజేందర్‌రావు, డాక్టర్‌ రజనీ కమిటీ సభ్యులుగా ఉన్నారు. అలాగే శ్రీనివాస్‌ దీనికి మేనేజర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. వీరు కాక సత్యవతి అనే సూపర్‌ వైజర్‌ ఉన్నారు. అలాగే 28 మంది సిబ్బంది ఇందులో పని చేస్తుంటారు. వృద్ధాశ్రమానికి కావల్సింది రుచి, శుచి. వంట రుచిగా ఉండాలి. హౌస్‌ కీపింగ్‌ అందుబాటులో ఉండాలి. శుభ్రత చాలా అవసరం. వీటికి ఈ ఆశ్రమంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
ఛార్జీలు తక్కువే…
పేదలుగా ఉండి ప్రజలకు సేవ చేసిన వారికి ఈ ఆశ్రమంలో ఉచిత వసతి కల్పిస్తారు. కాస్త కట్టే స్థోమత ఉన్నవారు డార్మెట్రరీలో ఉంటారు. వారి దగ్గర 4500 రూపాయలు తీసుకుంటారు. మరి కొందరు వారి అవసరాలు, సౌలభ్యం కోసం ప్రత్యేక రూముల్లో ఉంటారు. వారి నుండి 8వేలు తీసుకుంటారు. ఎవరు ఎంత కట్టినా సౌకర్యాలు మాత్రం అందరికీ సమానమే. అప్పుడప్పుడు లోటు బడ్జెట్‌ ఏర్పడితే ఫౌండేషన్‌ మేనేజ్‌మెంట్‌ సహకరిస్తుంది. కొందరు వచ్చి స్వచ్ఛందంగా ఆశ్రమానికి ఫండ్స్‌ ఇస్తుంటారు. అలాంటి దాతల సహకారంతో ఈ ఆశ్రమం నిర్విరామంగా నడుస్తున్నది. ఇటువంటి గొప్ప ఆశ్రమాల అవసరం నేడు చాలా ఉంది. జీవితాంతం ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవ చేసిన వారు చివరి దశలో గౌరవంగా జీవించేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఇలా వృద్ధులను గౌరవిస్తున్న ఈ ఆశ్రమానికి తెలంగాణ గవర్నమెంట్‌ 2019లో ‘వయో శ్రేష్ట సమ్మాన్‌’ అవార్డు ప్రకటించింది.
ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో
వాస్తవానికి సీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వరంలో ఒక్క వృద్ధాశ్రమం మాత్రమే కాదు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో ఒక హెల్త్‌ సెంటర్‌, ఉమెన్‌ వెల్ఫేర్‌ సెంటర్‌, నీలం రాజశేఖర్‌ రెడ్డి రీసెర్చ్‌ సెంటర్‌, లైబ్రరీ కూడా ఉన్నాయి. ఇలాంటివి జాతీయ స్థాయిలో నిర్వహించాలని అప్పటి సీపీఐ నాయకత్వం భావించింది. అందుకే అప్పటి సీపీఐ జాతీయ కార్యదర్శి ఇంద్రజిత్‌ గుప్తా దీనికి ప్రధమ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రతి ఏడాది అక్టోబర్‌ నెలలో వృద్ధాశ్రమ వార్షికోత్సవం జరుగుతుంటుంది. ఈ వార్షికోత్సవ సభల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, అసెంబ్లీ స్పీకర్లు, పలువురు ప్రముఖులు హాజరై సి.ఆర్‌ ఫౌండేషన్‌ సేవలను కొనియాడుతుంటారు. ఆశ్రమ వాసుల ఆరోగ్య సౌకర్యాల నిమిత్తం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాజమాన్యం ఒక మారుతి వ్యాన్‌ బహుకరించింది. ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్స్టిట్యూట్‌ వారి సౌజన్యంతో ఒక కంటి పరీక్షల కేంద్రం ఫౌండేషన్‌ ఆవరణలో నెలకొల్పబడింది.
ఫౌండేషన్‌ కమిటీ సభ్యులు
ప్రస్తుతం డి.రాజా దీనికి ప్యాట్రిన్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు సురవరం సుధాకర్‌ రెడ్డి గౌరవాధ్యక్షులు, డాక్టర్‌ కె.నారాయణ అధ్యక్షులుగా, సయ్యద్‌ అజీజ్‌ పాషా, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ ఉపాధ్యక్షులు, పల్లా వెంకటరెడ్డి(మాజీ శాసన సభ్యులు) ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పిజే చంద్రశేఖర్‌రావు, చెన్నమనేని వెంకటేశ్వరరావు, పిడికిటి సంధ్యాకుమారి కార్యదర్శులు, వి.చెన్నకేశవరావు కోశాధికారిగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు.

అట్టివారి సేవ కోసం…
చండ్ర రాజేశ్వరరావు గారి చివరి కోరిక సమాజం కోసం సేవచేసిన వృద్ధులు బాధతో మరణించకూడదు. అట్టివారి సేవ కోసం రాజకీయాలకు అతీతంగా ఒక నివేసిన కేంద్రం ఉండాలని ఆయన కోరారు. ఆ సలహాను ఆదేశంగా తీసుకుని ఈ ఓల్డేజ్‌ హోమ్‌ నిర్మించాం. ఇది కేవలం ఆశ్రమమే కాకుండా మహిళలకు స్వయం ఉపాధి కోర్సులు, ఆరోగ్య కేంద్రం, లైబ్రరీ, నీలం రాజశేఖర్‌ రెడ్డిగారి పేరుతో రీసెర్చ్‌ కేంద్రాన్ని స్థాపించాం. వయోవృద్ధుల ఆరోగ్యం కోసం వాకింగ్‌ ట్రాక్‌ కూడా ఏర్పాటు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాలు కోసం బహిరంగ సీఆర్‌ కళాక్షేత్రం ఒకటి నిర్మించాం. ఆరోగ్య కేంద్రాన్ని ఇంకా విస్తృతం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
– డాక్టర్‌ కె.నారాయణ, సీఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు
అడ్మిషన్‌ కోసం ఎదురు చూస్తుంటారు
ఇప్పుడు వృద్ధాశ్రమాలకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. సాధారణంగా కుటుంబంలో నిరాదరణకు గురైన వారే ఆశ్రమాల్లో ఉంటారు. కానీ మా ఆశ్రమ పరిస్థితి వేరు. ప్రజలకు తమ జీవితాన్ని అంకితం చేసిన వారిని చివరి దశలో గౌరవించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం. మొదటి నుండి అవే నిబంధనలతో నడుపుతున్నాం. ఇది ఒక నాలెడ్జ్‌ హబ్‌. కరోనా సమయంలో కొంత ఇబ్బంది ఎదురయింది. ఆ సమయంలో బయట ఆశ్రమాలు చాలా వరకు మూసేశారు. కానీ మేము మాత్రం మూసేయలేదు. హౌస్‌ కీపింగ్‌ వారు లోపలే ఉండేవారు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ వంటకు ఇబ్బంది అయ్యింది. వంట కోసం ఒక హౌటల్‌ వాళ్ళను రిక్వెస్ట్‌ చేసుకొని వండించుకొని తెచ్చుకునే వాళ్ళం. అయితే సహాయకులు కొంత మంది ఎంత చెప్పినా వినకుండా బయటకు వెళ్ళి వచ్చే వారు. దాంతో ఆశ్రమంలో మూడు కేసులు వచ్చాయి. వెంటనే అందరికీ వాక్సిన్లు వేయించాం. ఫౌండేషన్‌ అధ్యక్షులు నారాయణ, డా|| రజని దగ్గరుండి వేయించారు. స్థానిక వైద్య అధికారులు కూడా బాగా సహకరించారు. పాజిటివ్‌ వచ్చిన వారిని టిమ్స్‌, నేచర్‌ క్యూర్‌లో చేర్పించాం. తగ్గిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు. ఇక సెకండ్‌ వేవ్‌ అప్పుడు ఒక్క కేసు కూడా రాకుండా జాగ్రత్త పడ్డాం. మా కమిటీగా ఎప్పటి కప్పుడు కూర్చొని ఎలాంటి సమస్య వచ్చినా మాట్లాడుకొని క్లియర్‌ చేసుకుంటాం. గతంలో శని, ఆదివారాలు వస్తే ఇక్కడంతా ఖాళీగా ఉండేది. హౌంలో ఎవ్వరూ ఉండేవారు కాదు. పిల్లలు వచ్చి వాళ్ళను ఇంటికి తీసుకుపోయేవారు. కానీ ఇప్పుడు రివర్స్‌ అయ్యి వాళ్ళే ఇక్కడకి వచ్చి తమ తల్లిదండ్రులను చూసిపోతున్నారు. ఇక్కడి నుండి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. చాలా మంది అడ్మిషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఎప్పుడు ఖాళీ అవుతుంది అని అడుగుతుంటారు. కానీ ఖాళీ అవ్వడం అనేది ఇక్కడ చాలా కష్టం. అందుకే ప్రభుత్వాలు కూడా వృద్ధాశ్రమాలు పెట్టాలి. బయట వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జీవితమంతా పిల్లల కోసం తపించి వాళ్ళను తీర్చిదిద్ది చివరి రోజుల్లో ఆదరణ లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వాలు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– వి.చెన్నకేశవరావు, హోమ్‌ డైరెక్టర్‌
వైద్య సేవలకు ఢోకా లేదు
ఆశ్రమంలో ఎప్పుడూ ఇద్దరు నర్సులు అందుబాటులో ఉంటారు. మాది కమ్యూనిస్టు కుటుంబం. చండ్ర రాజేశ్వరావుగారి ప్రోత్సాహంతో నేను జర్మనీలో మెడిసెన్‌ చేసి వచ్చాను. కొంత కాలం బయట వృత్తిలో ఉన్నాను. ప్రజలకు వైద్య సేవ చేయాలనే ఉద్దేశంతో 2003 నుండి సీఆర్‌ ఫౌండేషన్‌లో పని చేస్తున్నాను. ఫౌండేషన్‌ ఆధ్వరంలో నడుస్తున్న హెల్త్‌ సెంటర్‌కి ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నాను. అలాగే రోజూ ఆశ్రమంలోని వారికి కూడా సరైన సమయానికి వైద్యం అందేలా చూడడం నా బాధ్యత. ప్రతి రోజు ఆశ్రమానికి వచ్చి వారికి అందుబాటులో ఉంటాను. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే ఆశ్రమంలోనే పరిష్కరించుకుంటాం. ఇంకా ఏవైనా ఇతర సమస్యలు వస్తే అవసరాన్ని బట్టి నిమ్స్‌కు తీసుకువెళతాం. ఆశ్రమంలో ఉన్నవారందరూ ఏదో ఒక రూపంలో సమాజానికి సేవలందించిన వారు. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇలాంటి వారికి సేవ చేయాలనే కోరికతో ఇక్కడిచి వచ్చాను. పద్మశ్రీ డాక్టర్‌ ప్రసాద్‌రావుగారు మా హెల్త్‌ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు.
– డాక్టర్‌ రజనీ కూసమనేని
మా నాన్న కోసం వచ్చి…

మా నాన్న పరుచూరి రామస్వామి, హౌంకి ఆయనతో కలిసి వచ్చాను. నాన్న ముందుతరం కమ్యూనిస్టు నాయకులలో ఒకరు. హౌం కట్టేటప్పుడు నాన్న అప్పుడప్పుడు చూడటానికి వస్తుండేవారు. చండ్రరాజేశ్వరావు పేరుతో దీన్ని పెట్టడం నాన్నకు బాగా నచ్చింది. నాన్న ఇక్కడికి కరోనా కంటే ముందు వచ్చారు. ఆయన ఎప్పుడో ఇక్కడికి రావాలనుకున్నారు. కానీ కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల అమ్మానాన్న నాతోనే ఉండాల్సి వచ్చింది. నా పిల్లలు పెద్దవారై ఇద్దరూ ఇప్పుడు విదేశాల్లో స్థిరపడ్డారు. నేను కొన్ని రోజులు విదేశాలకు వెళ్ళాను. అమ్మ చనిపోవడంతో నాన్న మా తమ్ముడి దగ్గర కొన్ని రోజులు ఉన్నారు. నేను విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత నాన్న హౌంలో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అప్పటికే నాకు 65 ఏండ్లు నిండాయి కాబట్టి నాన్నను ఒక్కడినే పంపించడం ఇష్టం లేక నేను కూడా ఇక్కడ చేరాను. నాన్నకు కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉన్నాయి. అవి ఇక్కడ సాధ్యమవుతుందో లేదో అని దగ్గరుండి చూసుకోవాలనే ఆలోచనతో చేరాను. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ టైం టేబుల్‌ మొత్తం సరిగ్గా నాన్నకు సరిపోయేలా ఉంది. కరోనా అప్పుడు కూడా నాన్న ధైర్యంగా నిలబడ్డారు. చివరకు 104 ఏండ్లు నిండిన తర్వాత చనిపోయారు. ఇప్పుడు నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడి వాతావరణం, జీవితం నాకు బాగా నచ్చింది. చాలా మంది గొప్ప వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండడం గర్వంగా ఉంది. అందరూ ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తుంటారు. ఇక్కడున్నంత ఆనందం బయట దొరకదు. పిల్లలు ఉద్యోగాల కోసం అనివార్యంగా ఎక్కడో దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఒంటరిగా, పలకరించే వారి కోసం ఎదురు చూస్తూ ఉండడం కరెక్ట్‌ కాదు. అందుకే ఇలాంటివి అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను మరో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు ‘మా పిల్లలు డబ్బు మోజులో పడి విదేశాలకు వెళ్ళి మమ్మల్ని పట్టించుకోవడం లేదు’ అనే అపోహలో ఉంటుంటారు. కానీ అక్కడ మన పిల్లలు సాఫ్ట్‌వేర్‌ కూలీలుగా బతుకుతున్నారని, వాళ్ళకంటూ ఓ జీవితం లేకుండా పోయిందని గుర్తించాలి. మన పిల్లలు బానిస బతుకు బతుకుతున్నారని అర్థం చేసుకోవాలి. వాళ్ళకు అక్కడ సమయానికి తినడానికి తిండి ఉండదు. అక్కడ వాళ్ళు చేస్తున్న కొన్ని రకాల పనులు మన దగ్గర చెప్పుకోడానికి కూడా ఇష్టపడరు. విదేశాల్లో ఉన్నారు కాబట్టి డబ్బు పంపించాలని మాత్రం కొందరు అనుకుంటారు. కానీ అక్కడ టాక్సులు విపరీతంగా ఉంటాయి. సంపాదించిన దాంట్లో సంగం దానికే పోతుంది. చాలా కష్టపడి పిల్లలు అక్కడ పని చేస్తున్నారు. అలా పిల్లల కష్టాలను అర్థం చేసుకుంటున్న తల్లిదండ్రులకు ఇలాంటి ఆశ్రమాలు చాలా అవసరం.
– జమున
హాయిగా ఉంటున్నాం
22 ఏండ్ల కిందట ఈ ఆశ్రమానికి వచ్చాం. అప్పటి నుండి నా భర్త, నేను ఇక్కడే ఉంటున్నాం. మా వారు ప్రొఫెసర్‌గా చేసి రిటైర్‌ అయ్యారు. నేను ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్లో చేసి రిటైర్‌ అయ్యాను. మాకు అమ్మాయి ఒక్కతే. తను అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్‌ అయ్యింది. మేము రిటైర్‌ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాం. కొన్ని రోజులు ఉండి ఇక్కడికి వచ్చేశాం. మన సంప్రదాయాలు, సనాతన ధర్మాల గురించి కొన్ని పుస్తకాలు రాయాలనుకున్నాం. కానీ అమెరికాలో అలాంటి వాతావరణం లేదు. మాకు కావల్సిన పుస్తకాలు అక్కడ దొరకవు. అలా అని ఊరికే తిని ఇంట్లో కూర్చోబుద్ది కాదు. మేము ప్రశాంతంగా రాసుకోవాలి. దానికి కావల్సిన సౌకర్యాలు ఉండాలి. కొన్ని ఆశ్రమాలకు వెళ్ళి చూశాం. కానీ ఎక్కడా మాకు నచ్చలేదు. ఒక రోజు ఈ ఆశ్రమం గురించి తెలుసుకుని ఫోన్‌ చేశా. వచ్చి చూశాము. నాకు బాగా నచ్చింది. వెంటనే వచ్చి చేరిపోయాము. సాధారణంగా అందరూ ‘అయ్యో ఓల్డ్‌జ్‌ హోంలో ఉంటారా? పిల్లలు చూడరా?’ అనే జాలి మాటలు అనేవారు. కానీ ఇక్కడ వాతావరణం అలాంటిది కాదు. అందరూ ఉన్నతంగా ఆలోచించేవారు. రాతగాళ్ళు, మాటగాళ్ళు ఇలా అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము 12 పుస్తకాలు రాయగలిగాం. మా మనసుకు నచ్చిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయగలుగుతున్నాం.
– డాక్టర్‌ రంగనాయకి
అన్ని విధాల అనుకూలం
ఈ హోమ్‌ ప్రారంభించిన ఏడాది తర్వాత నేను వచ్చాను. అంటే సుమారు 22 ఏండ్ల నుండి ఇక్కడే ఉంటున్నాను. అన్ని విధాలుగా ఇక్కడ నాకు అనుకూలంగా ఉంది. చండ్ర రాజేశ్వరరావు గారు ఏ ఆశయాలతో దీన్ని ప్రారంభించారో నిర్వాహకులు అదే ప్రకారం దీన్ని నడుపుతున్నారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. హోమ్‌లో జరిగే కార్యక్రమాల్లో అందరం పాల్గొని సరదాగా గడుపుతాం. ఒకరి భావాలు ఒకరం పంచుకుంటూ సంతోషంగా ఉంటున్నాం.
– ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ పాత్రికేయులు
నిరాదరణ తగ్గించేందుకు
జీవిత చక్రంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం. ప్రతి దశలోనూ ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. కుమారులు, కూతుళ్లకు ఓ బాట చూపించి మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ గడిపే సమయం ఇది. ఆ వయసులోనూ వారి ఆలోచనలు పిల్లల గురించే. వారికి ఏ కష్టం రాకూడదని, జీవితాంతం హాయిగా ఉండాలని పరితపిస్తుంటారు. ఆ ఆరాటంలో కొన్ని విషయాల్లో తలదూరుస్తుంటారు. అనుకున్నది చెప్పేస్తుంటారు. చాలా మందికి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు నచ్చవు. వారిని ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక వస్తువులా భావిస్తుంటారు. ఆ బాధను భరించడం వృద్ధుల వల్ల కాదు. పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని ఆ వయసులో తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఊతకర్రల సాయంతో నడివీధులకు చేరుతున్న అభాగ్యులు ఎందరో..! ఒక్కపూట అన్నం పెట్టలేక, ఆలనా పాలన చూడలేక కొందరిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 21ని ‘జాతీయ వృద్ధుల దినోత్సవం’గా ప్రకటించింది.
– సలీమ
94900 99083

Spread the love