మహిళా జర్నలిస్టు అయిన తులసి చందుకు వచ్చిన బెదిరింపులనుచూడాలి. తప్పుడు వార్తల యుగంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చినగౌరీ లంకేష్‌ను మనం కాపాడుకోలేకపోయాం. ‘వీ స్టాండ్ విత్‌తులసిచందు’ అని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యవాదులు,అభ్యుదయశక్తులు అండగా నిలుస్తున్నాయి. అయితే ఈ సోషల్‌మీడియా స్టేటస్‌ల వరకే కాకుండా… ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులపరిరక్షణకు జరిపే పోరాటంలో పౌరసమాజమంతా భాగం కావాలి.ఆమెపై భౌతికదాడులు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతపౌరులదైతే… ఆమెకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.
‘ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని శ్రీశ్రీ చెప్పినట్టు… ఈ ఆధునిక సమాజంలో కూడా బలహీనులపై, ప్రశ్నించే వారిపై ఎటుచూసినా పీడనలు, బంధనాలు, నిర్బంధాలు, చెరసాలలే… వారిపై దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రలు వేసి, బెయిల్ కూడా రాని ‘ఊపా’, ‘దేశ ద్రోహం’ లాంటి కఠిన చట్టాల ద్వారా నిర్బంధించటం చూస్తున్నాం. ఈ నిర్బంధాలను అమలు తీరును చూస్తే ప్రశ్నించే వారికి ఈ ప్రభుత్వాలు ఎంత భయపడుతాయో అర్థం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను తనదైన విశ్లేషణలతో ఎండగడుతున్న స్వతంత్ర జర్నలిస్టు తులసి చందును కూడా ఈ పాలకులు సహించలేకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని తన గొంతు విప్పుతున్న ఆమెను చంపేస్తామంటూ హిందూత్వశక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. పత్రికల్లో రాయలేని భాషతో ఆమెను ట్రోల్ చేయటం అత్యంత దారుణమైన విషయం.
పాలకుల విధానాలపై ప్రశ్నలు లేవనెత్తడం, తప్పిదాలను ఎండగట్టడం, భిన్నాభిప్రాయాలకు చోటివ్వడం మీడియా కీలకమైన బాధ్యత. కానీ, పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర మీడియా పనితీరు రెండూ నేడు తీవ్రమైన దాడులకు గురవుతున్నాయి. అధికారంలో ఉన్నవారికి నచ్చని వార్తా కథనాలు రాసే జర్నలిస్టులు, సంపాదకులపై దేశద్రోహం కేసులు కూడా మోపుతున్నారు. అంతకంటే దారుణమైన అంశం ఏమిటంటే, జర్నలిస్టులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) వంటి నిరంకుశ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సిద్దిఖి కప్పన్, శ్రీనగర్‌లో ఫహద్ షాలు ఇందుకు ఉదాహరణలు. విదేశాల్లో మన మహిళా ఫొటో జర్నలిస్టుకు అవార్డు వస్తే ఆమె ముస్లిం అనే కారణంలో అక్రమకేసులు పెట్టి ఆమె వెళ్లకుండా నిర్భందించిన ఘటనలు కూడా ఈ దేశానికి తప్పడం లేదు.
మతోన్మాద ముఠాలు మీడియా సిబ్బందిపై భౌతిక దాడులకు తెగబడుతుంటే, ప్రభుత్వం ఐటీ, ఈడీలను ఊసికొల్పుతూ వేధిస్తోంది. ఇవన్నీ కూడా మీడియా గొంతు నులిమివేసే దారుణమైన చర్యలే. నేడు మీడియాలో మెజారిటీ భాగం బడా కార్పొరేట్ సంస్థలు లేదా వ్యాపార సంస్థల అధీనంలోనే ఉంది. వీటిలో కొన్ని చాలా దూకుడుగా హిందూత్వకు వంతపాడుతున్నాయి. ప్రధాన స్రవంతిలోని మీడియాలో ఈ ప్రధానమైన మార్పు కార్పొరేట్-హిందూత్వ సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో మీడియా పోషించాల్సిన పాత్రను ఇది అపహాస్యం చేయడమే. సక్రమంగా, నిష్పక్షపాతంగా రిపోర్టింగ్ జరపాలనుకునే జర్నలిస్టులు, సంపాదక స్వేచ్ఛను పాటించే మీడియా ప్రభుత్వాన్ని వ్యతరేకిస్తూ కథనాలు ప్రసారం చేసినా, ప్రచురించినా ఈ ప్రమాదకర మతోన్మాద పర్యవేక్షకులు బుల్డోజర్లతో ఇండ్ల కూల్చివేత వ్యవహారాన్ని ప్రేరేపించడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఒకవైపు ప్రభుత్వ దాడులను చట్టప్రకారం ఎదుర్కోవడం ఒక ఎత్తయితే… పాలకుల భజనపరులు చేసే దాడులు మరో ఎత్తు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టులను లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కొన్ని కేసుల్లో కోర్టులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ఉపాను ఉపయోగించడం వంటి చర్యల ద్వారా జర్నలిస్టులను వేధించడానికి చట్టాలను దారుణంగా దుర్వినియోగం చేయడాన్ని నిలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంపై, ప్రజాస్వామ్య హక్కులపై నిరంకుశత్వం జరిపే విస్తృత దాడిలో భాగంగానే తెలంగాణలో మహిళా జర్నలిస్టు అయిన తులసి చందుకు వచ్చిన బెదిరింపులను చూడాలి. తప్పుడు వార్తల యుగంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన గౌరీ లంకేష్‌ను మనం కాపాడుకోలేకపోయాం. ‘వీ స్టాండ్ విత్ తులసిచంద’్ అని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయశక్తులు అండగా నిలుస్తున్నాయి. అయితే ఈ సోషల్ మీడియా స్టేటస్‌ల వరకే కాకుండా… ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు జరిపే పోరాటంలో పౌరసమాజమంతా భాగం కావాలి. ఆమెపై భౌతికదాడులు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులదైతే… ఆమెకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.