మండుతున్న మణిపూర్ ఆదివాసీ జీవన చిత్రం

ఆదివాసీలు అంటే ‘ఆది మానవులుగా, మూలవాసులుగా, ప్రకృతి ఆరాధకులుగా, ఉద్యమాలకి ఆధ్యులుగా, వైవిధ్యం గల తెగలుగా, ఆత్మగౌరవానికి, స్వయం పాలన పోరాటాలకు చిహ్నంగా, అటవీ సంపద రక్షకులుగా గొప్పగా చెప్పుకుంటూ అనేక చరిత్రలు లిఖించబడ్డాయి. భిన్న ఆదివాసీ సమాజాలు అమూల్యమైన చరిత్ర, సంప్రదాయాలు, సంస్కతి, వారసత్వ సంపదను కలిగి ఉన్నాయి. వీటిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆదివాసీ స్త్రీ పురుషులు ప్రకతి పరిరక్షణలో నిపుణులు. భారత ఉపఖండంలోని విభిన్న సంస్కతికి ఆదివాసీలు ఎనలేని కషి చేశారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వన్యప్రాణులు, ప్రకతి పరిరక్షణలోనూ వీరు నిపుణులు. ప్రతి ఒక్కరూ అన్ని హక్కులతో గౌరవంగా జీవించడానికి అర్హులు. అయితే వర్గ సమాజం ఏర్పడిన నాటి నుండి ఆదివాసీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రపంచీకరణ విధానాల ఫలితంగా మార్కెట్‌ ఎప్పుడైతే సహజ వనరుల మీద కన్ను వేసిందో అప్పటినుండి వీరి జీవితాలలో అస్థిరత్వం, అల్లకల్లోలం మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. ఇటువంటి నేపథ్యంలో మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఇప్పుడు ఎక్కడ చూసినా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఘటన మణిపూర్‌లో జరుగుతున్న అమానవీయ మారణ కాండ. ఇప్పటికే 100 మందికి పైగా మరణించారు. 50వేల మందికి పైగా శరణార్ధులు ఆశ్రయం పొందుతున్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఇంకా లెక్కలు తీయాల్సి ఉంది. రెండు వందలకి పైగా చర్చ్‌లు, ఇతర మత ప్రదేశాలు, ధాన్యాగారాలు, గహాలు, మైనారిటీ తెగలకు సంబంధించిన వాటిని మాత్రమే తగల బెట్టడం మీడియాలో రిపోర్ట్‌ అయింది. ఈ అల్లర్లలో కేవలం కుకీలు కనపడినా అనేక చిన్న చిన్న సమూహాలు, మెయితిలో ఉన్న పేదలు కూడా తీవ్రంగా నష్ట పోయారు. తప్పుడు వార్తలు మీడియాలో రావడంతో మరిన్ని గొడవలకి దారితీసింది. అంతర్జాతీయ దినోత్సవం నాడు ఏదో ఒక అంశాన్ని (థీమ్‌) తీసుకుని ఆ సంవత్సరం ఆ అంశం పైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోయిన ఏడాది 2022 ”సంప్రదాయ జ్ఞానం సంరక్షణ, ప్రసారంలో స్వదేశీ మహిళల పాత్ర’ గురించి గొప్పగా చెప్పి ఇంకా సంవత్సరం కాలేదు. అంతలోనే మణిపూర్‌లోని కుకీ జో ఆదివాసీ మహిళల నగ దేహాలపై సభ్య సమాజం సిగ్గుపడేలా అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరం గగుర్పొడిచేలా ఉన్న దశ్యాలు చూశాం. ఇది ఆదివాసీలపై అరాచక దాడిగా కాక ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఆదివాసీల పట్ల ఉన్న ఉదాసీనతని, ఆదివాసీల ప్రాంతాలకి, సమూహాలకు దూరంగా ఉన్న ప్రజల వైఖరులని కూడా దష్టిలో పెట్టుకుని చూడాలి.
చరిత్రలోకి వెళితే…
1982 ఆగస్టు 9న జెనీవాలో ఐక్యరాజ్యసమితి స్థానిక జనాభాపై వర్కింగ్‌ గ్రూప్‌ మొదటి సమావేశం జరగడం వలన అదే రోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్ణయించారు. ఐక్యరాజ్య సమితి 1994 డిసెంబర్‌ 23న జనరల్‌ అసెంబ్లీ 49/214 తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతి ఏడాది ఒక్కొక్క థీమ్‌ని తీసుకొని దానికి సంబంధించిన పధకాలు, ప్రాజెక్టులను, కార్యక్రమాలను, ఆధునిక మార్పులని అందరితో పంచుకోవడం మొదలైంది. ఈ ప్రపంచ దినోత్సవ సందర్భంగా వివిధ ఆదివాసీ తెగల అంశాలు ఎదుర్కొంటున్న సమస్యలు… భూమి, సంస్కతీ, విద్యాహక్కులు వంటి అనేక అంశాల మీద ప్రభుత్వాలు, పరిశోధక సంస్థలు, స్వచ్చంద సంస్థలు సమావేశాలని నిర్వహిస్తాయి. ఈ సంవత్సరం ఆర్థిక శాఖ సాంఘిక అంశాలను చూసే (డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌ (డెసా) ఆగస్టు 9న అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా నిర్వహిస్తోంది. ఇందులో ఐక్యరాజ్య సమితి సంస్థలు, పౌరసమాజం, స్థానిక ప్రజలు, స్వచ్చంద సంస్థల్ని ఆహ్వానిస్తారు. ఈ ఏడాది ”స్వయం నిర్ణయాధికారం కోసం మార్పు ఏజెంట్లుగా స్థానిక యువత” అంశాన్ని తీసుకున్నారు.
యువతపై బాధ్యత ఎందుకు..?
ఈ ఏడాది యువతపై బాధ్యత పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక సందర్భాలలో యువతను కొన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు పావులుగా వాడుకుంటున్నాయి. నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్న ఆర్థిక, సాంస్కతిక, రాజకీయ మార్పులకు కొందరు యువత దూరంగా ఉంటున్నారు. కొద్దిమంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నా కూడా అది తమ అస్తిత్వాన్ని కాపాడుకునే దిశలో లేకపోవడం కూడా జరుగుతుంది. ప్రపంచంలో శాంతి, సమానత్వం నెలకొల్పడానికి నేటి యువత డిజిటల్‌ సహకారంతో స్థానిక ప్రజల స్వయం నిర్ణయ హక్కుని సమర్ధవంతంగా అమలు చేయడానికి, భిన్న సమూహాల మధ్య సహజీవనాన్ని ప్రోత్సహించడానికి, మానవ, పౌర హక్కులను సంపూర్ణంగా అనుభవించడానికి నేటి యువత పాత్ర అత్యంత అవసరం. నేడు జరుగుతున్న సహజ వనరుల దోపిడీ, వివిధ మెగా ప్రాజెక్టులు ఇతర హానికర పదార్ధాల ఉత్పత్తులు, అటవీ భూముల అన్యాక్రాంతం వలన ‘క్లైమేట్‌/ వాతావరణ మార్పులు, హరిత పరివర్తన జరుగుతున్నాయి. సాంకేతిక సహాయంతో ఈ మార్పుల నివారణ, శాంతి స్థాపన అంశాలను యువతకి అప్పగించారు. 2023 సెప్టెంబర్‌ నెలలో సుస్థిర అభివద్ధి లక్ష్యాల (ూణ+) శిఖరాగ్ర సమావేశం, 2030 అజెండా అమలు, 2024లో భవిష్యత్తు ప్రణాళిక కార్యక్రమాలలో మార్పును తీసుకువచ్చే దిశగా యువత పాత్రని వైవిధ్యంగా ఉపయోగించుకోనున్నారు. విలువలు లేని విద్య, గమ్యం లేని సాంకేతికత అందుబాటు, ఆదివాసీల అస్తిత్వాలని దెబ్బతీసే రాజకీయ పరిణామాలు, వనరుల దోపిడీ యువతను పక్క దారి పట్టించే దోవలో ఉన్నాయన్నది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో యువతను భాగస్వాములను చేసి సమసమాజ నిర్మాణ బాధ్యతలవైపు మళ్ళించడం మంచి పరిణామమే అని చెప్పొచ్చు.
విద్యకు సుదూరంగా…
భారతదేశంలో నేటికీ ఆదివాసీలు అతి తక్కువ అక్షరాస్యతతో, పాఠశాలల్లో సరయిన వసతులు లేక ఆదిలోనే విద్యని ఆపేస్తున్నారు. మైనింగ్‌లు, డాంలు, టూరిస్ట్‌ ప్రాజెక్టుల పేరుతో అడవులు మాయమవుతూ, వాటితో పాటే స్థానిక ఆదివాసీ ప్రజల జనాభా కూడా రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ప్రభుత్వం అనేక పథకాలను కల్పిస్తున్నా నేటికీ దారిద్య్ర రేఖకి దిగువలోనే ఉన్నారు. ఆదివాసీలు చాలాకాలంగా అణచివేతకు గురవుతున్నారు. ప్రభుత్వ సహాయం ఉన్నప్పటికీ, వారిలో చాలా మందికి పేదరికం నుండి బయటపడటానికి వనరులు లేవు. మనం మరింత సమానమైన ప్రపంచాన్ని సష్టించాలనుకుంటే వాటి గురించి అవగాహన పెంచడం చాలా ముఖ్యం.
మణిపూర్‌ ఆదివాసీలపై జరుగుతున్న హింసాకాండ
ఇక ఇప్పుడు దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపి వేస్తున్న మణిపూర్‌, ఈశాన్య రాష్ట్రంలో కుకీ, మెయితి సమూహాల మధ్య జరుగుతున్న సంఘర్షణకి కారణాలు చూద్దాం. భారతదేశంలో మణిపూర్‌ ఒక చారిత్రక స్థానాన్ని, అందులో క్లిష్టమైన అంశాలని మొదటి నుండి కలిగి ఉంది. నిజానికి మణిపూర్‌ దేశంలోనే మూడవ పేద రాష్ట్రం. అక్కడ పేదరికం 36శాతంగా నమోదు కాబడ్డది. మొదటినుండి సంపద పంపిణీలో కొండ లోయ ప్రాంతాలు అసమానతలతో అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. లోయ ప్రాంతాలలో 60శాతం మెయితి జనాభా 10శాతం భూభాగాన్ని ఆక్రమించుకుంటే 90శాతం నాగా, ఇతర జనాభాలు కొండా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ ప్రధాన జీవనోపాధి వ్యవసాయమే. కేవలం 7శాతం పైన మాత్రమే వ్యవసాయ భూమి. దీనికి కోన ప్రాంత భూమిని జోడించాలని ూు హోదాకోసం మెయితీలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మెయితీలు కోరుతున్న రిజర్వేషన్‌కి ఎలాంటి చట్ట బద్ధత లేదు. ఇతర వర్గాల రిజర్వేషన్‌ చట్టాన్ని నీరు కార్చటానికి చేసే ప్రయత్నంగా నాగా తెగలు పైపైన నిరూపిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్య అంశం కుకీలని మయన్మార్‌ నుండి వచ్చిన వలసదారులుగా చిత్రీకరణ చేయడం. ఇది రాజకీయ ప్రోద్భలంతో, అండదండలతో జరుగుతున్నదని మేధావులు చెబుతున్నారు. అక్కడి ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇక్కడికి అనేక మంది శరణార్థులు ఎప్పటినుండో వస్తున్నారు. వాళ్లని కూడా అవమానించినట్టే అవుతుందని ఒక భావన.
మార్కెట్‌ కన్ను పడి…
స్థానిక రాజ్యాలు, వలస పాలనలు, అక్కడ ఉన్న వనరులు, వాటిపై అధికారాలు, ఆర్థిక అంశాలు, భారత ప్రభుత్వ, అంతర్జాతీయ ఒప్పందాలు, వైఖరి అన్ని కలిసి అక్కడ నివాసం ఉంటున్న తెగల మధ్య అగ్గిని రాజేశాయని చెప్పొచ్చు. జల విద్యుదుత్పత్తి, వాణిజ్య సంబంధాలు, ఖనిజ నిల్వలపై మార్కెట్‌ కన్ను పడడం, సంపదని అసమాన రీతిలో ఉపయోగించడం వలన అక్కడ అత్యంత పేదరికం కూడా ఉంది. అక్కడ ఉన్న లోయలు, కొండ ప్రాంతాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. రవాణా, విద్యా సౌకర్యాలు లేకపోవడం గమనించొచ్చు. మెయితిలు అనేక ఆర్థిక సంస్థలపై ఆధిపత్యం కలిగి ఉన్నారు. భూమి, వలస విధానాలు, ఉత్పత్తుల చుట్టూ వివాదం తిరుగుతుంది. ఇప్పటికే ఆర్థికంగా బలపడ్డ మెయితి సమాజం అక్కడ రిసార్టులు, హోటళ్లు ఇతర వాణిజ్య సదుపాయాల కోసం భూమిపై కన్ను వేసినట్టు తెలుస్తున్నది. అందువల్ల భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవడానికి అన్ని దారులు వెతుకుతున్నారు.
సంఘటన వివరాల్లోకి వెళితే…
ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న సంఘర్షణలు అక్కడి స్థానిక తెగల ప్రయోజనాలని దెబ్బతీస్తాయని, స్వయం ప్రతిపత్తి, సాంస్కతిక అస్తిత్వ పరిరక్షణ, వనరులపై హక్కు కోసం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మే 3న ఆల్‌ ట్రైబల్‌ యూనియన్‌ మణిపూర్‌ (Aుూఖవీ) ఒక సంఘీభావ కార్యక్రమం తీసుకుంది. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపూర్‌ హై కోర్ట్‌ మెయితిలకి ఎస్‌.టి హోదాను ఇవ్వడానికి ఇచ్చిన ఉత్తర్వులని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా నిరసిస్తూ మార్చ్‌ని నిర్వహించారు. మెయితి కమ్యూనిటీ లోయలో నివాసం ఉండే సమాజం, రాజకీయాల్లో అత్యధిక శాతం ఉంటూ, వనరులపై, ఆర్థిక అంశాలలో ఇప్పటికే మెయితిలు ఆధిపత్యంలో కొనసాగుతున్నారు. కొండలలో నివాసం ఉండే కుకీ, నాగా సమాజాలలో మెయితిలకి ఎస్టీ హోదాను ఇవ్వాలనే నిర్ణయం తమ ఆదివాసీ వర్గాలకి అన్యాయం జరుగుతుందనే ఆందోళనకి దారితీసి, ఇద్దరి మధ్య విభేదాలను సష్టించింది. 2018లో మణిపూర్‌ ప్రభుత్వం కుకీ సామాజిక వర్గంలో ఓ భయం, అభద్రతని రేకెత్తించి. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ మణిపూర్‌ పీపూల్స్‌ బిల్లు ద్వారా కొండ తెగలను విస్మరిస్తూ నిరాశ్రయులని చేసే దిశగా ఉంది అని వారిలో భయం కలిగించారు.
భూమి కోసమే…
ఏ ఆదివాసీలకైనా ప్రధాన వివాదాస్పద అంశం భూమితోనే వస్తుంది. భూమి లేకపోతే తమ సంస్కృతి, సంప్రదాయాలని, స్వయం ప్రతిపత్తిని కోల్పోతామని వారి నమ్మకం. 1961 భూమి సవరణ చట్టం (ల్యాండ్‌ రిఫార్మ్‌ యాక్ట్‌)ని సవరిస్తే గాని తమకి అక్కడ భూముల మీద అధికారం ఉండదని మెయితి సమాజం ప్రయత్నిస్తుంది. అయితే అక్కడి స్థానిక ఆదివాసీ సమాజాలు ఈ ప్రయత్నాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. నిరసనలు, ప్రదర్శనలు, ఫలితంగా అశాంతి ఏర్పడింది. అప్పటికే స్థానిక సంస్థలు అయిన జిల్లా కౌన్సిళ్లు, కొండ ప్రాంతాల కమిటీలతో సంప్రదింపులు జరపకుండా పైకి- జామి-హ్మర్‌ నివాసం ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా రక్షిత అరవై రిజర్వ్‌ వన్యప్రాణి అభయారణ్యాలు, చిత్తడి నేలలని గుర్తించారు.
వనరుల దోపిడీ మూల కారణం
అప్పటికే ఆర్టికల్‌ 371ని, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాస హక్కుల చట్టం 2006 ని ఉల్లంగిస్తూ 2022 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం కుకీలు అత్యధికంగా ఉన్న చిల్ల చురాచంద్పూర్‌లో 38 గ్రామాలను అక్రమ నివాసదారులు అంటూ వాళ్ళని 2023 ఫిబ్రవరిలో ఖాళీ చేయించడానికి పూనుకుంది. తద్వారా స్థానికులకు పని లేకుండా వారిని పేదరికంలోకి, తీవ్ర నిరాశ, అశాంతి వైపుకి నెట్టివేసింది. అక్కడ కొండిపాంతాలు టూరిజం, కాపా, ఖనిజాలు, పామాయిల్‌, సహజ సంపదలపై కార్పొరేట్‌లు పాగా వేయచూస్తున్నారు. ఇప్పటికే అక్కడ మెగా ఆనకట్టల నిర్మాణం తీవ్ర పర్యావరణ నష్టాన్ని కలిగించింది. స్థానిక ప్రజల స్థానభ్రంశం కలిగించడమే కాకుండా అక్కడ ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలని రెచ్చగొడుతున్నాయి. చివరకు ఇవి రాజ్య హింసకు దారితీస్తున్నాయి. ఆధిపత్యం ఉన్న వాళ్లు ప్రభుత్వం, చట్టం, పోలీసుల అండదండలతో కుకి, జో, నాగా వంటి గుంపులని అక్కడ లేకుండా చేయడానికి చూస్తున్నారు.
అసహనం, అభద్రత
మణిపూర్‌లో ప్రభుత్వాలు అనేక ఆదివాసీ సమూహాలని ఇప్పటికే ఖాళీ చేయించాయి. దీనివల్ల స్థానిక ప్రజలు జీవనోపాధిని కోల్పోయి పేదరికం అనుభవిస్తున్నారు. తద్వారా కుకి వంటి తెగలు రోజురోజుకి అసహనాన్ని, అభద్రతని అనుభవిస్తున్నారు. ఏదేమైనా ప్రపంచం ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటుంటే ఇక్కడ కొండ ప్రాంత ప్రజలు మాత్రం భయం, నిస్పహ, తీవ్ర అవమానాలతో ఆత్మ గౌరవం దెబ్బతిని, భూ నిర్వాసితత్వంతో కుదేలై ఉన్నారు. వాళ్ళ మధ్య సఖ్యత చేకూర్చి శాంతి నెలకొల్పాల్సిన ప్రభుత్వాలు వ్యూహాత్మక మౌనం వహించడం చాలా అనుమానాలకు దారితీస్తుంది. ఏ ప్రాంతం లోనైనా సుస్థిర ఆర్థిక అభివద్ధి, సాధికారత, హక్కుల పరిరక్షణ ముఖ్యం. వివక్షకు గురౌతున్న తెగలకు ప్రభుత్వాలు నమ్మకం కల్పించగలిగితే గాని మణిపూర్‌ మంటలు చల్లారవు. అక్కడ మంటలు ఆరక ముందే దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా గొడవలు చెలరేగడం భారతదేశ భవిష్యత్తుని ప్రశ్నార్ధకంలో పడేస్తుంది.
మణిపూర్‌ స్త్రీలు మన స్త్రీలే నా ?
స్త్రీల శరీరాలు రాజకీయ ప్రయోజనాలకు, కుట్రలకు, ఆక్రమణలకు, ద్వేషం, ఈర్ష్యలకి అనాదిగా బలవుతున్న వాస్తవం మన కండ్ల ముందు ఉన్నది. నేటి భారత దేశంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ మహిళలపై నిత్యం జరుగుతున్న హింసపై మన ప్రజలు పెద్ద ఎత్తున స్పందించడం లేదు. మొదటి నుండి ఆదివాసీలను దేశ ద్రోహులుగా, ప్రభుత్వాలకి వ్యతిరేకులుగా చూపించడంలో రాజకీయాలు బాగానే ఫలితాలని సాధిస్తున్నాయి. నిజానికి నగ దేహాల ఊరేగింపు చూసిన తరువాత కూడా దేశంలో కొద్దిమంది ప్రజాస్వామిక వాదులు ముందుకొచ్చి నిరసనలు తెలిపారు కానీ అనుకున్నంత స్పందన మాత్రం రాలేదనే చెప్పొచ్చు. అక్కడ ఉన్నది ఆదివాసీలు కాకపొతే, అది కొండ ప్రాంత ఈశాన్య ప్రజలు కాకపొతే, ఆ స్త్రీలు ఆదివాసీలు కాకపొతే, తగలబడింది చర్చీలు కాకపోతే ప్రజా స్పందన, ప్రభుత్వ స్పందన ఎట్లా ఉండేదో ఒక్కసారి ఆలోచిద్దాం. ఆదివాసీలు, మహిళలు, అణచివేయబడ్డ మహిళల పట్ల ఎంత ప్రేమ ఉందో ఇక్కడే మనకు తెలిసిపోతున్నది.
అందరికి అభివద్ధి ఫలాలు అందేలా
నిజానికి ప్రస్తుతం ఒక వర్గానికి ఎస్‌.టి హోదాన్ని ఇవ్వడం అంటే సమస్యే కానీ పరిష్కారం కాదు. దానివల్ల కార్పొరేట్‌ ప్రయోజనాలు నెరవేరే లక్ష్యం మాత్రమే ఉంది. అందుకు భిన్నంగా అందరికి అభివద్ధి ఫలాలు అందేలా లోయల్లో, కొండల్లో అన్ని ప్రభుత్వ సంస్థల్ని నెలకొల్పి ప్రజలకి జీవనోపాధులని కల్పించాలి. మెగా ప్రాజెక్టును, పర్యాటక కేంద్రాలుగా చేసేటప్పుడు పర్యావరణాన్ని, స్థానిక ప్రజలని దష్టిలో పెట్టుకోవాలి. స్వార్థ పూరిత, రాజకీయాలు కొన్ని సమూహాన్ని పెంచి పోషించడం అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం వంటి చర్యలని తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంస్థలు, వామ పక్షాలు ఉమ్మడి వేదికలుగా ఏర్పడి తెగల మధ్య ఉన్న విభేదాన్ని రూపుమాపాలి. ముఖ్యంగా స్త్రీల రక్షణ కోసం మహిళా కమిషన్‌లు, సుప్రీం కోర్ట్‌, మహిళా ఉద్యమ సంస్థలు అక్కడ జరుగుతున్న హింసకి వెంటనే పరిష్కారాలు చూడాలి. అవసరం అయితే అంతర్జాతీయ వేదికల సహాయం తీసుకోవాలి. మన మౌనం అంగీకారం అవుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మౌనం కూడా నేరమే అని గుర్తుంచుకోవాలి.
– ప్రొ|| సుజాత సూరేపల్లి, 9849468281 

Spread the love