తల్లి దండ్రులే పిల్లల నేస్తాలు

 

ప్రపంచంలో ఏ పదానికైన నిర్వచనం చెప్పగలమేమో కానీ ‘తల్లితండ్రులు’ అనే పదానికి మాత్రం నిర్వచనం దొరకదు. కారణం – ఎంతచెప్పినా ఆ నిర్వచనంలో ఎంతోకొంత లోటు కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పదం నిర్వచనాలకి అందనంత గొప్పది కాబట్టి. ఈ రోజు ‘జాతీయ తల్లితండ్రుల దినోత్సవం’. ఈ సందర్భంగా తల్లితండ్రులందరికీ నా శుభాకాంక్షలు.
మారుతున్న తరాలతో పాటు కుటుంబంలోని తల్లితండ్రుల పాత్రలో కూడా చాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రకంగా అది మంచి పరిణామమే అనిపిస్తోంది.
పూర్వం తల్లితండ్రులు పిల్లలతో వ్యవహరించిన తీరు చాల గంభీరంగా వుండేది. కానీ ఇప్పటి తరం తల్లితండ్రులు మాత్రం పిల్లలతో ఎంతో సరదాగా, స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు.
ఇంతకు ముందు తరంలో తల్లితండ్రుల పాత్ర :ఒకప్పుడు కుటుంబంలో తల్లితండ్రులకి ఒక ప్రత్యేక స్థానం వుండేది. ముఖ్యంగా తండ్రికి. వాళ్ళ మాటకి ఎదురు చెప్పకపోవటం, మర్యాద మన్ననలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగేది. పిల్లలకి సంబంధించి… వారి తిండి, బట్టలు, చదువు అన్నీ కూడా తల్లితండ్రుల నిర్ణయం ప్రకారమే జరిగేవి. సాధారణంగా అటువంటి నిర్ణయాలన్నీ తండ్రులే తీసుకునేవారు. పిల్లల చదువు పూర్తయి, ఉద్యోగం వచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డ తరువాతే స్వంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వారికి వుండేది.
సమాజంలో మనమూ ఒక భాగమే కాబట్టి సమాజం పట్ల మన బాధ్యత యేమిటి? మానవ సంబంధాలు ఎలా వుండాలి? కుటుంబ విలువలు, వ్యక్తి యొక్క స్వీయ కట్టుబాట్లు వంటి అనేక విషయాలు పెంపకంలో భాగంగానే పిల్లలకి తల్లదండ్రులు నేర్పేవారు. కొన్ని తల్లి నుంచి నేర్చుకుంటే, కొన్ని తండ్రి నుంచి నేర్చుకునే వారు. వీటికి తోడు ఇంట్లో వుండే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలు, కబుర్లు, పాటలు, పద్యాల ద్వారా పిల్లలకి ఎథిక్స్‌, మోరల్స్‌ ఆటోమాటిక్‌ గా వంటబట్టేవి.
తల్లితండ్రుల గురించి చెప్పుకోవాలంటే – ఏ తరం తల్లితండ్రులకి వుండే ప్రత్యేకత ఆ తరం తల్లితండ్రులకి వుంటూనే ఉంది. అదే తల్లితండ్రుల గొప్పతనం.
ఇంక నేటి తరం తల్లితండ్రుల విషయానికి వస్తే – ఈ తరం తల్లిదండ్రుల ఆలోచనా శైలిలో చాలా మార్పు వచ్చింది. వారు తమ పిల్లలతో కుటుంబ పెద్దల్లా కాకుండా స్నేహితుల్లా, ఎంతో చనువుగా వుంటున్నారు. పిల్లల పెంపకంలో వారు అనుసరిస్తున్న విధానాలే అందుకు తార్కాణం.
కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులతో పాటు సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులు కూడా అందుకు కారణం అవుతున్నాయి.
పూర్వకాలం పిల్లల పెంపకంలో ప్రధాన బాధ్యత తండ్రిది. కానీ ఈ తరం తల్లితండ్రులు ‘పేరెంటింగ్‌’ అనేది సమిష్టి బాధ్యతగా భావిస్తున్నారు. దానికి కారణం తల్లులు కూడా విద్యావంతులు కావడం, ఆర్థిక స్వేచ్ఛ కలిగి వుండటం. విద్య – సాంకేతిక రంగాలలో ఏర్పడుతున్న పరిణామాల పట్ల కూడా వారు మంచి అవగాహన కలిగి వుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామమనే చెప్పాలి.
అర్థం చేసుకుని అవగాహనతోనే పెంపకం: పూర్వం పేరెంటింగ్‌లో భయభక్తులకి ఎక్కువ ప్రాధాన్యత వుండేది. కానీ ఈ తరం తల్లిదండ్రులు పిల్లలకి ఏది నేర్పాలన్నా స్నేహపూరిత వాతావరణంలో, ఏ విషయం పట్ల అయినా పిల్లలకి అవగాహన కలిగే పద్ధతుల్లో నేర్పుతున్నారు. ఒకవేళ పిల్లలు అర్థం చేసుకోలేకపోతే అందుకు గల కారణాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నారు. తమ ఆశలకి, కలలకి, కోరికలకు అనుగుణంగా కాకుండా పిల్లల అభిరుచుల్ని, వారి సామర్ధ్యాన్ని గుర్తించి ఆ దిశగా వారి భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దానివల్ల పిల్లలు తమ సామర్థ్యాలను మెరుగు పరుచుకుంటున్నారు.
నేడు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకి టెక్నాలజీ కూడా ఎంతో తోడ్పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాన పాత్ర పోషిస్తోంది.
పిల్లలకి సంబంధించిన అనేక బ్లాగ్స్‌, పెరేంటింగ్‌ బుక్స్‌, స్కూల్‌ రిసోర్సెస్‌ నెట్‌లో అందుబాటులో ఉన్న విస్తత సమాచారం. వీటి ద్వారా తల్లితండ్రులు పిల్లలకి సంబంధించిన అనేక కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. అతి వేగంగా పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోగల స్థాయికి తమ పిల్లలను తయారు చేయాలన్న జిజ్ఞాస వారిలో వుండటమే దీనికి కారణం.
ఈ తరం చిన్న పిల్లల్ని గమనించినట్టయితే అనేక అంశాల పట్ల వారికి వున్న ఆశక్తి, అవగాహన వారి వయసుకు మించినదిగా వుంటోంది. దాని వెనుక వాళ్ళ తల్లితండ్రుల కషి ఎంతో ఉంది.
అయితే ఈ క్రమంలో పిల్లల పెంపకంలో తాతలు, అమ్మమ్మలు, నానమ్మల పాత్ర కుదించుకు పోతోంది. దాంతో పిల్లలు, పెద్దలు కూడా కొన్ని అనుభూతులు, అనుబంధాలకు దూరమై పోతున్నారు.
పిల్లల అభిప్రాయాలకే ప్రాధాన్యత: ఈ తరం తల్లితడ్రులు కొన్ని సందర్భాల్లో పిల్లల మీద ఆంక్షలు విధించినా, అనేక సందర్భాల్లో పిల్లల అభిప్రాయాల్ని అర్థం చేసుకుని, ప్రాధాన్యత ఇవ్వటానికే ఇష్టపడుతున్నారు.
ముందు తరాలతో పోల్చి చూసుకున్నట్టయితే ఇప్పటి తల్లితండ్రులకీ పిల్లలకీ మధ్య కమ్యూనికేషన్‌ అనేది చాలా చక్కగా వుంటోంది. తల్లితండ్రులు పిల్లలతో అన్ని విషయాలు చర్చించటం వల్ల వారిలో అవగాహనా శక్తి పెరుగుతోంది. అంతే కాకుండా ఒక వయసు వచ్చాక పిల్లలకి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో డెసిషన్‌ మేకింగ్‌ అనేది వాళ్ళకే వదిలేస్తున్నారు. ఆ ప్రాసెస్‌లో యేమైనా పొరపాట్లు జరిగినా వాటిని లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌గా కన్సిడర్‌ చేస్తున్నారే కానీ పిల్లల్ని కూర్చోపెట్టి అక్కరలేని క్లాసులు పీకటం లేదు. దానివల్ల పిల్లలకి తమ తల్లితండ్రుల పట్ల నమ్మకం, ఒక భద్రతా భావం ఏర్పడుతున్నాయి.
వీటన్నిటి వల్లా పిల్లల్లో సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ పెరగటమే కాకుండా, యేదైనా సమస్య ఎదురైనప్పుడు కంగారు పడటం లేదా తల్లితండ్రుల మీద ఆధారపడటం చేయకుండా పరిష్కారం దిశగా అడుగులు వేయడం నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం వున్న పోటీ ప్రపంచంలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఈ రకమైన ధైర్యం చాలా అవసరం. అయితే పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్న సందర్భాలు కూడా వుంటున్నాయి.
నేటి తల్లిదండ్రులు కేవలం చదువులు, ర్యాంకులకే ప్రాధాన్యత ఇవ్వకుండా స్పోర్ట్స్‌, ఇతర రంగాలలో కూడా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. వారి అభిరుచులను, వారికున్న ప్రావీణ్యతను గుర్తించి తగు శిక్షణ ఇప్పిస్తున్నారు. దానికోసం సమయాన్ని, డబ్బుని వెచ్చించటానికి వెనకాడటం లేదు.
సవాలుగా మారిన సాంకేతికత: తల్లితండ్రులు పిల్లల పైన ఎంత శ్రద్ధ పెట్టినా, ఎంత సమయం వెచ్చించినా వారిని స్మార్ట్‌ ఫోన్లు, ఇతర గాడ్జెట్లు నుంచి దూరంగా వుంచలేక పోతున్నారు. సోషల్‌ మీడియాలో పిల్లలు చూస్తున్న ప్రోగ్రాం లు కూడా వాళ్ళ వయసుకు మించినవి, వాళ్ళని ఆకర్షితుల్ని చేసి తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. ఏ మాత్రం యేమారివున్నా పిల్లలు చేయి జారిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటోంది అన్నది తల్లితండ్రుల ఆవేదన. ఒకవేళ పిల్లల్ని ఇంట్లో కట్టడి చేసినా, పిల్లలు బయటికి వెళ్లి తోటి పిల్లలతో కలిసినప్పుడు బుల్లింగ్‌ కి గురౌతున్నారు. ”నువ్వు ఇదికూడా చూడవా? నీకు ఈ ప్రోగ్రాం గురించి కూడా తెలీదా?” అంటూ తేలిక చేసి మాట్లాడతారు. అలాంటప్పుడు తోటి పిల్లల ముందు వీళ్ళ అభిమానం దెబ్బ తింటోంది. అందుకే తల్లితండ్రుల మీద అసహనం చూపించటం, ఎదురు తిరగడం చేస్తున్నారు. దాంతో తల్లితండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురౌతున్నారు.
ఈ కారణాల వల్లే ఈ రోజు పేరెంటింగ్‌ అనేది ఒక పెద్ద సవాలుగా మారింది.
ఇటు ఉద్యోగ బాధ్యతలు, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో పిల్లల్ని పెంచటం… ఈ కారణాలవల్ల వారు తమ తల్లితండ్రులతో కొంత సమయమైనా ప్రశాంతంగా గడపలేక పోతున్నారు. ఆ కారణంగానే పెద్ద వయసులో వున్న ముందు తరం తల్లితండ్రులు చాలా మంది తమ పిల్లలతో, మనవలతో కలిసి ఒకే కుటుంబంలో ఉంటున్నప్పటికీ మానసికంగా ఒంటరితనానికి గురౌతున్నారు.
ఈ సమస్యలకి పరిష్కారం కనుక్కొ గలిగితే ఆ తరం తల్లిదండ్రులు, ఈ తరం తల్లిదండ్రులు కూడా ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు.
ముగింపు: నేటి తరం తల్లితండ్రులు పిల్లలతో స్నేహంగా ఉంటూనే వాళ్లకి ఎన్నో విషయాలు నేర్పుతున్నారు. అభినందనీయమే. వాటితో పాటుగా పిల్లలకి విధేయత, కుటుంబ విలువలు, కొన్ని సామాజిక నియమాలకు కట్టుబడి ఉండటం, వాటిని ఉల్లంఘించడం వల్ల వాళ్ళు, సమాజం కూడా ఎదుర్కొనే పరిణామాల గురించి కూడా పిల్లల్లో అవగాహన కలిగించ గలిగితే వారి పెంపకానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
– అమ్మాజి, 7989695883
ఆసక్తి కలిగేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత
నాకు ఇద్దరు అమ్మాయిలు. అయితే అమ్మాయి, అబ్బాయి అనే తేడా సమాజంలో ఉండకూడదు అనే ఆలోచనలు మా నాన్న నుండి నేర్చుకున్నాను. కాబట్టి నా పిల్లల్ని నేను అలాంటి తేడా చూపించకుండా పెంచాను. అయితే స్పోర్ట్స్‌లోకి పంపించాలని, వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చాలా కోరిక. దాని ప్రకారమే మా పెద్దమ్మాయి జ్వాలా బ్యాట్మెంట్‌లో రాణించింది. సమాజం కూడా గుర్తించి తనను సెలబ్రెటీ చేసింది. మా చిన్నమ్మాయి ఇన్సీ. తను వాళ్ళ అమ్మ చేసే బిజినెస్‌లో సపోర్ట్‌గా ఉంటుంది. చాలా మంది ‘మీ అమ్మాయి స్పోర్ట్స్‌ వైపుకు తన ఇష్టప్రకారమే వెళ్ళిందా లేదా మీ ఆసక్తితో పంపించారా’ అని అడుగుతుండేవారు. అప్పుడు నేను వాళ్ళతో మీ పిల్లల్ని గుడికో, చర్చికో, మసీదుకో వాళ్లను అడిగే తీసుకు వెళ్ళేవారా అని అడిగేవాడిని. అలాగే పిల్లలు స్కూల్‌కి వెళ్ళే మొదటి రోజు కచ్చితంగా ఏడుస్తారు. అలా అని వెళ్ళకుండా ఆపలేం కదా. ఇవన్నీ పిల్లల్ని అడక్కుండానే, వాళ్ళకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులుగా చేసేస్తాం. కానీ ఇలాంటి రంగాలకు వచ్చే సరికి ఆసక్తి ఉందా లేదా అని ఆలోచిస్తాం. కానీ నా ఉద్దేశంలో ఇలాంటి వాటిపై పిల్లలకు చిన్నప్పటి నుండే ఆసక్తి కలిగేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత. నేనూ కూడా అదే చేశాను. ఇప్పుడున్న సమాజంలో శారీరకంగా, మానసికంగా మనుషులు శక్తివంతంగా ఉంటేనే ధైర్యంగా బతకగలరు అనే నమ్మకం కూడా నాకు ఉంది. దీనికి క్రీడలు ఉపయోగపడతాయని మా అమ్మాయిని క్రీడల్లో ప్రోత్సహించాను.
జ్వాలా క్రీడల్లోకి వచ్చిన కొత్తలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆడగలిగింది. అయితే ప్రభుత్వాలు ఆ బాధ్యత నుండి తప్పుకోవడంతో అంతా ప్రైవేట్‌ మయం అయిపోయింది. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో భాగంగా మనం కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలనే ఆలోచన తనంతట తనకు వచ్చింది. అందుకే ఒక అకాడమీని ఏర్పాటు చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తుంది. ఇది నాక చాలా సంతోషంగా, తృప్తిగా అనిపిస్తుంది.
తల్లిదండ్రులు ప్రస్తుత సమాజంలో సతమతమవుతున్నారు. ఎందుకంటే నేటి పరిస్థితుల్లో పిల్లలు ఏ రంగంలో ఉంటే హాయిగా ఉండగలరో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అలాగే కొంతమంది ఎక్కువ గారాబం చేస్తున్నారు. దీని వల్ల పిల్లలు మొండిగా తయారవుతున్నారు. ఇది కూడా సరైనది కాదని నా అభిప్రాయం. అయితే నాకు కాస్త ఆశ్చర్యంగా, బాధగా అనిపించే విషయం ఏమిటంటే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితి ఇది. ఇది తల్లిదండ్రుల పొరపాటు అని కూడా అనలేం.
మనం, మన కుటుంబం, మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలి అనే భావాలు పిల్లలకు నేర్పాలి. ఇతరుల సంతోషంలో మన సంతోషాన్ని చూసుకోవాలి. మా విషయంలో మాత్రం మేం సంతోషంగా ఉంటే మా పిల్లలు సంతోషంగా ఉంటారు, మేం బాధపడుతుంటే మా బాధని పంచుకుంటారు. పిల్లలు ఇలా ఉంటే చాలు. ఈ ప్రపంచం సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం అనే గట్టి నమ్మకం నాది. నా పిల్లలకు కూడా ఇదే నేర్పించాను.
క్రాంతి గుత్త, రిటైర్డ్‌, ఆర్‌బీఐ ఉద్యోగి
నిర్వాహకులు, జ్వాలా గుత్త అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ

Spread the love