ఏకరూపం ఎవరికోసం!

ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే పాలన. చాలా వీనులవిందుగా వినపడుతుంది. అంతా ఒక్కటిగా ఉండటమంటే మాటలా మరి! అందుకోసం కృషి చేసేవాళ్లు ఎంత విశాల హృదయులు! వారి కృషిని ఆహ్వానించాల్సిందే, అని పరవశించిపోతున్న వాళ్లు అనేకులను చూస్తుంటే వెనకటి కథ ఎలుకల రొట్టె తగాదాను పిల్లి పరిష్కరించినది గుర్తుకు వస్తోంది. ఒకే దోపిడి, ఒకే వివక్ష, ఒకే విధ్వంసం, ఒకే ఉన్మాదంతో జనాన్ని ముంచే యత్నాలకు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి ఓ ఆయుధంలా దొరికింది ఏలినవారికి. డెబ్భయి అయిదేండ్ల స్వతంత్రంలో ఆర్థిక అసమానతలు అంతరించకపోగా పెరిగాయి. సామాజిక అసమానతలు అలానే ఉన్నాయి! ఉన్నవాడి బాధలకు, లేనివాడి బాధలకు ఏకరూపత లేదు. స్త్రీ, పురుషుల సమానత్వమూ సాధించబడలేదు. చదువుకునే హక్కును అందరూ ఇంకా పొందలేకపోతున్నారు. పసిపిల్లల ఆహారమూ, ఆరోగ్యమూ అందరికి సమానంగా సాధించబడలేదు. ఉండటానికి గూడు, గుడ్డ, కూడు సమకూర్చనేలేదు. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతితో వారసత్వ హక్కులన్నింటినీ సమానం చేస్తారట. అంటే దారిద్య్రాన్ని, లేమిని, అనారోగ్యాన్ని అశేష జనులకూ ధనవంతుల ధనాన్ని వారి పిల్లలకూ సమానంగా పొందే హక్కు కల్పిస్తాడన్నమాట!
ఒకే తూటాకి రెండు పిట్టలు అన్నట్లుగా, ఎన్నికల సమయంలో ఈ పౌరస్మృతి చట్టాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఒకటి మతాల మధ్య ద్వేషాలను పెంచటం, రెండోది ఉమ్మడి పేరుతో సామాన్య బడుగు, బలహీన ప్రజల ప్రత్యేక హక్కులను కాలరాసి కార్పొరేట్లకు మేలుచేయటం, పేదల రాయితీలను రద్దు చేయటం అనేవి దీని మూలంగా జరిగే అనర్థాలు. చాలామంది ప్రజలు ఉమ్మడి పౌరస్మృతి అనగానే మతపరమైన అంశమని, అదీ మన ప్రత్యర్థి మతాన్ని నియంత్రించేదని అనుకుంటున్నారు. కాని ఇది అన్ని మతాలకూ, అందరు ప్రజలకూ సంబంధించినది. అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తితో సాగుతున్నది. ఎన్నో మతాలు, సంస్కృతులు, కులాలు, తెగలు, జాతులు, ఆచారాలు, సంప్రదాయాలు, భాషలు, భిన్నమైన విధానాలతో బతుకుతున్న దేశం. వివాహాల సంప్రదాయాలు వేరుగా ఉన్నాయి. విడాకుల సంప్రదాయాలూ వేరుగా ఉన్నాయి. పునర్విహాలు వేరు వేరు, వారసత్వా విధానాలూ వేరు, ఆహారపు అలవాట్లూ వేరువేరు. వీటన్నింటిని క్రోడీకరించి ఎలా ఏకరూపంలోకి తెస్తారు? గతంలో అధ్యయనం చేసిన లా కమిషన్‌ బహుళ సంస్కృతులు ఉన్న సమాజంలో ఉమ్మడి స్మృతి అసాధ్యమని, వాంఛనీయము కాదని పేర్కొన్నది. మన దేశంలో కులాల మధ్య అంతరాలు అధికంగా ఉన్నాయి. అసమానంగా చూడటమూ ఉంది. అలా చూడకూడదన్న చట్టాలూ ఉన్నాయి. కానీ దుర్మార్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఏం చేయాలో ఏమైనా ఆలోచించారా! మొన్న మొన్నటి వరకూ హిందూమతంలో సతీసహగమనం ఆచారంగా కొనసాగింది కదా! ఇప్పటికీ ఈ మతంలో స్త్రీ వంటింటికీ, పిల్లలు కనటానికి, సేవచేయటానికేనని బోధిస్తున్నది కదా! అలాంటి మనుస్మృతియే మా రాజ్యాంగమని ప్రకటించిన వారి వారసులే లింగ సమానత కోసం ఈ స్మృతిని తెస్తున్నామనటమే వింతగా ఉంది.
ఆనాడు అంబేద్కర్‌ హిందూకోడ్‌ బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే హిందూ సాంస్కృతిక మహాసౌధం కూలిపోతుందని వ్యతిరేకించిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ హిందూ సంఘీయుల వారసులు ఇప్పుడెలా ఉమ్మడి విధానాన్ని ముందుకు తెస్తున్నారు? హిందూ సంస్కృతిలో ఏ అంశాన్నీ వేలెత్తి చూపడానికి వీళ్లేదని వాదించిన వారే నేడు ఈ నినాదాన్ని ఎత్తుకోవటం వెనుక వారి ఉద్దేశ్యాలు వేరుగా ఉన్నాయి. పర్సనల్‌ లాలు ఒక్క ముస్లింలకే లేవు, అన్ని మతాలకూ ఉన్నాయి. అందరూ సమానంగా వ్యవహరించటానికి మన రాజ్యాంగమూ అందరికి అన్ని హక్కులనూ కల్పిస్తున్నది కూడా. ముస్లిం షరియత్‌, పెండ్లిళ్లు, తలాక్‌లకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. కానీ ఆ రకమైన వైరుధ్యాన్ని ముందుకు తెచ్చి, విద్వేషాలను నింపజూస్తున్నది. అందుకనే ”ఉమ్మడి స్మృతికి హిందూ రాష్ట్ర భావనకు సంబంధం ఉన్నదని, వేల సంవత్సరాలుగా భిన్న అభిప్రాయాలతో సంస్కృతులతో జీవిస్తున్నాం, మరో వేయ్యేండ్లు జీవిస్తాం. యూసీసీ ప్రవేశపెట్టి ఎవరు ప్రయోజనం పొందుతారు?” అని నోబుల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ ప్రశ్నించారు.
వందల వేల సంవత్సరాలుగా దేశంలోని దళితులు, ఆదివాసీలు ఆర్థిక దోపిడీకి, లైంగిక దోపిడీకి గురవుతున్నందున వారి కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు వచ్చాయి. మరి ఈ ఉమ్మడి స్మృతితో అవన్నీ ఉంటాయా? లేదా! ఆదివాసీలకు 1/70 చట్టం ఉంది. రక్షించబడుతుందా? రిజర్వేషన్లూ ఉన్నాయి. వాటి సంగతేమిటి? మహిళల వివక్షపై దాడులపై ప్రత్యేక చట్టాలున్నాయి. రేపు కోడ్‌వస్తే! బీఫ్‌ ఆహార హక్కుగా ఉంటుందా లేదా! ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా హడావిడి చేస్తే ఎలా? యూసీసీ లేకుండానే లింగ సమానత్వం సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏవైనా వివక్షతలుంటే పరిశీలించి ఆ చట్టాలను సవరించాలి. అంతే కానీ వైవిధ్యాలను, విభిన్నతలను వైరుధ్యంగా చేసే ప్రయత్నాలు సరికాదు.

Spread the love