నెలల తరబడి బఖుమత్ అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రైవేటు రష్యా సాయుధ దళాలు జరిపిన దాడులతో మే 21న పట్టణం స్వాధీనమైంది. తరువాత పుతిన్ సేనలకు దాన్ని అప్పగించారు. తొలుత ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీ బుకాయించినప్పటికీ తొమ్మిది రోజుల తరువాత ఉక్రెయిన్ మిలిటరీ అంగీకరించింది. పశ్చిమ దేశాలు పుతిన్ సేనలను ఎదుర్కొనే ఎత్తుగడలను మార్చినట్లు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే మాస్కో కూడా వ్యవహరిస్తోంది.ఏ క్షణమైనా పరిస్థితి మరింతగా దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి.
పశ్చిమ దేశాల కుట్రలో పావుగా మారిన ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య గురువారం నాటికి 463వ రోజులో ప్రవేశించింది. జెలెన్‌స్కీ సేనల వద్ద పాత అస్త్రాలు ఇంకేమాత్రం లేవు. ఊఇప్పుడు అమెరికా, నాటో కూటమి దేశాలు అందించిన ఆధునిక అస్త్రాలు, వాటిని ఉపయోగించేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ మిలిటరీ, దానితో పాటు దాడులకు సిద్దం అవుతున్న కిరాయి మూకలు ఎదురుదాడులకు అనువైన తరుణం కోసం ఎదురు చూస్తున్నట్లు వార్తలు. దానికి ముందుగా గత కొద్ది రోజులుగా మాస్కో నగరం మీద, సరిహద్దులోని రష్యా ప్రాంతాల మీద ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులను చూస్తే రెండు దేశాల మధ్య ప్రారంభమైన పోరు కొత్త మలుపు తిరుగుతోందనటానికి సూచికగా పరిగణిస్తున్నారు. తమ భూ భాగాన్ని రక్షించుకొనేందుకు ఆత్మ రక్షణ దాడులు జరుపుతున్నట్లు చెబుతున్న ఉక్రెయిన్ ఇప్పుడు పశ్చిమ దేశాల కుట్రలో భాగంగా ఏకంగా రష్యా మీదకు కాలుదువ్వుతోంది. నిజానికి అక్కడ జరుగుతున్నది పశ్చిమ దేశాల పరోక్ష యుద్ధం అన్నది తెలిసిందే. దాని కొనసాగింపుగా నేరుగా మంగళవారం మాస్కో నగరం, బుధవారంనాడు రష్యాలోని కొన్ని ప్రాంతాల్లోని, నివాసాలు, ఒక చమురు శుద్ధి కర్మాగారం మీద డ్రోన్ల దాడి జరిపారు. కొన్ని భవనాలు దెబ్బతినటం, ఒకరి మృతి, కొందరు గాయపడటం తప్ప పెద్దగా నష్టమేమీ జరగనప్పటికీ సంక్షోభాన్ని మరో మలుపు తిప్పేందుకు చూస్తున్నారన్నది స్పష్టం. పుతిన్ సేనలు ఉఉకెయిన్ మీద క్షిపణి దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి.
తాజా దాడులు ఉగ్రవాద చర్య అనీ దీని వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా విమర్శించింది. ఈ దాడులతో తమకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని, వాటిని చూస్తూ తాము సంతోషిస్తున్నామని ఉక్రెయిన్ ప్రకటించటాన్ని బట్టి ఉగ్రదాడులన్నది స్పష్టం. మాస్కో నగరం, ఇతర ప్రాంతాల మీద జరిగిన డ్రోన్ దాడుల గురించి తమకు స్పష్టత లేదని, ఏదో జరిగిందన్న సమాచారం తప్ప నిర్దిష్టంగా ఏమీ చెప్పలేమని, సమాచారాన్ని సేకరిస్తున్నామని అమెరికా భద్రతా మండలి ప్రతినిధి కిర్బీ చెప్పటం తప్పించుకొనే మాట తప్ప మరొకటి కాదు. పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా గానీ రష్యా భూ భాగాల మీద దాడులను తమ ప్రభుత్వం సమర్థించదని అన్నాడు. అమెరికా ఏమి చెప్పుకున్నప్పటికీ దాని మోసకారితనం దాస్తే దాగేది కాదు. మే మూడవ తేదీన క్రెమ్లిన్ మీద జరిపిన డ్రోన్ దాడిలో ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు లేదా మిలిటరీ గూఢచారుల హస్తం ఉందని అమెరికా అధికార వర్గాలు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది. అదే విధంగా క్రిమియా వంతెన పేల్చివేత తమ పనేనని తొమ్మిది నెలల తరువాత ఉక్రెయిన్ మే 27న అంగీకరించింది. ఇవేవీ అమెరికా లేదా నాటో హస్తం లేకుండా జరిగేవి కాదు.
అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆధునిక అస్త్రాలను కూడా అడ్డుకోగల సత్తా ఉన్న రష్యా ఏకంగా తన రాజధాని మీదకు వదిలిన డ్రోన్లను ఎలా అడ్డుకోలేకపోయిందన్న ప్రశ్న తలెత్తింది. తమ రక్షణ వ్యవస్థలు మామూలుగానే పని చేశాయని, ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉందని అధ్యక్షుడు పుతిన్ చెప్పాడు. ఖండాంతర క్షిపణుల వంటి భారీ దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయని, తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చే డ్రోన్లకు సంబంధించి ఉన్న లోపాన్ని సరిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. బెల్‌గోరోడ్ ప్రాంతం మీద డ్రోన్ల దాడి జరిపింది తామేనని ఫ్రీడమ్ ఫర్ రష్యా లెజియన్ అనే సంస్థ చెప్పుకుంది. వీరు ఉక్రెయిన్ మీద జరుపుతున్న దాడులను ప్రతిఘటిస్త్నున్న అక్కడి రష్యన్ తెగవారని చెబుతున్నారు. రష్యా మీద రష్యన్లే తిరగబడుతున్నారన్న పశ్చిమ దేశాల ప్రచారదాడిలో భాగంగా ఇలాంటి ప్రకటనలు కూడా వెలువడవచ్చు. నెలల తరబడి బఖుమత్ అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రైవేటు రష్యా సాయుధ దళాలు జరిపిన దాడులతో మే 21న ఆ పట్టణం స్వాధీనమైంది. తరువాత పుతిన్ సేనలకు దాన్ని అప్పగించారు. తొలుత ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీ బుకాయించినప్పటికీ తొమ్మిది రోజుల తరువాత ఉక్రెయిన్ మిలిటరీ అంగీకరించింది. పశ్చిమ దేశాలు పుతిన్ సేనలను ఎదుర్కొనే ఎత్తుగడలను మార్చినట్లు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే మాస్కో కూడా వ్యవహరిస్తోంది. ఏ క్షణమైనా పరిస్థితి మరింతగా దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి పశ్చిమ దేశాలదే బాధ్యత అవుతుంది.