మేము ఓటు వేయము… వెలసిన ప్లెక్సీలు

– సమస్యలు తీర్చకుంటే ఓటు వేసేది లేదుంటున్న గిరిజనులు
నవతెలంగాణ-కొత్తగూడెం
మా సమస్యలు పరిష్కరించని ప్రభుత్వాలకు మేమెందుకు ఓటు వేయాలి….? అని ఏజెన్సీ గిరిజనులు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మేము పాల్గొనమని, పవిత్రమైన మా ఓటు వేయమని స్పష్టం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, గరిమెలపాడు చెందిన గిరిజనులు తమ ఓటు హక్కు వినియోగించుకోమని, మేము ఓటు వేయమని స్పష్టం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గరిమెళ్ళ పాడు ప్రజల సమస్యలు తెలుసుకుందామని ప్రయత్నం చేసింది. కానీ గత ప్రభుత్వాలు అన్యాయం చేశాయని…. ఎన్నిసార్లు విన్నవించుకున్నా పరిష్కారం చేయలేదని గిరిజనులు వాపోతున్నారు. వారు నివాసం ఉండడానికి కనీసం ఇంటి స్థలం కూడా కేటాయించని ప్రభుత్వాలకు మేమెందుకు ఓటు వేయాలని వారు మండిపడుతున్నారు. గత ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాయని, పరిష్కరించకుండానే నిర్లక్ష్యం చేశాయని ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాలో… ఏజెన్సీ మండలంలో… ఏజెన్సీ వాసులమైన మమ్మల్ని అధికారులు ప్రతిసారి మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు అన్యాయం చేస్తున్నారని గరిమెళ్ళ పాడు ఆదివాసి గిరిజనులు ఈసారి ఓటు వేయమంటూ నిరసన బాట పట్టారు. గరిమెలపాడులో ఐటీడీఏ ఏర్పాటు చేసిన నర్సరీ భూములు ఆదివాసి గిరిజనలు నుండే తీసుకున్నారని, ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాల్సిన పరిహారాలు నేటికీ చెల్లించకపోవడం, వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఉపాధి ఇవ్వడం లేదని అంటున్నారు. కనీసం నివాసాలు ఉండడానికి కూడా ఏజెన్సీ భూముల్లో గుడిసెలు వేసుకుంటే పీకి వేస్తున్నారని, భూమి హక్కులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం, అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెళ్ళపాడు ఆదివాసి గ్రామాన్ని గురువారం సందర్శించనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఇదే విధంగా ఓటు వేయమని నిరసన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆనాటి జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వాపోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు గరిమెళ్ళ పాడు ఆదివాసి గిరిజనుల మొరపెట్టుకున్న పరిష్కారం లేకుండా పోయిందని అంటున్నారు. ఐదేళ్ల తర్వాత మరోసారి సమస్యల పరిష్కారం కోసం ఓటును బహిష్కరించి నిరసన బాట పట్టిన గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని మేధావులు, ప్రజలు, పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Spread the love