పుట్టే వరకు ఏ మనిషికీ కులం, మతం అనేవి తెలియదు. పుట్టిన తర్వాతే అవన్నీ మనకు అంటించబడతాయి. మన తల్లిదండ్రుల ఆధారంగానే మనకంటూ ఓ కులం, ఓ మతం వచ్చి అంటుకుంటాయి. అలా పుట్టుకతో అంటుకున్న కులం, మతం జీవించి ఉన్నంత కాలం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మన వెన్నంటే వుంటాయి. అందుకే మనం ఎవరితో మాట్లాడాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరితో కలిసి బతకాలో ఆ కులం, మతమే నిర్ణయిస్తాయి. ఎవరికి ఓటు వేయాలో కూడా అవే నిర్దేశిస్తున్నాయి.
మనిషి గుర్తింపు కూడా వీటి ఆధారంగానే ఉంటోంది. అది అతనైనా, ఆమైనా పేరును బట్టి హిందూ, ముస్లిం, క్రీస్టియన్ అంటారే తప్ప భారతీయుడనో, భారతీయురాలనో ఎవ్వరూ అనరు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు… ఒక్కటేమిటీ మన జీవితానికి సంబంధించిన ప్రతీది కులంతోనో, మతంతోనో ముడిపడి ఉంటాయి.
కులం, మతం స్థానంలో కులతత్వం, మతతత్వంగా వచ్చి చేరాయి. ద్వేషం, వివక్ష, అంటరానితనం, హీనం, నీచం, ఉచ్ఛం… ఇలా అన్నీ వీటి ఆధారంగానే నడుస్తున్నాయి. పాఠశాలల్లో కులం చెప్పనిదే ప్రవేశం ఉండదు. ఇలా ఎంతో జాగ్రత్తగా మన భూజాలపై మోసుకొస్తున్న కులం, మతానికి అంతటి శక్తి ఉంది మరి. కాబట్టే దళితులపై తరతరాలుగా వివక్ష కొనసాగుతూనే ఉంది. మైనార్టీలపై మెజార్టీల దాష్టీకం యదేచ్ఛగా సాగుతూనే ఉంది. సభ్యత మరిచి ఓ గిరిజనుడిపై మూత్రం పోసిన దేశం మనది.
అందుకే మనుషుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ, విచ్ఛిన్నాన్ని సృష్టిస్తూ, విద్వేషాలను రెచ్చగొడుతున్న కులాలు, మతాలు అంతరించాలని ఎంతో మంది కోరుకున్నారు, కోరుకుంటూనే ఉన్నారు. ఎందరో మహానుభావులు వాటిని నిర్మూలించాలని పోరాటాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. అయినా అవేవీ మనల్ని వదిలి పోవడం లేదు. కాదు మనమే వదిలించుకోవడం లేదు. నేటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పాలకులు కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమైన మన దేశ ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో కులం, మతం లేని జీవితాన్ని కోరుకోవడం ఓ సవాల్. ఇక మాకు పుట్టిన బిడ్డకు కులం వద్దు, మతం వద్దు అని అడగటం ఓ పెద్ద సాహసం. ఆ సాహసమే చేశారు పాలమూరు జిల్లాకు చెందిన జంట రూపా, డేవిడ్. తమ బిడ్డకు కుల రహిత, మత రహిత సర్టిఫికేట్ కోసం అలుపు లేకుండా సుదీర్ఘ పోరాటం చేశారు. చివరకు విజయం సాధించారు. వీరి పోరాటం ఓ చారిత్రాత్మక తీర్పుకు నాంది పలికింది. కులరహిత, మతరహిత సర్టిఫికేట్ పొందే హక్కు ప్రజలకు వుంటుందని ఇటీవలె తెలంగాణ హైకోర్టు గొప్ప తీర్పునిచ్చింది.
కులం, మతం లేని సమాజం కోరుకుంటున్న వారందరికీ ఇదో శుభసందర్భం. అలా జీవించాలనుకుంటున్న వారందరికీ ఓ ధైర్యం. ‘మతములన్నియూ మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును’ అన్న మాటలు నిజమయ్యే రోజులు కచ్చితంగా వస్తాయని నమ్మే వారందరికీ ఈ తీర్పు ఓ భరోసా. ఇలాంటి తీర్పులు మరెన్నో రావాలి. కులం, మతం లేని సమాజం స్థాపించబడాలి. మనుషులంతా సమానం అనే భావన అందరిలో చిగురించాలి.
– సలీమా