మొన్న ‘డార్విన్‌’… నేడు ‘డెమోక్రసీ’… రేపు…?

భారతదేశానికి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించిన జాతిపిత మహాత్మాగాంధీ చరిత్రను నిస్సిగ్గుగా తొలగించారు. ఆ స్థానంలో గాంధీని చంపిన గాడ్సే గురువైన సావర్కర్‌ పాఠాన్ని చేర్చారు. ఈ దుర్మార్గమైన చర్యను చాలామంది మేధావులు ఖండించారు. అయినా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత మొగలుల చరిత్రలను తొలగించారు. దీనిపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గకపోగా, దుశ్చర్యలు మరింత వేగంగా పుంజుకున్నాయని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి.
ఏ దేశమైనా నాశనం కావాలన్నా, వెనక్కిపోవాలన్నా ఆయుధాలు, బయోవెపన్లే ప్రయోగించనవసరం లేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తే చాలు! అప్పుడు అసమర్థ నాయకులు అధికార పీఠమెక్కి రాజ్యంలో అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాల విత్తనాలు వెదజల్లుతారు. పసి హృదయాల్లో విషభీజాలు నాటుతారు. ఇప్పుడు దేశంలో సరిగ్గా జరుగుతున్నది ఇదే…!
రాజ్యాంగంలోని 51ఏ(హెచ్‌) భారతదేశంలోని ప్రజల్లో మానవత్వం, శాస్త్రీయ వైఖరులు, ప్రశ్నించేతత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని నిర్దేశించింది. కానీ కేంద్రం ఆధ్వర్యంలోని జాతీయ విద్య పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) అనుసరిస్తున్న విధానాల వల్ల వాటికి నేడు అతిపెద్ద ముప్పు పరిణమించింది. పాఠ్యపుస్తకాల నుంచి అలాంటి పాఠ్యాంశాలను ఒక్కొక్కటిగా తొలగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని ఎత్తేశారు. అంతకుముందు ప్రముఖుల చరిత్రలకు కత్తిరెశారు. తాజాగా ప్రజాస్వామ్యం, అనువర్తన పట్టికను లేపేశారు. దేశానికి విద్యార్థులే భావిభారత పౌరులని చెప్పే పాలకులు వారికి శాస్త్రీయ విజ్ఞానం, చారిత్రక వాస్తవాలు అందకుండా చేయడం అసంబద్ధ చర్య కాకపోతే మరేంటి? ఈ అశాస్త్రీయ విధానాలపై విమర్శల జడివాన కురుస్తున్నా కేంద్రం ఉలకదు… పలకదు! చరిత్రను వక్రీకరించడం లేదంటే ఎత్తేయడం నిరాటంకంగా కొనసాగిస్తున్నది. ఎందు కింత దిగజారుడుతనం? ఎందుకింత ఉద్దేశపూర్వక చర్యలకు పూనుకోవడం? ఎందుకింత అజ్ఞానపు బాట లకు పునాదులు తవ్వడం? అనేది ఇప్పుడు చరించాల్సిన అవసరం ఉన్నది.
ఎన్‌సీఈఆర్‌టీ పదోతరగతి పుస్తకాల నుండి ప్రజాస్వామ్యం, ఆవర్తన పట్టిక, ఇంధన వనరులు అనే చాప్టర్లను తొలగించడం ఓ అవివేకమైన చర్య తప్ప వేరేకాదు! ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన పాఠ్యపుస్తకాల నుండి మరికొన్ని ఛాప్టర్లు కూడా అదృశ్యమయ్యాయి. పర్యావరణం, ఇంధన వనరులు వంటివి కూడా తొలగింపుల జాబితాలో ఉన్నాయి. తాజా రివిజన్‌ అనంతరం ‘ప్రజాస్వామ్యం-రాజకీయ పార్టీలకు సవాళు’్ల అనే ఛాప్టర్లను పూర్తిగా ఎత్తేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై భారం తగ్గించడం అవసరమైందన్నది ఎన్‌సీఈఆర్‌టీ వివరణ! పైగా ఈ ఛాప్టర్లు కష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటి అవసరం లేదనడం మరీ విడ్డూరం! పదో తరగతి సంవత్సరం ప్రారంభం లోనే డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ వందలాదిమంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు బహిరంగ లేఖలు రాసినా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదు. మానవ జీవన పరిణామాన్ని తెలిపేందుకు ఎన్నో పరిశీలనలు చేసి ‘ఇది మానవ చరిత్ర’ అని చెప్పిన సిద్ధాంతాన్ని కూడా తొలగిస్తే ఇంకేముంటుంది విద్యాబోధనలో? విజ్ఞాన విషయాలను అభ్యసించి చర్చోపచర్చోల ద్వారా ఒక అభిప్రాయాన్ని లేవనెత్తి తద్వారా సమాజానికి ఉపయోగపడేలా తన వంతు పాత్రను పోషించేది పుస్తకాలే. అలాంటి వాటి నుంచి చరిత్రను, శాస్త్రీయతను చెరిపేసే విధానాలను యథేచ్ఛగా అమలు చేస్తున్నది మోడీ ప్రభుత్వం.
భారతదేశానికి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించిన జాతిపిత మహాత్మాగాంధీ చరిత్రను నిస్సిగ్గుగా తొలగించారు. ఆ స్థానంలో గాంధీని చంపిన గాడ్సే గురువైన సావర్కర్‌ పాఠాన్ని చేర్చారు. ఈ దుర్మార్గమైన చర్యను చాలామంది మేధావులు ఖండించారు. అయినా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత మొగలుల చరిత్రలను తొలగించారు. దీనిపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గకపోగా, దుశ్చర్యలు మరింత వేగంగా పుంజుకున్నాయని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇదేకాదు ‘సారే జహాసే అచ్చా.. హిందుస్తాన్‌ హమారా’… అనే ప్రఖ్యాత గీతాన్ని రచించిన ఇక్బాల్‌ గురించిన పాఠ్యాంశాన్ని కూడా పొలిటికల్‌ సైన్స్‌ సిలబస్‌ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ అకాడమిక్‌ కౌన్సిల్‌ తొలగించాలని నిర్ణయించింది. ఇది ఇలాగే కొనసాగితే సమస్త భారతీయ చరిత్రను చెరిపేసి విద్యారంగాన్ని అసత్యాలు, అశాస్త్రీయ భావాలు, అంధ విశ్వాసాలమయం చేయడం ఖాయం. ఇలాంటి అనైతిక చర్యలు భవిష్యత్తు తరానికే కాదు ఈ దేశ ప్రగతికే ఆటంకం. దీన్ని అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. అవసరమైన ఉద్యమానికి కదలిరావాలి.

 

Spread the love