మణిపూర్‌ను పట్టించుకోని మోడీ!

మణిపూర్‌ మంటలు ఈశాన్య భారతంలో బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలకు ప్రతీకగా మారాయి. కేవలం నాలుగు మాసాల క్రితమే, ఫిబ్రవరిలో ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాన్ని నరేంద్రమోడీ ప్రజలతో పంచుకున్నారు. ఈశాన్య ప్రాంతంలోని క్రైస్తవులు కూడా బీజేపీని ఆమోదించారని ఆయన చెప్పుకున్నారు. ఇప్పటికి ఏడువారాల నుండి అంటే మే 3వ తేదీ నుండి మణిపూర్‌లో హింస ప్రబలుతోంది. సాయుధ ముఠాల ఘర్షణలు, హత్యలు, గృహ దహనాలు రాష్ట్రాన్ని ధ్వంసం చేశాయి. వందలాది ఇళ్ళు, దాదాపు 200 చర్చిలు, 17 ఆలయాలు తగలబడ్డాయి. ఇంఫాల్‌లో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఇంటిని కూడా వదిలిపెట్టలేదు. సైన్యంతో పాటుగా 35వేల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట్రంలో మోహరించినప్పటికీ సాయుధ కుకీలు, మెయితే గ్రూపుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య వంద దాటింది. సహాయ శిబిరాల్లో 50వేల మందికి పైగా నిర్వాసితులు తలదాచుకున్నారు.
పూర్తిగా హింస గుప్పిట్లో రాష్ట్రం విలవిలలాడుతూ 26రోజులు గడిచిన తర్వాత మే 29న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించారు. ఆయన పర్యటన గానీ, ఆయన ప్రకటించిన చర్యలు గానీ హింసను అదుపు చేయలేకపోయాయి. ఇరుపక్షాలకు చెందిన తీవ్రవాద శక్తులు రాష్ట్రంలో కొరవడిన శాంతి భద్రతల పరిస్థితులను అవకాశంగా తీసుకుని వ్యవహరిస్తుండటంతో మెయితే, కుకీల మధ్య తలెత్తిన విభేదాలు మరింత ప్రస్ఫుటమయ్యాయి. మణిపూర్‌ చాలా సున్నితమైన సరిహద్దు రాష్ట్రం. ఇక్కడ 36జాతులు, మత కమ్యూనిటీలు జీవిస్తుండటంతో వైవిధ్యతకు పేరెన్నికగా ఉన్నది. ఈ కమ్యూనిటీల్లో ప్రధానమైనవి-మెయితే కమ్యూనిటీ, ఇంఫాల్‌ లోయలో ప్రధానంగా వీరు ఉంటారు. హిందూ మతాన్ని లేదా దేశీయ సనమహి మతాన్ని వీరు పాటిస్తారు. ఇక కుకీలు, నాగాలు మిగిలిన రెండు కమ్యూనిటీలు. వీరు ప్రధానంగా క్రైస్తవులు. వీరు కాకుండా, ఇంకా అనేక చిన్న చిన్న గిరిజన కమ్యూనిటీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. దశాబ్దాల తరబడి, వివిధ జాతులకు చెందిన సాయుధ గ్రూపుల తీవ్రవాద కార్యకలాపాలతో మణిపూర్‌ ఇబ్బందులు పడుతోంది. గతంలో నాగాలు, కుకీల మధ్య ఘర్షణలు జరిగేవి. 2017లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు మెయితేలను హిందూ శక్తిగా సంఘటితపరిచి క్రైస్తవులైన కుకీలపై ఎక్కుపెట్టడంలో చురుకుగా వ్యవహరించాయి. ఇది మెయితే-కుకీ సంఘర్షణకు దారితీసింది. అంతిమంగా హిందూ-క్రైస్తవ ఘర్షణగా కూడా రూపుదిద్దుకుంది.
మయన్మార్‌ నుండి చిన్‌ శరణార్ధులు వేలాదిగా వలస రావడంతో ఇటీవల కాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2021లో అధికారం చేజిక్కించుకున్న మిలటరీ అణచివేతకు పాల్పడటంతో దాని నుండి తప్పించుకోవడానికి చిన్‌ శరణార్థులు మణిపూర్‌ వలస వచ్చేశారు. చిన్‌ కమ్యూనిటీ అంటే కుకీ జాతికి చెందినవారే. మిజోరాం, మణిపూర్‌ రెండు రాష్ట్రాల్లోనూ ఈ శరణార్థులను వారి జాతికి చెందిన బంధువులే స్వాగతించారు. ఆశ్రయం ఇచ్చారు. అయితే భారత ప్రభుత్వం వారికి శరణార్ధుల హౌదా ఇవ్వడానికి తిరస్కరిస్తోంది. వారిని అక్రమ, చట్టవిరుద్ధమైన మైగ్రెంట్లుగా ప్రకటించింది.రిజర్వ్‌ ఫారెస్టుల నుండి ఖాళీ చేసే చర్యలు చేపట్టడం ద్వారా బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. దీనివల్ల పెద్ద సంఖ్యలో కుకీ కుటుంబాలు ప్రభావితమయ్యాయి. గంజాయి సాగుపై అణచివేత చర్యలు కూడా కుకీలపై తీసుకున్న ఘర్షణాయుత చర్యగా చూడాల్సి ఉంది. అరంబాయి తెంగోల్‌, మెయితే లీపన్‌ వంటి మెయితే తీవ్రవాద గ్రూపులను ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీలు ప్రోత్స హిస్తున్నాయి. పైగా ఈ మెయితే గ్రూపులు కుకీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. వారిని చట్టవిరుద్ధంగా జొరబడిన బయటి వ్యక్తులుగా ముద్ర వేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు సాయం చేసేందుకు కొన్ని కుకీ సాయుధ తీవ్రవాద గ్రూపులను ఎంపిక చేసుకున్నట్లు బయటపడటంతో బీజేపీ బూటకపు ఎత్తుగడ వెలుగులోకి వచ్చింది. 2019 జూన్‌లో సాయుధ కుకీ గ్రూపు నేత, యునైటెడ్‌ కుకీ లిబరేషన్‌ ఫ్రంట్‌ (యుకెఎల్‌ఎఫ్‌) చైర్మన్‌గా ఉన్న ఎస్‌.ఎస్‌.హాకిప్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకి రాసిన లేఖ ద్వారా ఈ విషయం బయటపడింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో మద్దతు కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల ఇన్‌చార్జి రామ్‌ మాధవ్‌, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలు తన వద్దకు వచ్చారని ఆ లేఖలో కుకీ నేత పేర్కొన్నారు. ఇందుకు గానూ డబ్బు కూడా చెల్లించారని ఇంఫాల్‌ లోని ఎన్‌ఐఎ కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌కు అనుబంధంగా ఆ లేఖను కూడా అందచేయడం తో ఈ విషయం స్పష్టమైంది. 2008లో ‘సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌’ ఒప్పందంలో చేరిన సంస్థల్లో యుకెఎల్‌ఎఫ్‌ కూడా ఒకటి.
బీజేపీ ఆడిన ఈ మోసపూరితమైన క్రీడ, మెయితేల్లో బీరేన్‌సింగ్‌ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. కుకీలకు సంబంధించినంత వరకు, వారు పూర్తిగా బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. అసలు తమ సమస్యలన్నింటికీ మూల కారణం ఆయనేనని వారు అభిప్రాయ పడుతున్నారు. కుకీ కొండ ప్రాంత జిల్లాల్లోని పదిమంది ఎంఎల్‌ఎలు ఇప్పుడు కుకీ ఏరియాకు ప్రత్యేక ప్రభుత్వం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఎంఎల్‌ఎల్లో చాలామంది బీజేపీకి చెందినవారే. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తి కలిగించే అంశమేమంటే ప్రధాని నరేంద్ర మోడీ మౌనం పాటించడం. మణిపూర్‌లో పరిస్థితి గురించి ఆయన ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా రాష్ట్రంలో శాంతి నెలకొనాలని, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ జరగాలని ప్రజలకు ఒక్కసారి కూడా విజ్ఞప్తి చేయలేదు. మూడు రాజకీయ ప్రతినిధి బృందాలు ఢిల్లీలో ప్రధానితో భేటీ కోసం పడిగాపులు పడుతున్నాయి. వీటిలో రెండు ప్రతినిధి బృందాల్లో బీజేపీ ఎంఎల్‌ఎలు ఉండగా, మూడో బృందంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారున్నారు. అమెరికాకు బయలుదేరి వెళ్ళేటపుడు మాత్రమే వారు ప్రధానిని చూశారు. ప్రధాని తరపున ఇలా పూర్తిగా జవాబుదారీతనం కొరవడడం మణిపూర్‌లోని అన్ని వర్గాల ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చిందరవందరగా ఉండడం, పైగా స్పష్టమైన రీతిలో అధికార వైఖరి లేకపోవడంతో… బీరేన్‌సింగ్‌ ప్రభుత్వాన్ని తొలగించడం రాజకీయంగా తీసుకోవాల్సిన తక్షణ తొలి చర్యగా ఉంది. అటువంటి చర్య తీసుకోనట్లయితే ఈశాన్య ప్రాంతంలో పాలక పార్టీ సాగించిన సంకుచిత, వేర్పాటువాద రాజకీయాలు సృష్టించిన సంక్షోభం నుండి బయటపడే మార్గమే లేదు.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Spread the love