‘మందస్తు’ ఎన్నికలు…

సార్‌ కొంప మునిగిపోయింది, పరిగెత్తుకుంటూ వచ్చాడు సబ్‌ ఎడిటర్‌. ఏమైందయ్యా, అడిగాడు ప్రధాన సంపాదకుడు ఇప్పటినుండి ప్ర.స
పలురాష్ట్రాల్లో మందస్తు ఎన్నికలు అన్న హెడ్డింగుతో మన పేపర్లో న్యూస్‌ వచ్చింది సార్‌. అది నేనే చూశాను. ముందస్తు అని కరెక్టుగానే కొట్టాను. మందస్తు అని వచ్చింది.
అంత కంగారు పడకయ్యా.
ఎలా సార్‌, మన పేపరుకే కదా చెడ్డపేరు అలాంటిదేమీ లేదు కాని మార్పించింది నేనే
మీరా?…!
అవును నేనే, ఎలాగూ మందు లేనిది ఎన్నికలంటూ ఉండవు. ఆ మత్తులోనే జనాలు ఓటేస్తారు. అందుకని మందస్తు అని మార్పించాను. అదీ కాక ఒక్క రాష్ట్రంలో కాదు కదా, అందరినీ అన్నా, మన్నల్ని కాదులే ఇంకో రాష్ట్రం వాళ్ళపై రాశారని అందరూ అనుకుంటారు. నెహ్రూగారి పేరు ఇప్పుడు ఎక్కువ వాడకుండా ఉన్నారు కాని ఆయన ఈ సభలో సగం మంది మూరు?లు అంటే అందరూ కోప్పడ్డారు, వెంటనే ఈ సభలో సగం మంది తెలివైనవాళ్ళు అనగానే అందరూ చల్లబడ్డారు. అలా నేర్పుగా ఉండాలి మనం.
ప్ర.స మాటలతో మాటలేమీ రాక నిశ్శబ్దంగా ఉన్నాడు సబ్‌ ఎడిటర్‌. ప్ర.స వెనుకనున్న కురుక్షేత్రంలోని బొమ్మ, శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశమిస్తున్న ఫోటోలో చేతిలో చక్రంతో ప్ర.స, కింద కూచొని నమస్కారం పెడుతూ తాను ఉన్నట్టు కనిపించాయి సబ్‌ ఎడిటరుకు.
తరువాత ఆలోచిస్తుంటే సబ్‌ ఎడిటరుకు ఇంకా కొత్త కొత్త పదాలు తట్టాయి. మందస్తును మహా మందస్తు, మహమహా మందస్తు, అభినవ మందస్తు, పూర్వ పురాతన మందస్తు, పురాణ మందస్తు ఇలా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అనుకున్నాడు. ఇంతలో అటుగా పోతున్న ప్ర.స మందస్తును తరువాత డెవెలప్‌ చేయొచ్చుగాని ఉదయం చెప్పిన వ్యాసం కథ చూడు అనేసి పోయాడు. వామ్మో ఎలా కనిపెట్టాడీయన అనుకొని, ఆ తను కూడా ఇలా నాలాగ పనిచేసినవాడే ప్ర.స కాకముందు అనుకొని తప్తి పడ్డాడు. ఈ మందస్తు మందు, మందు రూపంలోనే ఉండాలన్న నియమం లేనేలేదు. మత్తు కలిగించే, మత్తులో ముంచే మాటలేవైనా కావచ్చు, ఎన్నికల మానిఫెస్టోలో ప్రలోభపెట్టే పధకాలు కావచ్చు, ఉచిత స్కీములు కావచ్చు, ఉద్యోగాలిస్తామనే తీయటి నీటి మూటలు కావచ్చు ఏదైనా మత్తెక్కిస్తే చాలు. కులాలు, మతాలు కూడా మత్తుమందులేనని చెప్పిన మహానుభావులూ ఉన్నారు. వారికి ప్రజలమీద ప్రేమ ఉండబట్టి మత్తు ఏది, నిజమైనదేమి అన్న విషయాలు చెప్పి మరీ వెళ్ళారు. అవి చదవడంలో, చదివినా అర్థం చేసుకోవడంలో కలిగిన లోపాల వల్ల జనాలకు వాటిపై సరైన అవగాహన లేదు. అవగాహన లేకపోవడం, తప్పుడు అవగాహన తెచ్చుకోవడం కూడా మత్తేనని మా మిత్రుడు చెబుతాడు. అన్న రామారావు పాట ఉండనే ఉంది. ”మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తైదువురా”. అలా జీవితంలో సగభాగం నిద్రలో ఉండే జనాలు ఇతర మత్తుల్లో పడి ఇంకొంత భాగం జీవితాన్ని ఏదో ఒక రకమైన మత్తులో గడిపి మెలకువకంటే నిద్రలోనే ఎక్కువ ఉండిపోతారు.
ఏరా ఫుల్లుగా పోయించావా అనడుగుతాడు నాయకుడు తన కారును చూపిస్తూ. ఆ పోయించాను సార్‌ అంటాడు అనుచరుడు. చూసేవాళ్ళు కారులో పెట్రోలు గురించి అడుతుతున్నాడేమో అనుకుంటారు. ఆ ”పోయించడం” వేరన్న సంగతి చాలామందికి తెలియదు. ఇందాకే అనుకున్నట్టు మనుషులను రకరకాల గ్రూపులుగా విడగొట్టి వారికి కావలసిన తాయిలాలను ఫుల్లుగా ఇచ్చేసి తాను కూడా ఫుల్లుగా సీట్లు కొట్టేసినట్టు కలలు కంటాడు నాయకుడు. తానొక్కడే ఫుల్లుగా పనులు చేస్తున్నానని భ్రమలో ఉన్నోడికి ఇతరులు చేసేది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు.
మామూలుగా మత్తు తరువాత గమ్మత్తుగా ఉంటుంది. కొద్దిసేపు ఏమవుతుందో తెలియదు. తమకు తెలుసుకునే అవకాశాన్ని ఆ మత్తు ఈయదని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారు జనాలు. అలాంటిది మత్తంటే. ఇక మత్తు దిగాక తెలుస్తుంది అసలు కథ. ఏరు దాటేవరకు మాత్త్రమే ఓడ మల్లయ్య అని పిలిచేది, ఆ తరువాత బోడి మల్లయ్య మాత్రమే మిగులుతాడు. మళ్ళీ ఓడ మల్లయ్య కావాలంటే మరో ఐదేళ్ళు పడుతుంది. అందుకే ఎలాంటి మత్తుకు లొంగకుండా ఏకంగా మన జీవితాలు మత్తులోకి కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత మనదే. మెజారిటీ మత్తులో మునిగినా మత్తులో లేని మిగతావారితో కలుపుకుని అందరూ మునిగినట్టేనన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మన మత్తు కొద్దిగానైనా దిగుతుంది.
అసలు నెలలు నిండకుండా పుట్టే బిడ్డలో లోపాలుంటాయి చాలాసార్లు. ముఖ్యంగా తల్లికి బిడ్డకు ప్రమాదమని తెలిసినప్పుడే ముందుగానే డెలివరీ చేస్తారు. కాబట్టి ఆ రిస్కు తీసుకునే అడుగు ముందుకేస్తారు. ఒకవేళ అలా పుట్టిన శిశువులో లోపాలు లేకున్నా బిడ్డ బరువు తక్కువగా ఉంటుందడం లాంటి ఇబ్బందులుంటాయి. అలాంటి శిశువును జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంక్యుబేటరులో పెట్టాలి. ఒక్కరోజుకు ఇంత అని ప్రత్యేకంగా ఛార్జీలు వేస్తారు. ఈ ముందస్తు కూడా అలాంటి శిశువే అని గమనించాలి. ఏదో ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే ముందస్తు నిర్ణయం తీసుకుంటారు. తన బలం తగ్గుతూ ఉండడం ఒకటైతే, ఎదుటివాడి బలం పెరుగుతూ ఉండటం రెండోది. దమ్ముంటే ధైర్యముంటే వెంటనే ఎన్నికలు పెట్టమనండి ఎవరు గెలుస్తారో అని ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళకు పోయేదేమీ ఉండదు వచ్చేదే తప్ప. కుర్చీలో కూచున్నోడు కూడ అంతే ఘాటుగా ఈ క్షణంలో ఎన్నికలు పెట్టినా, అర్థరాత్రి ఎన్నికలు పెట్టినా మేమే తిరిగి అధికారంలోకి వచ్చేది అని చెప్పేస్తారు. ఇంకా వీలైతే తాము నిర్వహించిన సర్వేలో కూడా తామే గెలుస్తామని వచ్చిందనీ చెప్పొచ్చు.
పూర్వకాలంలో ఎన్నికలు లేవుకాబట్టి మనుషు లను కూడగట్టడాలు, యుద్ధాలులాంటి అవసరాలు వచ్చినప్పుడు డైరెక్టుగా కొన్నిసార్లు, తెలియకుండా కొన్నిసార్లు మత్తుమందులిచ్చి వశపరచుకొని తమ పని చేయించుకొన్నవరిని చూశాము. ఇప్పుడదంతా లేదు ఏకంగా మందు పోసెయ్యడమే. ఇది ప్రజాస్వామ్యంలో అత్యున్నత దశగా గెలవాలను కున్నోళ్ళు అనుకోవచ్చు. లేదు అది ఎప్పుడో చని పోయిందని కొందరు అమాయకులు అను కోవచ్చు. ఏమైనా ఎన్నికలతో కొన్ని ఇతర కలలు, కళలు కలిసి పోయి మత్తులో ముంచుతున్నాయన్నది మాత్రం నిజం. అన్ని రకాల మత్తులను వదిలినప్పుడే ప్రజలు నిజంగా తమను తాము పాలించుకుంటారు.
జంధ్యాల రఘుబాబు
9849753298

Spread the love