తెలుగురాష్ట్రాల్లో కమలం కమాల్‌

గత పదిహేను రోజులుగా బీజేపీ తెలుగు రాష్ట్రాలలో సాగించిన రాజకీయ విన్యాసాలు వాటికి పరాకాష్టగా ప్రధాని మోడీ పర్యటన, ఇందుకు సమాంతరంగా కొన్ని ప్రాంతీయ పార్టీల పిల్లిమొగ్గలు అవకాశవాదానికి అద్దం పడుతున్నాయి. ఎవరు ఎవరితో కలుస్తున్నారు, ఏ దిశలో పయనిస్తున్నారు అనేదానిపై భిన్న సంకేతాలిస్తూ ప్రజల్లో గందరగోళం పెంచడం వాటి నైజాన్ని నిరూపించింది. మరోవైపున తన జాతీయ వ్యూహాలలో భాగంగా ఈ పార్టీల పట్ల తన వైఖరి గురించి బీజేపీ కూడా ఉద్దేశపూర్వకంగానే తికమక సృష్టించింది. ఇంకా కొనసాగిస్తోంది కూడా. వాటికి అనుకూలమైన మీడియాలు కూడా తమవైన ఊహాగానాలతో కల్పనాకథలతో కాలక్షేపం చేశాయి. వీటిలో దేనిపైనా వీటి నాయకులు ఇదమిద్దంగా ప్రకటన చేయకుండా అస్పష్టతకే బలం చేకూర్చడం ఇందులో భాగమే. బెంగళూరులో ఈ నెల మూడవ వారంలో జరిగే ప్రతిపక్షాల మలిసమావేశం, బీజేపీ ఆధ్వర్యంలో జరిగే ఎన్‌డీఏ విస్తృత సమావేశం వీటికి జాతీయ ప్రతిధ్వనిగా ఉన్నాయి.
తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామని హడావుడి చేసిన బీజేపీ ముందుగానే చేతులెత్తేయడంతో ఈ ప్రహసనం మొదలైంది. బండి సంజరు అధ్యక్షుడైనాక దూసుకుపోతున్నామనీ, ఇతర పార్టీల నేతలు క్యూలు కడుతున్నారని పెద్ద హంగామా చేశారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఎన్నికలలో విజయాలు ఇందుకు నిదర్శనాలుగా చెప్పబడ్డాయి. అయితే ఆ రెండు శాసనసభ ఉపఎన్నికలలోనూ రఘునందన్‌, ఈటల రాజేందర్‌ గెలుపులు ప్రత్యేక పరిస్థితులలో లభించాయనీ, జీహెచ్‌ఎంసీలో సంజరు మతతత్వం రెచ్చగొట్టడంతో అధికంగా సీట్లు వచ్చాయని అందరికీ తెలుసు. అయినా కావాలనే ఈ హైప్‌ను పెంచుతూ రావడానికి కొన్ని మీడియా సంస్థలు వ్యూహాత్మకంగా కారణమైనాయి. ఆ వూపులో కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ అసెంబ్లీకి రాజీనామా చేసి మునుగోడులో ఉప ఎన్నిక తీసుకు వచ్చి భంగపడ్డారు. కాకపోతే ఇక్కడ వామపక్షాలు బలపర్చి ఉండకపోతే టీఆర్‌ఎస్‌/బీఆర్‌ఎస్‌ గెలిచివుండేది కాదని కూడా తేలిపోయింది. ఈ ఎన్నికకు కాస్తముందుగా ఆపరేషన్‌ ఫాంహౌస్‌లో చిక్కిపోయిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంఎల్‌సీ కవితను ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో భాగస్వామిగా ఆరోపించి దాడిచేసింది. ఈడీ ఆమెను పలుసార్లు విచారించింది. కవితనే గాక కేసీఆర్‌ను కూడా అరెస్టు చేస్తామన్న స్థాయిలో బండి సంజరు వంటివారు రెచ్చిపోయి మాట్లాడారు. ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను కావాలని ఉసిగొలుపుతున్నారని బీఆర్‌ఎస్‌తో పాటు సుప్రీం కోర్టులో కేసు వాదించిన కాంగ్రెస్‌ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వంపై చర్యతీసుకోవాలని విమర్శలు చేస్తూనే వచ్చింది. కర్నాటక విజయం తర్వాత జోష్‌ పెరిగినట్టుగా దాడితీవ్రం చేసింది. బీజేపీ చేరికల కమిటీ ఎన్ని తంటాలు పడినా చెప్పుకోదగిన వారెవరూ చేరకపోవడం వాస్తవ పరిస్థితిని వెల్లడించింది. బీఆర్‌ఎస్‌ నుంచి నిష్క్రమించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటివారు కూడా కాంగ్రెస్‌లోనే చేరడం బీజేపీకి మరీ ఇబ్బందిగా మారింది. కేసీఆర్‌ కూడా తమకు రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌ తప్ప బీజేపీ కాదని పలుసార్లు ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండింటిపైనా సమానంగా విమర్శలు చేసే ఆ పార్టీని పాట్నా సదస్సుకు ఆహ్వానించలేదు కూడా. బీజేపీపై కేసీఆర్‌ విమర్శల తీవ్రత తగ్గిందనే అభిప్రాయమూ పెరిగింది. ఆ దశలో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు సమావేశమై కేసీఆర్‌ను కలసి ఎన్నికల విషయమై స్పష్టతకు రావాలని నిర్ణయానికి వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌తో కలసి పనిచేస్తామని ప్రకటించిన కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారని కూడా కొన్ని మీడియాలు రాశాయి. తాము బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలనే బీఆర్‌ఎస్‌కు చెబుతామనీ, సీట్ల చర్చలకోసం తాముగా అడగబోమని కూడా ఉభయపార్టీలు ప్రకటించాయి. నిజానికి కేరళలో సీపీఐ(ఎం) ఇప్పటికే విమర్శించినట్టుగా జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించాలనే తన లక్ష్యానికి ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ లౌకిక పార్టీల పట్ల తీసుకోవలసిన వైఖరికి మధ్య కాంగ్రెస్‌ సమతుల్యవైఖరి తీసుకోలేకపోవడం తెలంగాణలోనూ ఉంది. పైగా బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒకటేనన్న వైఖరి ముదిరి మొన్న ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో రాహుల్‌గాంధీ దానికి బీటీమ్‌గా ఆరోపించారు. సహజంగానే దీనిపై పాలకపార్టీ విరుచుకుపడి మీరిద్దరే ఒక టీమ్‌ అన్నట్టు ఎదురుదాడి చేసింది. ఈ మూడు పార్టీలూ తక్కిన ఇద్దరినీ ఒక టీమ్‌గా విమర్శించడం పరిపాటిగా మారింది.
ఇవన్నీ ఎలా ఉన్నా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పార్టీలో అంతర్గతంగానే తీవ్ర అసంతృప్తి, అంతఃకలహాలు పెరుగుతూనే వచ్చాయి. ఈటల రాజేందర్‌ను అధ్యక్షుడిని చేస్తారని ఒక లాబీ చాలా కాలంగా చెబుతూవచ్చింది. దాన్ని మరోవర్గం వ్యతిరేకించడంతో మధ్యే మార్గంగా మళ్లీ కిషన్‌రెడ్డిని తీసుకొచ్చారు. అయితే ఈ లోగా విజయశాంతి, జితేందర్‌రెడ్డి, రాజగోపాలరెడ్డి, రఘునందనరావుతో సహా ప్రతివారూ బహిరంగంగానే ధిక్కారం చేశారు. రఘునందన్‌ అయితే సంజరుకి రూ.వందకోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నా వల్లనే పార్టీకి ఊపొచ్చిందని ఆయనా రాజేందర్‌ కూడాపోటీలు పడ్డారు. దాదాపు వారం సాగిన ఈ తంతు కాంగ్రెస్‌ కలహాలను కూడా మరపించింది. ఈ మొత్తం వ్యవహారం పదవుల కోసమే గాని వీరిలో ఎవరూ మత రాజకీయాలపై అభ్యంతరం పెట్టింది లేదు. బండి సంజరుని కేంద్రంలోకి తీసుకుంటారని కూడా దాదాపు నమ్మకంగా చెబుతున్నారు. తెలంగాణలో మొదలైన ఈ లొల్లి ఏపీకి పాకి అక్కడా అధ్యక్ష మార్పును తెరపైకి తెచ్చింది. సోము వీర్రాజుకు ఎసరు పెట్టింది. ఈ క్రమంలో సత్యకుమార్‌ను చేస్తారని ఒక లాబీ ప్రచారం నడిపింది. తనను తెలుగుదేశం అనుకూలుడుగా ప్రచారం చేసింది మరో వర్గం. టీడీపీ నుంచి వచ్చి చేరిన సుజనాచౌదరి వంటివారి పేర్లు కూడా వినిపించాయి. చివరకు ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని అధ్యక్ష పదవిలో నియమించారు. రాష్ట్ర విభజన నిర్ణయం వరకూ కాంగ్రెస్‌లో ఉండి తర్వాత బీజేపీలోకి మారిన ఆమె వ్యక్తిగతంగా కుటుంబపరంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సరిపడని వ్యక్తిగా భావిస్తారు. బీజేపీతో మరోసారి పొత్తుపెట్టుకోవడం కోసం చంద్రబాబు ఆరాటపడుతూ అందుకోసం అమిత్‌షా, నడ్డాలను కూడా కలసి వచ్చిన నేపథ్యంలో ఈ నియామకం అందుకు విరుద్ధమైన సంకేతాలిచ్చింది. ఈ నిర్ణయం జరిగే సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీలో ఉండి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలను కలిసి కొన్ని నిధులు విడుదల కావడం కూడా రాజకీయ జోస్యాలను రక్తికట్టించింది. గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఈ పొత్తుల ముచ్చట గందరగోళం పెంచడానికి తన వంతు పాత్ర పోషించారు. ఏతావాతా బీజేపీ ద్వంద్వ రాజకీయ క్రీడలో మూడు ప్రాంతీయ పార్టీలు పాచికలుగా ఉపయోగపడ్డాయి. ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే అందరి మద్దతు తీసుకోవచ్చనే బీజేపీ వ్యూహానికి భూమిక కల్పించాయి. అయితే ఇప్పటికీ ఈ విషయంలో అంతిమ నిర్ణయం మిగిలే ఉంది. ఎన్‌డీఏ సమావేశానికి టీడీపీ వెళ్తుందని కూడా అనుకూల ఛానళ్లు హడావుడి చేసినా చివరకు ఆహ్వానం రాలేదని ఆ పార్టీయే ప్రకటించాల్సి వచ్చింది. పంజాబ్‌లో అకాలీదళ్‌ విషయంలోనైతే తాము మళ్లీ ఎన్‌డీఏలో చేరబోమని వారే ప్రకటించారు గాని టీడీపీ మాత్రం ఆ పనిచేయడానికి సిద్ధంగా లేదు. వైఎస్‌ షర్మిల పార్టీ బీజేపీకి దగ్గరైనట్టు ఒక దశలో కనిపించగా, తర్వాత కాంగ్రెస్‌లో కలసిపోతుందని లేదంటే చేతులు కలుపుతుందని కథనాలు కూడా ఏపీ, తెలంగాణలలో శీర్షికలయ్యాయి. ఏపీలో జగన్‌పై ఆమె రాజకీయంగా పోరాడుతుందని కూడా ఆ మీడియా కథనాలిచ్చింది. తాను తెలంగాణకే పరిమితమంటూ ఖండన విడుదల చేసిన షర్మిల కాంగ్రెస్‌తో బంధం విషయం మాత్రం తేల్చలేదు. అయితే వైఎస్‌ జయంతికి సోనియాగాంధీ ఇడుపులపాయ వస్తారనే వార్తలు నిజం కాకపోవడంతో ఈ కథలు కూడా తేలిపోయినట్టే. సీనియర్‌ నాయకుడు కెవిపి రామచంద్రరావు వంటివారు కూడా బలపర్చిన ఈ కథనం ఎందుకు విఫలమైందో లేక మరేదైనా మార్పువుందో చూడవలసిందే. అయినా ఆమె ప్రభావం చాలా పరిమితమే అన్నది ఒకటైతే, పాలేరులో పోటీపైనే దృష్టి పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణలో టీడీపీ, జనసేనలతో పొత్తు ప్రసక్తి లేదని కూడా బీజేపీ ప్రకటించింది.
చివరగా ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ మరోసారి ఆయనపై విమర్శలు సంధించారు. ఈపర్యటనలో అధికారిక కార్యక్రమాలలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనలేదు. బహిష్కరిస్తున్నట్టు ఆపార్టీ ప్రకటించింది. తమ పార్టీ సభల్లో ప్రధాని కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి మయమని తీవ్రంగా దాడి చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర సభలలోనూ ఆయన కేసీఆర్‌ కుటుంబ అవినీతి ఆరోపణలంటూ ప్రస్తావించారు. అవినీతి కోసమే ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వాలు సహకరించుకుంటున్నాయని ఆప్‌ను కూడా రంగంలోకి తెచ్చారు. ప్రతిపక్షాల జాతీయ సమావేశం జరగనున్న నేపథ్యంలోనే మోడీ ఇవన్నీ మాట్లాడారనేది స్పష్టమే. ఒక విధంగా ఇది బీఆర్‌ఎస్‌ వారితో కలిసివున్నట్టు కాంగ్రెస్‌ చేసే ఆరోపణకు సమాధానం కూడా. మోడీతో పాటు సభలో పాల్గొన్న నేతలు కూడా బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తిలేదని మరీ మరీ చెప్పారు. ఈ విధంగా తెలంగాణ రాజకీయ దృశ్యం మళ్లీ యథాస్థితికి వచ్చినట్టే. కానీ కాంగ్రెస్‌ మాత్రం తన ఆరోపణ కొనసాగిస్తుంటే బీఆర్‌ఎస్‌ ఈ ఉభయులనూ కలిపి ఖండిస్తున్నది. శాసనసభ ఎన్నికలు సమీపించిన సమయంలో బీజేపీ అంతర్గత సంక్షోభంలో చిక్కుకోవడం ముందే ఓటమిని అంగీకరించిన చందంగా ఉంది. అయినా తామే గెలుస్తామని హడావుడి సాగిస్తూనే ఉంది. కాంగ్రెస్‌ దూకుడు పెరిగినా విజయం సాధించేస్థాయిలో ఉందా అనేది ప్రశ్నార్థకమే. ఇక బీఆర్‌ఎస్‌ తాజా పరిణామాల దృష్ట్యా ఏ విధమైన కార్యాచరణ స్పష్టత ఇస్తుందోనని పరిశీలకులు గమనిస్తున్నారు. ఏపీలో బీజేపీ ప్రభావం నామమాత్రమైనా మూడు ప్రాంతీయ పార్టీలూ అనుకూలంగానే ఉన్నందున ఎలాంటి రాజకీయ యుక్తులకు పాల్పడుతుందనే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎన్నికల్లో తాము వంటరిగానే పోటీ చేస్తామని ఎప్పటిలాగే వైసీపీ చెబుతున్నా ఇతర కోణాలు చూడవలసిందే. ఇవన్నీ ఒకటైతే ముందస్తు లేదా జమిలి ఎన్నికలంటూ బీజేపీ సృష్టించే సందేహాలు కూడా అస్పష్టత పెంచుతున్నాయి. ఈ మొత్తం కమలం కమాల్‌ ఇప్పట్లో తేలదేమో.
తెలకపల్లి రవి

Spread the love