న్యాయం కోసం మల్లయోధుల మహాకుస్తీ

లైంగికదాడి సంస్కృతిలో భాగమని బీజేపీ కేంద్ర మంత్రులే అంటుంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడుంది.
మహిళలను ఏమైనా చెయ్యవచ్చని పురుషాధిక్య భావ జాలాన్ని పెంచి పోషిస్తున్నది బీజేపీ కేంద్ర ప్రభుత్వం.ఎందుకంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానంలోనే మహిళలంటే తక్కువ, చిన్నచూపు, రెండవ పౌరురాలు,వంటింటికే పరిమితం కావాలి, పిల్లల్ని కనే యంత్రంలా ఉండాలని వాళ్ళ మనువాద సిద్ధాంతం చెబుతున్నది. అందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం స్థానంలో మను ధర్మశాస్త్రాన్ని తేవాలని, రాజ్యాంగం ద్వారా మహిళలకున్న హక్కుల్ని తొలగించాలని ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగమే రెజ్లర్ల పోరాటాన్ని అణిచివేయడం. ఈ దుర్మార్గ విధానాలను ప్రజలందరూ తిప్పికొట్టాలి. న్యాయం కోసం, వారి హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తున్న రెజ్లర్లకు సమాజమంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.
రక్షించాల్సిన వాడే భక్షిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఢిల్లీలో జరుగుతున్న రెజ్లర్ల పోరాటంపైన కేంద్ర ప్రభుత్వం నిర్బంధకాండను చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆల్‌ ఇండియా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని భారత మల్లయోధులైన మహిళా రెజ్లర్లు వినేష్‌ ఫోగట్‌, సాక్షిమాలిక్‌ గత 40రోజులకు పైగా ఢిల్లీ నడిబొడ్డున జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక పోరాటం చేస్తున్నారు. రెజ్లర్లు పథకాలు సాధించినప్పుడు అభినందించిన ప్రధానమంత్రి ఇప్పుడు రెజ్లర్లు న్యాయం అడిగితే మాత్రం స్పందించటం లేదు. ఇంతకాలం గడిచినప్పటికి కనీసం ఈ అంశంపైన ప్రధాన మంత్రి రెండు నెలలుగా నోరుమెదపటం లేదు. ‘ఆడపిల్లలు మేము లైంగిక వేధింపులకు గురయ్యాం అని చెప్పగానే ఆ నేరస్తుడిపై వెంటనే ఎటువంటి ఆలోచన చేయకుండా చర్యలు తీసు కోవాలి.’ ఈ మాట అన్నది ఎవరో కాదు బీజేపీ ఎంపీ ప్రీతమ్‌ ముండే. మరి నెలన్నర గడుస్తున్నప్పటికీ కేంద్రం బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు. పైగా న్యాయం అడిగిన రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెడుతున్నది. వారి పోరాటంపైన నిర్బంధకాండను ప్రయోగిస్తున్నది.
రెజ్లర్లు ఒకేసారి పోరాటంలోకి రాలేదు. పోరాటానికి ముందు వారి సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మొదట సంబంధిత కమిటీకి తెలియజేశారు. రెండు సంవత్సరాల క్రితం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రెజ్లర్లు ఈ అంశాలను చెప్పారు. అయినా వారి సమస్యలు పరిష్కారం కాలేదు. కనీసం సంబంధిత బాధ్యునిపైన ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు. దీంతో అలసిపోయిన రెజ్లర్లు మరో గత్యంతరం లేని స్థితిలో ఢిల్లీ నడిబొడ్డున జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక ఆందోళనను ప్రారంభించారు. ఆందోళన అనంతరం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలేస్తే తప్ప బ్రిజ్‌ భూషణ్‌ పై కేసు నమోదు చేయలేదు పోలీసులు. ఏప్రిల్‌ 28న ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో 125మంది సాక్షుల వాంగ్మూలం పోలీసులు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సాక్షులు బ్రిజ్‌భూషణ్‌ లైంగికంగా వేధించడం వాస్తవమేనని నలుగురు సాక్షులు ఇప్పటికే ధృవీకరించారు. ఆ సాక్షుల్లో ఇద్దరు రెజ్లర్లు. ఒక టాప్‌ రిఫరీ, ఒక రాష్ట్ర కోచ్‌ ఉన్నారు. సంఘటన జరిగిన ఆరు గంటల తర్వాత తనను పిలిచారని కోచ్‌ చెప్పారు. ఆరోపణల గురించి తెలుసునని రిఫరీ తెలిపారు. వృత్తిపరమైన సహాయానికి బదులుగా లైంగిక ప్రయోజనాలను కోరిన కనీసం రెండు సందర్భాలున్నాయని, దాదాపు 15లైంగిక వేధింపుల ఘటనలు. ఇందులో పది ఎపిసోడ్‌లు అనుచితంగా తాకడం, వేధింపులు, చాతిపై చేతులు వేయడం, నాభిని తాకడం, వెంబడించటంతో సహా బెదిరింపులకు సంబంధించిన అనేక సందర్భాలున్నాయని సాక్షులను విచారించినప్పుడు ఈ అంశాలు చెప్పారని పోలీసులు తెలియజేశారు. ఇంకా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్వాస ప్రక్రియ పేరుతో బ్రిజ్‌భూషణ్‌ తాకరాని చోట్ల తాకారని, బలవంతంగా కౌగిలించుకున్నాడని, రెస్టారెంట్‌కు పిలిచి ఇబ్బందిపెట్టాడని, తాను ఒక ఆహార పదార్థాన్ని తీసుకువచ్చి తినాలని బలవంతం చేశాడని, ఒక క్రీడాకారిని ప్రపంచ స్థాయి పోటీల్లో గాయపడితే తనతో స్వయంగా బ్రిజ్‌ భూషణ్‌ మాట్లాడుతూ ‘నాతో సన్నిహితంగా ఉంటే నీ వైద్య ఖర్చులు ఫెడరేషన్‌ భరిస్తుంది’ అన్నట్లు తెలియజేసింది. ఇంతటి దుర్మార్గుడిని అరెస్టు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదంటే మహిళల పట్ల ఎంత వ్యతిరేకమైన భావంతో ఉందో అర్థమవుతుంది.
మహిళా రెజ్లర్లు తమ బాధని, ఆగ్రహాన్ని లోకానికి ఎలుగెత్తి చాటుతుంటే ప్రపంచమంతా అర్థమవుతున్న, కేంద్ర పాలకులకు మాత్రం వినిపించడం లేదు. పైగా బాధితులని అణచివేస్తూ, నిందితులను కాపాడడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. నిరసన తెలియజేస్తున్న రెజ్లర్లను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మొదట జంతర్‌మంతర్‌ వద్ద కరెంట్‌, నీళ్ళు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేయాలని చూశారు. రెజ్లర్లకు అన్నం, మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను వెనక్కి తిప్పి పంపించారు. అర్ధరాత్రి అరెస్టులు చేసి రెజ్లర్లను బెదిరించాలని ప్రయత్నం చేశారు. అయినా రెజ్లర్లు భయపడలేదు. వాళ్ళ పోరాటాన్ని ఇంకా ముందుకే కొనసాగిస్తున్నారు. మే 28వ తేదీన ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనం ముందు మహా పంచాయతీ నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. నిరసన స్థలానికి చేరుకుంటున్న వారిని ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. మహిళా రెజ్లర్లను పోలీసులు అత్యంత దారుణంగా ఈడ్చుకుంటూ బలవంతంగా అరెస్టులు చేసి కేసులు బనాయించారు. జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా శిబిరాలను తొలగించారు. ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే అనుమతి ఇవ్వకుండా రెజ్లర్ల పోరాటంపైన కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన నిర్బంధకాండను ప్రయోగించింది. కేంద్రాన్ని నిరసిస్తూ తాము సాధించిన పథకాలను గంగానదిలో విసిరివేస్తామని రెజ్లర్లు ప్రకటించారు. తొందరపడొద్దని రైతు సంఘాల నాయకులు ఓదార్చటంతో పథకాలను గంగానదిలో విసరకుండా వెనక్కి తగ్గారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేదిలేదని మళ్ళీ అదే జంతర్‌మంతర్‌ వద్ద తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రెజ్లర్ల పోరాటానికి దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు రోజు, రోజుకు పెరుగుతున్నది. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, స్వతంత్ర సంఘాలు, పౌరహక్కుల నేతలు, మేధావులు ఇంకా అనేక సంస్థలు, ప్రజలు రెజ్లర్లకు అండగా నిలబడుతూ అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం వినబడనట్లు, చూడనట్లు వ్యవహరిస్తున్నది.
ఇక నిందితుడు బ్రిజ్‌భూషణ్‌ విషయానికి వస్తే తాను ప్రారంభం నుండి నేను చేయలేదు అనట్లేదు. సాక్షాలుంటే చూపెట్టాలని సవాలు విసురు తున్నాడు. లైంగిక వేధింపులు ఎవడైనా నలుగురున్నప్పుడు చేస్తాడా సాక్షాలుండటానికి? ఇంత దుర్మార్గంగా బ్రిజ్‌భూషణ్‌ వ్యాఖ్యానిస్తున్నాడు. ఇప్పుడు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చేసరికి ఇప్పుడు ఫోక్స్‌ చట్టాన్ని మార్చాలని అంటున్నాడు. ఫోక్స్‌ చట్టంలో లైంగిక వేధింపులు చేశాడని రుజువైతే వెంటనే అరెస్టు చేయాలని ఉంది. రుజువైనా అరెస్టు చేయకుండా ఉండే విధంగా చట్టాన్ని మార్చాలని చెపుతున్నాడు. నిందితుడు ఇంత తలబిరుసుగా మాట్లాడటానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉండటమే కారణం. కేంద్ర ప్రభుత్వమే మహిళల పట్ల హింసను, హత్యలను, లైంగికదాడులను పెంచి పోషిస్తున్నది. మహిళలను మీకు నచ్చినట్లు చేసుకోండని సమాజానికి సందేశం ఇస్తున్నది. తప్పు చేసిన వాళ్ళను వదిలేసి అత్యాచారాలు జరగడానికి మహిళల వేషధారణే కారణమని మహిళలపైన దాడిని పెంచుతున్నది. లైంగికదాడి సంస్కృతిలో భాగమని బీజేపీ కేంద్ర మంత్రులే అంటుంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడుంది. మహిళలను ఏమైనా చెయ్యవచ్చని పురుషాధిక్య భావ జాలాన్ని పెంచి పోషిస్తున్నది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానంలోనే మహిళలంటే తక్కువ, చిన్నచూపు, రెండవ పౌరురాలు, వంటింటికే పరిమితం కావాలి, పిల్లల్ని కనే యంత్రంలా ఉండాలని వాళ్ళ మనువాద సిద్ధాంతం చెబుతున్నది. అందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం స్థానంలో మను ధర్మశాస్త్రాన్ని తేవాలని, రాజ్యాంగం ద్వారా మహిళలకున్న హక్కుల్ని తొలగించాలని ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగమే రెజ్లర్ల పోరాటాన్ని అణిచివేయడం. ఈ దుర్మార్గ విధానా లను ప్రజలందరూ తిప్పికొట్టాలి. న్యాయం కోసం, వారి హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తున్న రెజ్లర్లకు సమాజమంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.
సెల్‌:9490098605

Spread the love