గూడు

సొంత జాగా ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం మూడులక్షల రూపాయలు ఇస్తామనే గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించారు. మరిజాగాలేని వాళ్లేమికావాలి. జాగా చూసుకుని ఉంటున్నవాళ్లను ఎందుకు గుర్తించి, ఇల్లు కట్టించి ఇవ్వరు! పథకాలు చాలా వచ్చాయి. నాడు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌పేరుతో, కానీ ప్రజల గూడుబాధ తొలగనేలేదు. ప్రజా సంఘాలు అన్నికలిసి ఇండ్లులేని పేదలకోసం యాత్ర చేస్తున్నది. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది. వేలాదిగా పేదలు గూడు కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఆలకించడం,పరిష్కరించడం పాలకుల బాధ్యత. గూడు పొందటం జనుల హక్కు.
ప్రకృతిలో పక్షులకు, జంతువులకు, సమస్త జీవులకు వాటివాటి నివాస స్థలాలుంటాయి. గూళ్లుంటాయి. మనుషులూ మొదట చెట్టు తొర్రల్లో నివసించారు. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గూడునూ నిర్మించుకున్నాడు. ఇప్పుడనేక పేర్లతో పిలుచుకుంటాము. ఇల్లు, ఆవాసం, నివాసం, నిలయం, వసతి, గృహం, గీము, సదనం, సాల, కొంప, భవంతి, ధామం, ఆశ్రమం… ఇలా ఏ విధంగా పిలిచినా నివాసముండే చోటు అని అర్థం. నివాసాన్ని ఏర్పరుచుకోవటమనేది ప్రాకృతిక అవసరంగానే వచ్చిందని చెప్పవచ్చు. ఇక నాగరికత పెరిగాక, కుటుంబాలు ఏర్పడ్డాక ఇల్లు అనే దాని అర్థం మరింత విస్తృతమై స్థిరపడింది. కూడు, గూడు, గుడ్డ ఇవి కనీసావసరాలు. గూడు కలిగుండటమనేది మనిషికి ప్రాథమిక అవసరం. అంతేకాదు ఆధునిక సమాజంలో అదొక మానవహక్కు కూడా. ఒక వ్యక్తి గౌరవ జీవనానికి కావలసిన ఏర్పాటు, సౌకర్యం. అదొక సాంస్కృతిక జీవనానికి సంబంధించిన సామర్థ్యపు సమస్య. ఇల్లులేకపోవటమనేది నేడు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఇది పేదరికంతో ముడిపడి ఉన్న సమస్య. ఇల్లు లేని తనమనేది మనుషుల్ని మానసికంగా క్రుంగదీసే సమస్య. ఇంత పెద్ద భూమండలంలో, ఇంత నాగరికత పెరిగాక కూడా మనుషులు ఇండ్లులేక తండ్లాడటం అనేది వ్యవస్థలు మిగిల్చిన విషాదం!
ఇల్లులేక పోవటమంటే సభ్య సమాజంలో నివసించేందుకు కావలసిన జాగా లేకపోవటం. భద్రతలేకపోవటం, సాంస్కృతిక జీవనాన్ని కొనసాగించలేకపోవటం. మనుషుల గౌరవం భంగపడటం. దేశంలోని లక్షలాది మంది పేవ్‌మెంట్లపైన, రోడ్డుప్రక్క, రైల్వేప్లాట్‌ఫామ్స్‌పైన, గుళ్లలో, వీధుల్లో, పెద్ద సిమెంటుపైపుల్లో, బస్టాండుల్లో ఇంకా అనేకానేక స్థలాల్లో బతుకుల్ని గడిపేస్తున్నారు. 18 మిలియన్ల మంది వీధి బాలలే ఉన్నారని ప్రభుత్వం చెపుతోంది. 19 మిలియన్ల ఇండ్ల కొరత ఉందన్నది ప్రభుత్వ లెక్క. ఇంతకు పదిరెట్లు ఎక్కువే ఉంటారు. మరీ ముఖ్యమైన విషయమేమంటే, దేశంలోని యువతలో చాలా మంది గూడులేని వాళ్లుగానే ఉన్నారు. బాలలకు నివాసం లేకపోవటం వారి హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తులు సరియైన గూడును కలిగివుండటమనేది ప్రాథమిక హక్కుగా గుర్తించింది. రాష్ట్రాలు బాధ్యత వహించి వ్యక్తుల గౌరవానికి భంగం కలగకుండా వారికి ఇండ్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టూ పేర్కొంది. ఇండ్లంటే గదులే కాదు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన పరిసరాలు, సౌకర్యవంతమైన నివాస ఏర్పాటు, వెలుగు, దారులు మొదలైన వాటితో కూడిన ఇల్లు అందరికీ ఉండాలి. పట్టణాల్లో, నగరాల్లోనైతే పూరిపాకల్లో, డేరా గూళ్లలో, మురికివాడల్లో ఏ సౌకర్యాలూ లేకుండా నివసిస్తున్న ప్రజలు లక్షలాదిగా ఉన్నారు. ఇక ఆ వుంటున్న గాలికి, వానకు ఊగిపోయే పాకలు సైతం, జాతి విపత్తుల కారణంగా, అలజడులు, మతకల్లోలాలు, కోవిడ్‌ లాంటి విపత్తుల సందర్భంలో ఎగిరిపోతుంటాయి. గూళ్లు మాయమవుతాయి. వాళ్లందరూ ఈ దేశ పౌరులే. ఎవరు దీనికి కారకులు? పనిచేసే వాడికి పని కల్పించడం, ఉపాధి పెంచడం ప్రభుత్వ బాధ్యత. ఉద్యోగ భద్రత కల్పించలేనప్పుడు, ఈ కనీసావసరాల భద్రతను ఏర్పాటు చేయలేరు!
పేదలకు ఇండ్లు కట్టిస్తాం! అనేది ఒక రాజకీయ ప్రయోజన పూర్వకమైన వాగ్దానం. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండీ వినిపిస్తున్న నినాదం కూడా. ఇప్పటికీ ఇదే ఎజెండాగా రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గౌరవప్రదంగా కుటుంబాలు బ్రతకటానికి రెండు పడకల ఇల్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేశారు. పదేండ్లు గడుస్తున్నది. వందలు, వేలు మాత్రమే కడుతున్నారు. అవీ ఇంకా పూర్తికాలేదు. కావలసిన వాళ్లు లక్షల్లో ఉన్నారు. ఊరికి దూరంగానే అనేక ప్రభుత్వ భూములున్నాయి. పేదలు, ఇండ్లు లేనివారు గుడిసెలేసుకుని ఉంటే, ప్రభుత్వం పెద్దయెత్తున దాడులు చేసి ప్రజలను నిర్భంధానికి గురిచేస్తున్నది. రియలెస్టేట్‌ వ్యాపారుల భూ ఆక్రమణ దాహమూ పేదల ఇండ్లకు ఆటంకంగా మారుతున్నది. సొంత జాగా ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం మూడులక్షల రూపాయలు ఇస్తామనే గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించారు. మరిజాగాలేని వాళ్లేమికావాలి. జాగా చూసుకుని ఉంటున్నవాళ్లను ఎందుకు గుర్తించి, ఇల్లు కట్టించి ఇవ్వరు! పథకాలు చాలా వచ్చాయి. నాడు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌పేరుతో, కానీ ప్రజల గూడుబాధ తొలగనేలేదు. ప్రజా సంఘాలు అన్నికలిసి ఇండ్లులేని పేదల కోసం యాత్ర చేస్తున్నది. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది. వేలాదిగా పేదలు గూడు కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఆలకించడం, పరిష్కరించడం పాలకుల బాధ్యత. గూడు పొందటం జనుల హక్కు.

Spread the love