‘అధికారం’ వైపే..!

– ఖమ్మం, మానుకోట లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు
– రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీదే గెలుపు
– గత ఎన్నికల ఫలితాల్లో ఇదే నిరూపితం
– ఏడేసి అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఈ రెండుచోట్లా అందరూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే..!
ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో గత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించాయి. ఈ దఫా కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌, దాని మద్దతుదారులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్లలో ఒకటి, రెండు సందర్భాలు మినహా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఈసారి ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. కొత్తగూడెంలో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ విజయం సాధించింది. అది కూడా లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌నే బలపరుస్తుండటంతో అన్ని అసెంబ్లీ స్థానాలూ ‘చేతి’లో ఉన్నట్టే..!. ఇక ఎస్టీ రిజర్వుడైన మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోనూ ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో నర్సంపేట మినహా మిగిలిన అన్నీ ఎస్టీ నియోజకవర్గాలే కావడం గమనార్హం. వీటిలో భద్రాచలం మినహా ములుగు, నర్సంపేట (జనరల్‌), మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కాబట్టి ఉన్న అన్ని స్థానాలూ కాంగ్రెస్సేవేనని చెప్పవచ్చు.
కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కంచుకోట ఖమ్మం…
తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో 17వదిగా ఉన్న ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం 16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. దీనిలో పదిసార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. మూడుసార్లు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుత సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 1996లో ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 1984, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. 2009లో తెలుగుదేశం నుంచి గెలిచిన ప్రస్తుత ఎంపీ నామ నాగేశ్వరావు 2019లో బీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున 2014లో గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు, రంగయ్య నాయుడు, రేణుకాచౌదరి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నుంచి క్రితంసారి ఎన్నికల్లో 49.78% ఓట్లతో నామ నాగేశ్వరరావు గెలిచారు. నామకు 5,67,459 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి రేణుకాచౌదరి 3,99,397 (35.04%) ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరఫున పోటీలో ఉన్న బోడా వెంకట్‌ 57,102 ఓట్లు సాధించారు. ఓవైపు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్‌ ఉండటం, మరోవైపు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి 2.80 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ గెలుపొందటం, సీపీఐ(ఎం), సీపీఐలు కూడా కాంగ్రెస్‌ను బలపరుస్తుండటంతో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డికి సానుకూలాంశాలుగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న నామ నాగేశ్వరరావు నుంచి ఈయనకు పోటీ ఎదురుకానుంది. గత ఎన్నికల్లో 20,488 ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి కూడా ఆ ఓట్లు సాధిస్తే చాలనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
అధికార పార్టీలకు పెట్టని కోట మానుకోట..
ఎస్టీ రిజర్వుడైన మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోనూ అధికార పార్టీలే హవా సాగిస్తున్నాయి. ఈ నియోజకవర్గం 1957 నుంచి 1967 వరకు కొనసాగింది. ఆ తర్వాత రద్దయింది. 2008లో తిరిగి ఏర్పాటు కాగా 2009లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 3,94, 447 (39.59%) ఓట్లతో ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాసరావు 3,25, 490 (32.67%)పై విజయం సాధించారు. ఆ తర్వాత ఏర్పాటైన యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్రమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ (3,20,569) చేతిలో బలరాంనాయక్‌ (2,85,577) ఓటమి పాలయ్యారు. నాటి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు 30శాతానికి పైగా ఓట్లు సాధించడం గమనార్హం. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికార మార్పిడి జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టింది. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ మాలోత్‌ కవిత 4,62,109 (46.98%) ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ (3,15,446)పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ 25,487 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో గత ఎలక్షన్స్‌లో పోటీ చేసిన పాతకాపులే బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 15,32,366 ఓట్లు ఉండగా 7,47,836 మంది పురుషులు, 7,84,424 మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 6,85,897 ఓట్లు రాగా బీఆర్‌ఎస్‌కు 4,43,910 ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 34,431 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. నియోజకవర్గం పరిధిలోని భద్రాచలం మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులే భారీ మెజార్టీలతో గెలుపొందారు. భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ నుంచి నెగ్గిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇలా మొత్తం ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఖమ్మం, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో మొత్తం కూడా కాంగ్రెస్‌ ‘చేతి’లోనే ఉండటంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి సానుకూలంశంగా విశ్లేషకుల అంచనా.

Spread the love