పాలకులే నేరస్థులైతే..?

‘జనం ఏమనుకున్నా పరవాలేదు… నేనొక హత్యచేశాను’ అని అదురూ బెదురూ లేకుండా మీడియా ముందే ఒప్పుకున్న ఘనుడు బ్రిజ్‌భూషన్‌ సింగ్‌. చట్టం చెవులు, కండ్లు, నోరు అన్నీ మూసుకుందేమో… అతని మీద ఇంతవరకు ఈగ కూడా వాల్లేదు. సరికదా, నేరచరిత నేతలకు పొర్లుదండాలు పెట్టే అతిగొప్ప ప్రజాస్వామ్యంలో బ్రిజ్‌భూషన్‌ పార్లమెంటు సభ్యుడు కాగలిగాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు ఏకంగా ఆరుసార్లు ఏంపీగా అధికారపక్షం బీజేపీ సభ్యుడిగా భారత ప్రజాస్వామ్యాలయాన్ని పావనం చేస్తున్నాడు. ఇది కాషాయ కమలం పార్టీ అవినీతి, నేరమయ పాలనకు నిలువుటద్దం.
‘మా అమ్మాయి మానసిక ప్రశాంతతకు పూర్తిగా దూరమైంది. తాను మళ్లీ మామూలు మనిషి కాలేదు. అతడి వేధింపులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి’ అని బ్రిజ్‌భూషన్‌పై ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఓ మైనర్‌ క్రీడాకారిణి తండ్రి వాపోయారు. పొట్ట, నాభి, ఛాతి భాగాల్లో చేతులు వేస్తూ, బట్టలు లాగుతూ, బలవంతంగా కౌగిలించుకుంటూ బ్రిజ్‌భూషన్‌ పరమఘోరంగా ప్రవర్తించేవాడని మరో ఆరుగురు మహిళా రెజ్లర్లు సాక్ష్యాలతో సహా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసమాన క్రీడానైపుణ్యాలతో త్రివర్ణ పతాకం గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఛాంపియన్లకు దక్కే ప్రతిఫలం ఇదా? సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదుకానంతగా బీజేపీ ఏలుబడి దేశంలో, ఆయా రాష్ట్రాల్లో సాగుతున్నది. తొమ్మిదేండ్ల మోడీ పాలన, యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, త్రిపుర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో సాగుతున్న వారి అనుచరగణం పరిపాలన మేడి పండును తలపిస్తున్నది. అవినీతి, నేరమయంగా మారింది. బీజేపీ నేతలతోపాటు ఆ ప్రభుత్వాలూ నేడు దేశ ప్రజాస్వామ్యానికి కళంకాన్ని తెచ్చిపెట్టాయి. ఆదర్శపాలనను అందిస్తామని ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టే కమలనాధుల చరిత, తాజా ఏడీఆర్‌, ఎన్‌ఈసీ, ఎన్‌సీఆర్‌బీ నివేదికలు బట్టబయలుచేశాయి. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో నినాదాన్ని భుజాని కెత్తుకోవడం బీజేపీకి వెన్నతోపెట్టిన విద్య. దేశంలో దాదాపు 4,001మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 1,777మంది అంటే 44శాతం నేరస్థులేనని ఏడీఆర్‌ రిపోర్టు పేర్కొనడం అవమానకరం. అందులో బీజేపీ ఎమ్మెల్యేలే 479మంది ఉండటం సిగ్గుచేటు. ఇంకేంకావాలి, వారి మసకబారిన అవినీతి, నేరమయ పాలనకు రుజువు.
నేరచరిత్ర ఉన్నవారిని చట్టసభల్లోకి పంపడం బీజేపీకే చెల్లింది. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రభుత్వాలూ నేరచరితకు ఆనవాళ్లుగా నిలిచాయిప్పుడు. చట్టాలను చట్టుబండలు చేశారు. కోర్టులను లెక్కచేయరు. హక్కుల కార్యకర్తలను అడ్రస్‌లేకుండా చేస్తారు. తమ అవినీతి, అక్రమాలను ప్రశ్నించే, బయటకుతీసే జర్నలిస్టులను జైల్లోపెడతారు. గెలుపుకోసం ఎంతకైనా దిగజారే బీజేపీ, నేడు దేశంలో ప్రజాస్వామ్యం మూలాలను దెబ్బతీసేపనిలో నిమగమైంది. యోగీ సర్కారు దాదాపు ఐదువేల హత్యలతో దేశంలో ప్రథమస్థానంలో ఉండగా, నేనేమీ తక్కువ కాదంటూ మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సర్కారు లైంగికదాడుల్లో అదేస్థానాన్ని సొంతం చేసుకున్నట్టు ఏడీఆర్‌ రిపోర్టు. కిడ్నాపులు, దళితులపై దాడుల్లోనూ ఉత్తరప్రదేశ్‌దే పైచేయి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే తరహాలో బీజేపీ, తమ రాష్ట్రాల్లో పరిపాలనను వెలగబెడుతున్నది. తీవ్రమైన క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న నేతలకూ టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఇందులో ఐదేండ్ల కంటే ఎక్కువకాలం శిక్షపడ్డవారే అధికంగా ఉన్నారంటే ఆశ్చర్యమేమీ కాదు. ఎలాంటి విచారణ లేకుండానే దాదాపు పదివేల మందిని అధికారికంగానే ఎన్‌కౌంటర్ల ద్వారా ఫినిష్‌ చేసి ఆటవికపాలనకు తెరతీశారు యోగి. గుజరాత్‌లో దాదాపు 40వేల మంది మహిళలు గల్లంతయ్యారనే ఎన్‌సీఆర్‌బీ రిపోర్టుకు సమాధానమేది? అలాగే బిల్కిస్‌బానో కేసు ఇంకా సమాజం మరిచిపోలేదు. మణిపూర్‌లో హింసకూ బీజేపీయే కారణం. ఆ రాష్ట్రంలో హింసను ఆపాలంటూ యూరోపియన్‌ యూనియన్‌ కోరడం గమనార్హం. మళ్లీ ఎన్నికలొస్తున్న వేళ, మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యూహారచనకు పూనుకుంది.
రాజ్యాంగానికి విలువనివ్వరు. న్యాయవ్యవస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. సీఆర్‌పీసీ, ఐపీసీ బుట్టదాఖలవుతున్నది. పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను కూల్చేయడం ఆ పార్టీ నయా ఫాసిస్ట్‌ సంస్కృతి. పాలకులే నేరస్థులైతే, ప్రజలకు రక్షణేది? ప్రజాస్వామ్యానికి మనుగడేది? ఎవరు అవునన్నా… కాదన్నా, బీజేపీ నేర రాజకీయ కబంధహస్తాల్లో భారతావని విలవిల్లాడుతున్న మాట వాస్తవం.

Spread the love