దేశంలో రాజ్‌భవన్‌లు వివాదాలకూ, విపరీతాలకూ ‘కేంద్ర’ బిందువులవుతున్నాయి. రాజ్యాంగ నియమాలు, ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కి కేవలం ఏలినవారి మనసెరిగి మసులుకోవడమొక్కటే తమ ఏకైక విధిగా వ్యవహరిస్తోన్న గవర్నర్‌ల తీరు జుగుప్స పుట్టిస్తోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ‘మా గవర్నర్ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అలాంటి గవర్నర్ మాకొద్దు’ అని రాష్ట్రపతికే ఫిర్యాదు చేయాల్సి రావడం విషాదం. మరోవైపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ‘రాజకీయ పార్టీల నాయకులకు ఉన్నట్టే రాజకీయాలపై మాట్లాడే హక్కు గవర్నర్లకు కూడా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ అంశం కూడా మళ్లీ తమిళనాడు చుట్టూ అల్లుకున్నదే. ‘గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించకుండా ఉండాలి’ అన్న ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై వ్యాఖ్యల నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అయిన తమిళిసై తన వైఖరి స్పష్టం చేశారు. అన్నామలై తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై తమిళిసై ఘాటుగా స్పందించారు.
కనీసం ముఖ్యమంత్రికి సమాచారమైనా లేకుండా ఆయన మంత్రివర్గ సభ్యుడిని గవర్నర్ బర్తరఫ్ చేయడం…అంతలోనే ఆ ఉత్తర్వులను నిలిపివేయడం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచేత ఎన్నికైన ఏ ప్రభుత్వానికైనా ఆగ్రహం తెప్పించే అంశమే. తమిళనాడు గవర్నర్ అనుసరించిన ఈ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని చెప్పడానికి రాజకీయ పండితులు కావలసిన అవసరం లేదు. స్టాలిన్ మంత్రివర్గ సహచరుడు తప్పు చేసి ఉంటే ఉండవచ్చు. ఆయన మీద ఎన్ని ఆరోపణలైనా ఉండొచ్చు. ఒక మంత్రి మీద తనకు విశ్వాసం లేదని గవర్నర్ భావించినట్టయితే ఆ విషయం ముఖ్యమంత్రికి తెలియజేసి, ఆయన సలహా మేరకు నడుచుకోవాలే కానీ, ఇష్టారీతిగా వ్యవహరించకూడదు. ఇవేవీ గవర్నర్ రవికి పట్టిన దాఖలాలు లేవు. గవర్నర్ రాజ్యాంగ సూత్రాలకు, చట్టాలకు, నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందే కానీ, ఏకపక్ష, విపరీత చర్యలు రాజ్యాంగ సమ్మతమూ కావు. అంతే కాదు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను కూడా ఏకరవు పెడుతూ సీఎం స్టాలిన్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
గవర్నర్ల చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల పతనానికి కారణమైతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనని సుప్రీంకోర్టు గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పతనానికి దారితీసే విధంగా గవర్నర్ చర్యలు ఉండటానికి ఎంతమాత్రం వీల్లేదని స్పష్టం చేసింది. ఇది మన ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైన అంశమని (వెరీ వెరీ సీరియస్), దాని ప్రాధాన్యాన్ని అత్యున్నత న్యాయస్థానం నొక్కి మరి చెప్పింది. అయినా, ఈ గవర్నర్లకు అవేమి పట్టడం లేదు. గవర్నర్లు బిల్లులపై సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ ప్రభుత్వాలు గతంలో ఆందోళన వ్యక్తం చేశాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ‘రాజ్యాంగ ప్రతిష్టంభన సష్టిస్తున్నారని’ పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించవలసి కూడా వచ్చింది. చివరకు న్యాయస్థానం జోక్యంతోనే ఆమె బిల్లులకు ఆమోదం తెలిపారు.
బీజేపీయేతర ప్రభుత్వాలున్న ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్ల తీరు ఇలాగే ఉంటోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి కాషాయపార్టీ ఆధిపత్య ధోరణితో రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నిధులను నిరాకరిస్తోంది. రాష్ట్ర పరిధిలోని అంశాల్లోకి దొడ్డిదారిన చొరబడి హక్కులను కాలరాస్తోంది. బలమైన రాష్ట్రాలతోనే బలమైన కేంద్రం రూపుదిద్దుకుంటుందన్న సహజ సూత్రానికి సైతం తిలోదకాలిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను వివిధ రూపాల్లో వేపుకుతింటోంది. వినాశకరమైన ఈ విధానాలను ప్రతిఘటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై అక్కడి గవర్నర్ల ద్వారా నిత్యం ఘర్షణలు రాజేస్తూ ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ ఖూనీ చేస్తోంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నవారిదే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు ఇటీవలే తేల్చి చెప్పింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలను ఏమాత్రం లెక్కచేయకుండా, కనీసం పరిగణలోకి కూడా తీసుకోకుండా రాజ్‌భవన్ పాలనాధీశులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడమంటే ప్రజాస్వా మ్యాన్ని నిలువునా పాతరేయడమే. బీజేపీయేతర ప్రభుత్వాలున్న ప్రతిరాష్ట్రంలోనూ గవర్నర్లు అక్కడి ప్రజాప్రభుత్వాలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఆర్‌ఎన్ రవి ఆ రాజ్యాంగబద్ధ పదవికి అనర్హుడని, ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలన్న స్టాలిన్ లేఖపై రాష్ట్రపతి స్పందన ఎలా ఉండనుందో వేచి చూడాలి. కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారకుండా గవర్నర్ల వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.