ఒడిశా విషాదం

ఎందుకిలా జరిగింది? ఎవరు దీనికి కారకులు? మానవతప్పిదమా? సాంకేతిక లోపమా? వ్యవస్థాగత వైఫల్యమా, యాదృచ్ఛికమా ద‌ర్యాప్తు అనంతరం ఏదో ఒక కారణాన్ని లేదా కారణాలను బయటపెట్టవచ్చు. మన రైల్వే వ్యవస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. చాలా నిబద్ధంగా పనిచేసే శ్రామికులూ, పటిష్టమైన జాగ్రత్తలూ,విధి విధానాలు ఉంటాయి. మరి గూడ్స్‌ ఆగివున్న ట్రాక్‌పైకి మరో రైలు ఎలా వచ్చింది!ఎందుకు వచ్చింది. ఇది తేలవలసి ఉన్నది.
మృత్యు ప్రయాణం… వందలాది ప్రాణాలను కబళించిన దుర్ఘటన. హాహాకారాలు, ఆర్తనాదాలు, క్షతగాత్రుల రక్తఘోషలతో ఎరుపెక్కిన ఆవరణం. క్షణాలలోనే యుద్ధకేత్రంలా బీభత్సదృశ్యం. గమ్యస్థానాలు గాలికెగిరిపోయి, ముగింపు గీతాన్ని రచించింది. ఒడిశాలో జరిగిన ఘోర కోరమండల్‌ రైలు ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచింది. రక్తసిక్తమైన ఆ ప్రదేశమంతా మృత్యువు విలయతాండవం చేసింది. ఒకే చోట మూడు రైళ్ళు ప్రమాదానికి లోనయిన అతి పెద్ద ఘటన ఇది. ఇప్పటికే 278మంది ప్రయాణీకులు మృతిచెందారని అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశముందనీ చెబుతున్నారు. దాదాపు వేయిమందికి పైగా తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. మూడోతేదీ సాయంత్రం పశ్చిమబెంగాల్‌ షాలిమార్‌ నుంచి చెన్నరు సెంట్రల్‌కు ప్రయాణిస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిషాలోని బాలాసోర్‌లో బహానాగ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢకొీట్టింది. పక్కనే ఉన్న ట్రాక్‌పై కోచ్‌లు పడిపోగా, అటుగా వచ్చిన బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్‌ పడివున్న కోచ్‌లను ఢకొీట్టింది. ఐదారు బోగీలు చెల్లాచెదురైపోవటంతో పెనుప్రమాదం సంభవించింది.
దాదాపు 120మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న రైలు ఢకొీడితే ఎంత బీభత్సంగా మారుతుంది! తమిళనాడు, బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, కర్నాటక ప్రజలు ప్రయాణికుల్లో ఉన్నారు. తెలుగు ప్రాంతాల ప్రజలే మృతుల్లో ఎక్కువ మంది ఉంటారని అంటున్నారు. తమిళనాడుకు చెందిన 38మంది మరణించారని ప్రకటించారు. ప్రమాదం జరగగానే స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించి, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. రక్తదానం చేయటానికి వందలాది మంది జనం ముందుకు రావటం చూస్తుంటే మానవీయాంశ ప్రజల్లో ఘననీయంగా ఉందని రుజువవుతుంది. రైల్వే సిబ్బంది, విమానయాన సిబ్బంది, పోలీసులు ప్రయాణీకుల రక్షణ చర్యల్లో ముమ్మరంగానే పాల్గొంటున్నారు. పోయిన ప్రాణాలను చూస్తుంటే దుఃఖం నిండుతుంది. కుప్పలుగా శవాలు, కాళ్ళూ, చేతులు విరిగి రక్తప్రవాహాలతో తడిచిన ఆ ప్రదేశం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. కలచివేస్తోంది. ఎన్ని లక్షల ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించినా తన వాళ్లను కోల్పోయిన దుఃఖాన్ని ఆపలేదు.
ఎందుకిలా జరిగింది? ఎవరు దీనికి కారకులు? మానవతప్పిదమా? సాంకేతిక లోపమా? వ్యవస్థాగత వైఫల్యమా, యాదృచ్ఛికమా దర్యాప్తు అనంతరం ఏదో ఒక కారణాన్ని లేదా కారణాలను బయటపెట్టవచ్చు. మన రైల్వే వ్యవస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. చాలా నిబద్ధంగా పనిచేసే శ్రామికులూ, పటిష్టమైన జాగ్రత్తలూ, విధి విధానాలు ఉంటాయి. మరి గూడ్స్‌ ఆగివున్న ట్రాక్‌పైకి మరో రైలు ఎలా వచ్చింది! ఎందుకు వచ్చింది. ఇది తేలవలసి ఉన్నది. ఏదో సమన్వయం లోపం విభాగాల మధ్య ఉన్నట్టు తోస్తున్నది. బహనాగ్‌ రైల్వేస్టేషన్‌లో సిగలింగ్‌లో వైఫల్యం జరిగింది. నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి రైల్వే సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిందని తెలుస్తున్నది. మనం రైలు వేగాల గురించి, అధిక రైళ్ల గురించి మాట్లాడుతుంటాం. కానీ అందుకు కావలసిన ఏర్పాట్లను సరిచేసుకోము. ఏదైనా లోపాలుంటే ఏదో సరిచేసి తిరిగి పంపిస్తారు తప్ప కొత్తకోచ్‌లు సిద్ధంగా ఉండవు. కోచ్‌లు, ఇంజిన్‌ల లోపాలను సరిచేయగలిగే 2000మంది సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు. మొత్తం 2,80,000మంది సిబ్బంది ఖాళీలున్నాయి. రైళ్ళు పెంచుతున్నారు. కానీ ప్రతి సంవత్సరం రెండు శాతం చొప్పున ఉద్యోగులను తప్పిస్తున్నారు. బుల్లెట్‌ ట్రెయిన్‌, వందేభారత్‌ రైళ్ళు, సూపర్‌ స్పీడుపై మోజు పెంచుతారు కానీ, సేఫ్టీ విభాగంలో ఉండాల్సిన ఉద్యోగులు మాత్రం కొరతలోనే. లోకోపైలట్స్‌ సిబ్బంది కొరతా ఉంది. ఇకపోతే ప్రధానంగా ప్రతి విభాగాన్నీ ప్రయివేటుకు కాంట్రాక్టుకు కట్టబెట్టేశారు. కాంట్రాక్టుకు తీసుకున్న వాడు పదిమంది చేయాల్సిన చోట ఇద్దరు, ముగ్గురితో పనిచేయిస్తున్నాడు. సిగలింగ్‌ వ్యవస్థనూ కాంట్రాక్టుకు ఇచ్చేశారు. గతంలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న గాంగ్‌మెన్‌లు, ట్రాక్‌మెన్‌లు, కిందితరగతి ఉద్యోగులు అంకితభావంతో శ్రద్ధగా అప్రమత్తంగా ఉండి పనులు చేసేవారు. ఇప్పుడు కాంట్రాక్టు కార్మికులకు అంతటి బాధ్యత ఎక్కడుంటుంది! ప్రపంచ రైల్వే సిస్టంతో మన రైల్వేలను పోల్చుకోవద్దు. మన భౌగోళిక పరిస్థితులు వేరు, మన జనాభావేరు. దీనికి తగిన విధమైన స్పీడును, ప్రయాణ విస్తరణను చేపట్టవల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
కాబట్టి ప్రారంభించిన రైలునే పదిసార్లు ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలను పొందటమే ధ్యేయంగా పనిచేస్తున్న పాలకులు, సామాన్యులు ప్రయాణించే రైళ్ల బాగోగులను పట్టించుకోవాలి. ప్రయివేటీకరణే అన్నింటికీ పరిష్కారం అనే మానసిక స్థితి నుండి బయటపడి వాస్తవాలను ఆలోచించాలి. ప్రజల భద్రతకు ఏం చేయాలో తెలుసుకుని ఇప్పటికైనా పూనుకోవాలి. జరిగిన దుర్ఘటనకు పాలకులు బాధ్యత వహించాలి. దుఃఖితులకు ఓదార్పు నివ్వాలి.

Spread the love