‘మంటల్లో మౌనరాగం’

‘మణిపూర్‌ మారణహౌమంపై ప్రధాని మోడీ మౌనం.’
నిజమే కానీ చాలా పొడిగా పొడుగ్గా ఉంది. వెరైటీగా ఉండాలి టైటిల్‌.
కథ వెరైటీ కాదుగా, వాస్తవం కదా…
వాస్తవమే. సినిమాగా మలచాలన్నప్పుడు దృశ్యకావ్యంగా ఆవిష్కృతం కావాలి. ఆ మణిపూర్‌ ప్రజల ఆత్మఘోష కొంతలో కొంతైనా జనానికి అర్థం కావాలి.
మౌనమేలనోయి?
మంచి పాట
మౌనం అర్ధాంగీకారం.
సుభాషితం
మొండి మౌనం
జర్నలిస్టులు వాడారు.
మోడీ మౌనంపై బెట్టింగ్‌
సోషల్‌ మీడియా టచ్‌. స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళివంటిదే అని ఆత్రేయ అన్నట్టు ప్రధాని మౌనం కూడా బెట్టింగే. సరే ఓసారి కథలోకి వెళ్దాం.
అందానికి అందం, పచ్చటి కొండల్లో ఆదివాసీలతో అలరారే ఒకానొక ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌. రెండున్నర నెలలుగా అగ్నికీలల్లో దహించుకుపోతున్నది. నాలుగు వేలకు పైగా గృహాలు భష్మీపటలం అయ్యాయి. వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాము చేయని తప్పుకు అమాయకులు బలైపోతున్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో ఆ ప్రజల మధ్య కక్షలూ కార్పణ్యాలు చెలరేగాయి. కారణం ఏమిటి? అసలు ఈ మంటలు ఎప్పటికి చల్లారుతాయి? ప్రాణాలు అరచేత పట్టుకుని ఆదివాసులు అలా తమ కొంపాగోడూ వదిలి పారిపోవల్సిందేనా? ఎంతకాలం ఈ నరకం? మంటలను ఆర్పే నాధుడే లేడా? కన్నీరు తుడిచే స్నేహ హస్తమే కరువైందా?
మణిపూర్‌ ప్రజల ఆక్రోశం, మనోగతం ప్రతిఫలిస్తూనే ఉన్నది…
కానీ అక్కడ ఉన్నది ప్రజా ప్రభుత్వమే. బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌.
మణిపూర్‌ ఒకపక్క మండుతుండగానే మరోపక్క ప్రధాని మోడీ అమెరికా వెళ్ళాడు. రక్షణరంగంలో ఆ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకున్నాడు. దిగ్గజ కంపెనీలు ఎన్నో ఆ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ‘తాను మోడీకి అభిమాని’ అని గర్వంగా ప్రకటించుకున్నాడు. తన కంపెనీ టెస్లా భారత్‌లో అరంగ్రేట చేస్తున్నదని చెప్పాడు.
 అక్కడ అలా… ఇక్కడ ఇలా…
అవును. నిజమే. మణిపూర్‌ సరిహద్దు రాష్ట్రం. పొరుగుదేశాల నుండి శరణార్తులు రావచ్చు. కానీ వారూ మనలాంటి మనుషులే. మణిపూర్‌లో ప్రధాన తెగలు మైతేయి, కుకీ, నాగాలు. ఈ తెగల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
సంఖ్యాపరంగా అధికంగా ఉన్న మైతేయి తెగను షెడ్యూల్‌ తెగల జాబితాలో చేర్చమని కేంద్రానికి సిఫారుసు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పే తమకు శిరోధార్యమైనట్టు రాష్ట్ర ప్రభుత్వం అమలుకు పూనుకున్నది. కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌ మైతేయి తెగకు సంబంధించిన వ్యక్తి గనుక.
ఇక్కడే ఘర్షణకు బీజం పడింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా శక్తి సంపన్నులైన మైతేయిలకు కూడా షెడ్యూల్‌ తెగల్లో స్థానమిస్తే ఆదివాసిల మనుగడ ఏమిటి? వారి బిడ్డల భవిష్యత్‌ ఏమిటి? ఈ ప్రశ్నే జీవన్మరణ సమస్యలు ఇంతింతై… వటుడింతై మాదిరిగా కుకీ, నాగాల ముందు సాక్షాత్కరించింది.
తాము భయపడిందే జరుగుతున్నట్టు బిరేన్‌ ప్రభుత్వం కొండ ప్రాంతాల్లోని ఆ ఆదివాసిలను వేటాడి తరమడం మొదలైంది.
మనుగడ కోసం పోరాటంలో ఆదివాసి యువత కొందరు ఉగ్రవాదు లుగా మారు తున్నారు. ఆయుధాలు ధరిస్తున్నారు. మరికొందరు పాలకుల అండతో గంజాయి సాగు చేస్తున్నారు. ‘ఉగ్రవాదం, గంజాయి సాగు’ ఈనెపంతో కేంద్రం, రాష్ట్రం తమ దళాలను పంపుతూ ఆదివాసులపై దాడులను ముమ్మరం చేసింది.
రాష్ట్ర భూభాగంలో తొంభైశాతం కొండ ప్రాంతమే. అదే ఆదివాసీల జీవనాధారం, అభయారణ్యం, రిజర్వు ఫారెస్టు భూమి పోనువారి సాగుకు మిగిలింది స్వల్పభూమే. అదికూడా అన్యాక్రాంతమైతే ఎలా? బతుకు దారేది?
అందుకే పోరాటం అనివార్యమైంది వారికి. విజయమో.. వీరమరణమో అన్న పరిస్థితికి ఆదివాసిల స్థితి నెట్టబడింది. భావి భారతదేశంలో ఆదివాసీల స్థితి ఇకముందు ఇలా మారనుందా? అనే భయంకర ప్రశ్న ఉత్పన్నమయింది.
ఓ.కే. బాగానే ఉన్నది. ముగింపు ఎలా…?
ప్రకృతితో ఆదివాసి జీవనం సహజంగా పెనవేసుకుపోయి ఉంటుంది. విడదీయడం సాధ్యం కాదు. ఎవరైనా ఈ సత్యం తెలుసుకోవాలి. కొమరం భీమ్‌ నినదించినట్టు జల్‌ జంగ్‌ జమీన్‌ హమారా హై. ఎవడో వచ్చి ఎవడికో ఇమ్మంటే ఆదివాసిలు కొండిపాంతం ఎందుకిస్తారు? ఎలా ఇస్తారు?
భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్‌ తెగల జాబితాలోకి ఒకరిని చేర్చాలన్నా, జాబితా నుండి ఒకరిని తొలగించాలన్నా ఆ అధికారం రాష్ట్రపతికే ఉన్నది. ఏ కోర్టుకూ, ఏ ప్రభుత్వానికీ లేదు. చివరకు పార్లమెంటుకు కూడా.
మధ్యలో హౌం మంత్రి అమిత్‌షా వచ్చాడు. చర్చలు జరిపాడు. కేవలం శాంతి భద్రతల విషయంగా పైపైన చూస్తే ఏం అర్థమవుతుంది. పైగా ఆదివాసులను రెండవ తరగతి పౌరులుగా అణచాలనే దుష్టబుద్ధి కూడా ద్యోతకమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ దేశ మూలవాసులైన ఆదివాసులే ఈ దేశస్థులు కాదనే విధంగా కొందరు మంత్రులు, అధికారులు, పోలీసులు వ్యవహరించడం సమస్యను మరింత జటిలం చేస్తున్నది.
స్థానికతను ఆధారంగా చేసుకునే జమ్మూ కాశ్మీర్‌ను రెండు భాగాలుగా విడగొట్టినట్టు బీజేపీ చెప్పుకున్నది. కాశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంలో పండిట్స్‌ తమ ప్రాంతాల నుండి ఎందుకు పారిపోయారో చూపించారు కదా!
కరెక్టుగా చెప్పారు. కానీ మణిపూర్‌లో బీజేపీ తత్‌ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇదే ముగింపు.
భాషా సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్ని అస్థిత్వంతో ముడిపడి ఉన్నాయి. చీమల పుట్టలోకి పాములను ఎగదోయాలని చూస్తే ఎలా కుదురుతుంది. మనుగడ కోసమే పోరాటమైనప్పుడు ప్రాణాలను ఎవరు మాత్రం లక్ష్యపెడతారు?
అలాగే మంటలను ఎగదోసేవారు చల్లారని ఎలా మాట్లాడతారు?
స్థూలంగా బాగానే ఉంది స్టోరీ లైన్‌. స్క్రీన్‌ప్లే ప్లాన్‌ చేసుకోండి మరి టైటిల్‌?
పాలకులకు ప్రజల పట్ల, ముఖ్యంగా బాధితుల పట్ల ప్రేమ ఉండాలి. శాంతిస్థాపన పట్ల చిత్తశుద్ధి ఉండాలి. అది లేనప్పుడు రోమ్‌నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయిస్తూనే ఉంటాడు. ‘మంటల్లో మౌనరాగం’.
సెల్‌: 9959745723
కె. శాంతారావు

Spread the love