అబలలు కాదు ధీరలు

తాము ఢి కొడుతుంది ఓ రాజకీయ శక్తిమంతుడైన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అని రెజ్లర్లకు తెలుసు. అందునా అధికారంలో ఉన్న బీజెపీ ఎంపీ అని కూడా తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైనది తాము ఆడుతున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆప్‌ ఇండియా అధ్యక్షుడనీ తెలుసు. ఆ సంస్థ కార్యకలాపాలలో ఆయనదే తుది మాట అనీ తెలుసు. అతనిపై వేసిన ఆరోపణలు రుజులు చేయలేకపోతే ఇక వారి భవిత శూన్యం అనీ కూడా తెలుసు. అయినా ధైర్యంగా ముందుకొచ్చారు? భవిష్యత్‌లో క్రీడారంగంలోకి వచ్చే అమ్మాయిలు తమలా బాధపడకూడదనే కదా! అయినా పాలకులు నోరు విప్పకుండా నేరస్తులను కాపాడుతున్నారు. మల్లయోధులు మాత్రం ధైర్యంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కష్ట నష్టాలను లెక్క చేయకుండా ధైర్యంగా పోరాడుతున్న రెజ్లర్లకు సమాజంలోని సమస్త వర్గాల నుండి మద్దతు లభిస్తుంది.
కేవలం పురుషుల క్రీడగా భావించే వారి నోర్లు మూయించిన ధీరలు. మూస పద్దతులను బద్దలు కొట్టిన సాహసీమణులు. పతకాల వర్షం కురిపించిన విజేతలు. దేశ కీర్తిని ప్రపంచం ముందు సగర్వంగా నిలబెట్టిన యల్ల యోధులు. ఇప్పుడు న్యాయం కోసం నడిరోడ్డుపై నిలబడ్డారు. తమపై లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తిని శిక్షించమంటూ గొంతువిప్పారు. ఒకప్పుడు ఆ క్రీడా యోధులతో సెల్ఫీలు దిగేందుకు ఆరాటపడిన కొందరు ఇప్పుడు తమకు తాముగా వారికి దూరమయ్యారు. వారి అసాధారణ పోరాటాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపేక్షిస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగస్వాములు అనే నిందకు గురిచేస్తున్నారు. వారి పోరాటానికి అండగా నిలవకపోగా ఆరోపణలకు తొలుత రుజువులు చూపండి అంటూ బాధితులను ఆదేశిస్తున్నారు.
అతను వారిని ఎక్కడ తాకాడో, ఎలా తాకాడో, ఏ సాకుతో తాకేందుకు ప్రయత్నించాడో ప్రతిదీ వివరంగా చెప్పారు. అతనున్న పరిసరాలలో ఒంటరిగా వెళ్ళేందుకు భయపడి ఎక్కడికి వెళ్ళినా గుంపులుగా వెళ్ళేవారమని చెప్పారు. అయినా తన అధికారంతో ఒక్కొక్కరినీ ఒంటరిగా గదికి పిలిపించుకుని అడగరాని ప్రశ్నలు అడిగేవాడని, సమాధానం చెప్పలేక అల్లాడిపోయేవారమని కూడా చెప్పారు. అందులో ఓ మైనర్‌ బాలిక సైతం ఉంది. ఏ ఆడపిల్లలైనా తమపై జరిగిన లైంగిక దాడి గురించి ఇంతకు మించి ఇంకెలా చెప్పగలరు. మనసున్న ఎవరికైనా ఈ విషయం తెలుసు. కానీ పోలీసులకు, అధికారులకు, పాలకులకు మాత్రం తెలియడం లేదు.
నూతన పార్లమెంటు భవనం సాక్షిగా తమకు జరిగిన పరాభవాన్ని భరించలేక చివరకు తాము సాధించిన విలువైన పతకాలను గంగార్పణం చేస్తామంటే నాటక ఫక్కీలో వ్యవహరిస్తున్నారనే పరిహాసం వారికి ఎదురయింది. చివరకు ‘జాతి వ్యతిరేకులు’ అనే ఈసడింపులను సైతం చవిచూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అసలు దుష్కార్యానికి పాల్పడిన వ్యక్తి మాత్రం స్వేచ్ఛగా ఉన్నాడు. మరో విచిత్రమేమిటంటే రెజ్లర్లను నిర్దాక్షిణ్యంగా నిరసన ప్రదేశం నుంచి దూరంగా తరలించిన పోలీసులు, సుప్రీంకోర్టు ఆదేశించేంత వరకు మల్ల యోధుల ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయనే లేదు.
తాము ఢి కొడుతుంది ఓ రాజకీయ శక్తిమంతుడైన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అని రెజ్లర్లకు తెలుసు. అందునా అధికారంలో ఉన్న బీజెపీ ఎంపీ అని కూడా తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైనది తాము ఆడుతున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆప్‌ ఇండియా అధ్యక్షుడనీ తెలుసు. ఆ సంస్థ కార్యకలాపాలలో ఆయనదే తుది మాట అనీ తెలుసు. అతనిపై వేసిన ఆరోపణలు రుజులు చేయలేకపోతే ఇక వారి భవిత శూన్యం అనీ కూడా తెలుసు. అయినా ధైర్యంగా ముందుకొచ్చారు? భవిష్యత్‌లో క్రీడారంగంలోకి వచ్చే అమ్మాయిలు తమలా బాధపడకూడదనే కదా! అయినా పాలకులు నోరు విప్పకుండా నేరస్తులను కాపాడుతున్నారు. మల్లయోధులు మాత్రం ధైర్యంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కష్ట నష్టాలను లెక్క చేయకుండా ధైర్యంగా పోరాడుతున్న రెజ్లర్లకు క్రీడాకారులు, మహిళాసంఘాలు, రైతు సంఘాల నుండి మద్దతు లభిస్తుంది.
మహిళా క్రీడాకారులు ఇప్పుడు అన్ని ఆటలలోనూ విశేషంగా రాణిస్తున్నారు. కేవలం కుస్తీ పోటీలలోనే కాదు బ్యాడ్మింటన్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌ మొదలైన క్రీడా పోటీలలో ప్రపంచ చాంపియన్లుగా వెలుగొందుతున్నారు. ఆటల పట్ల ప్రజల దృక్పథంలో మౌలిక మార్పును తెచ్చారు. లింగ సమానత్వం పట్ల అవగాహన, ఆమోదనీయతను పెంపొందించారు. మహిళా క్రికెటర్ల ఘనవిజయాలు ఈ కొత్త వైఖరులను మరింతగా దృఢపరుస్తున్నాయి. ఆట స్థలంలో ఘన విజయాలు సాధించిన వారు విశాల సమాజంలోనూ తమకు విశేష గౌరవాదరాలను కోరుకోవడం సహజం. వారికి అండగా నిలబడడం మన కర్తవ్యం.

Spread the love