దేశం పరువు తీసిన ‘గాడ్సే’ వారసులు

తమకర్త నాళాల్లో ఏపాటి ప్రజాస్వామ్యం ఉందో చూపెట్టుకోవడానికి గాడ్సేలకు ఎక్కువ సమయం పట్టలేదు. భారత ప్రధాని, ఆ పరివారం నేత నరేంద్రమోడీ వైట్‌హౌస్‌ పత్రికా గోష్టిలో మాట్లాడిన మరునాడే ఆయన మాటల్లోని బండారం ప్రపంచానికి తెలిసిపోయింది. అతికష్టం మీద మోడీని సంయుక్త ప్రెస్‌ కాన్పరెన్సుకు ఒప్పించిన వైట్‌హౌస్‌కు పరాభవమే మిగిలింది. ఆ పత్రికా గోష్టిలో భారతదేశంలో ముస్లింలపై జరుగుతోన్న దాడుల గురించి ప్రశ్నించిన సబ్రినా సిద్దిఖీ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ విలేకరికి అమెరికాలోని గాడ్సే భక్త సమాజం నుండి వేధింపులు ఎదురయ్యాయి. వైట్‌హౌస్‌ ఆ వేధింపులపై వెంటనే స్పందించి తన పరువు నిల్పుకొంది. డోనాల్డ్‌ ట్రంపు ఇంకా అమెరికా అధ్యక్షుడిగా లేడన్న వాస్తవాన్ని వైట్‌హౌస్‌ గాడ్సే పరివారానికి స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు జరిగిన సంయుక్త ప్రెస్‌కాన్పరెన్సులో నరేంద్రమోడీని సిద్దిఖీ భారతదేశం లోని ముస్లింపై జరుగుతున్న దాడుల గురించి మానవ హక్కుల గురించి అడగగా మన ప్రధాని ప్రజాస్వామ్యం మా రక్తనాళాల్లో ఉందని ఆకుకు అందని పోకకు పొందని ఫిల్మీ డైలాగు వల్లెవేసి బయట పడ్డారు. అడిగిన ప్రశ్నకు సూటిగా ఆయన జవాబు చెప్పలేక పోయారు. ఇద్దరు దేశాధినేతల ఒప్పందం మేరకు విలేకరులు రెండేసి ప్రశ్నలే అడగాలి కనుక సిద్దిఖీ ప్రశ్నపై అనుబంధ ప్రశ్నకు అవకాశంలేదు. అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో మన ”ప్రజాస్వామ్యం” పరువు మట్టికరిపించే పనికి గాడ్సే భక్తులు పూనుకొన్నారు. 19ఏళ్ల తర్వాత మోడీ పాల్గొన్న పత్రికా గోష్టి అలా ముగిసింది.
సిద్దిఖీ ప్రశ్నతో దిమ్మదిరిగిన అమెరికాలోని గాడ్సేలు ఆమెపై వేధింపులు మొదలెట్టారు. మనదేశంలోని స్థానిక గాడ్సేలు డిజిటల్‌ జర్నలిస్టు తులసి చంద్‌ను వేధిస్తున్నట్లు వేధిస్తున్నట్లుగానే అమెరికన్‌ గాడ్సేలు కూడా ప్రవర్తించారు. ఉన్నత విద్యలు నేర్చి విదేశాల్లో స్థిరపడినా కుక్కతోకల్లా వారు వంకర బుద్దులు వదల్లేదు. ట్రోలింగ్‌లపై కంగారు పడిన వైట్‌హౌస్‌ వెంటనే స్పందించింది. అమెరికా నేషనల్‌ సెక్యురిటీస్‌ అధికారి జాన్‌ కిర్బే ఒక ప్రకటన చేస్తూ రిపోర్టర్లపై వేధింపులను వైట్‌హౌస్‌ (అమెరికా ప్రభుత్వం) ఆమోదించదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి కార్యస్థానం అయిన వైట్‌హౌస్‌ నుండి అలాంటి ప్రకటన రావడం భారతీయులందరికీ అవమానమే. పత్రికా గోష్టి తర్వాత తనపై సాగిన వేధింపుల మీద సిద్దిఖీ జూన్‌ 24న ట్వీట్‌ చేశారు. ”నా ప్రశ్నకు కొందరు వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆపాదిస్తున్నారు. కనుక నేను నా విషయాలను వెల్లడించడం సరైందని అనుకొంటున్నాను. కొన్నిసార్లు అస్తిత్వమే చాలా సంక్లిష్టంగా మారుతుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ట్వీట్‌లో తాను ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ జెర్సీని ధరించి ఉన్న ఫొటోను, తన తండ్రితో పాటు 2011 వల్డ్‌కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను ఇండియన్‌ టీమ్‌ జెర్సీలో ఉంటూ చూస్తున్న ఫొటోలను పెట్టారు. తన భారతదేశ జాతీయతను, దానిపట్ల ఉన్న ప్రేమను సిద్దిఖీ ఆ విధంగా తెలియ చేసుకోవాల్సి వచ్చింది. దాన్నిబట్టి ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురైౖ ఉంటాయో మనం ఊహించవచ్చు. ముస్లిం అయితే నేరుగా అలాంటి వేధింపులకు పాల్పడటం ఒకవేళ హిందువులయితే నీవు ముస్లింకు పుట్టావా? అని ప్రశ్నించడం సంఘీయుల సంస్కృతి.
మన ప్రధానికి ఏదో ఉద్దేశాన్ని అపాదిస్తూ సిద్దిఖీ ప్రశ్నించలేదు. ”భారతదేశంలో మైనారిటీల హక్కులపై జరుగుతున్న దాడుల నుండి మీరు రక్షణ కల్పిస్తారా? ముస్లింల హక్కులను, భావస్వేచ్ఛను రక్షిస్తారా” అని అడిగారు. ఆ వెంటనే ఆమెపై ట్రోలింగ్‌లు మొదలయ్యాయి. ప్రశ్న వేయడంలో ఆమె ఉద్దేశాన్ని, ఆమె వారసత్వాన్ని ప్రశ్నించి తమను విమర్శించే వారిని సూడో సెక్యులరిస్టులు అని నిందించే ట్రోలర్లు తాము ఎంతటి నిఖార్సైన లౌకికవాదులో చాటుకొన్నారు. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరి కరీన్‌ జిన్‌పీరే కూడ కిర్బే ప్రకటనను పునరుద్ఘాటిస్తూ ”మేము పత్రికా స్వాతంత్య్రానికి కట్టుబడి ఉన్నాంగనుకే గతవారం సంయుక్త పత్రికా గోష్టిని ఏర్పాటు చేశాం. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై బెదిరింపులను, వేధింపులను మేము ఖండిస్తున్నాం” అని పేర్కొన్నారు. మోడీ ఇచ్చిన సమాధానంతో బైడెన్‌ ఏకీభవిస్తున్నారా అని ఒక విలేకరి ఆ సందర్భంగా ప్రశ్నించగా అది ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. ఆ విషయంపై నేనిక్కడ చర్చించను. బైడెన్‌ ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛకు కట్టుబడి ఉంది. అందుకనే పత్రికల వారు బైడెన్‌తో పాటు మోడీ చెప్పేది కూడా వింటే బావుంటుందని అనుకొన్నాం అని ఆమె వివరించారు. కాగా ఆ సంయుక్త పత్రికా గోష్టికి మోడీని ఒప్పించడానికి వైట్‌హౌస్‌ అధికారులకు చాలా సహనం చూపాల్సి వచ్చిందట. సహనం అన్న మాటను వైట్‌హౌస్‌ అధికారులు ఉపయోగించాల్సి వచ్చిందంటే వారు నిజంగానే ఎన్ని పాట్లు పడ్డారో పాపం. ఆ ప్రయత్నంలోనే ప్రశ్నల సంఖ్యపై పరిమితి విధించారు కూడా. మోడీకి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ”రెడ్‌ కార్పెట్‌” ఆహ్వానంపై 70మంది అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ప్రధాని పర్యటన తర్వాత మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ప్రకటన చేస్తూ మోడీ మార్కు ప్రజాస్వామ్యాన్ని ఎండగట్టారు. వెంటనే మన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌ వగైరాలు ఒబామాపై విరుచుకు పడ్డారు. అఫ్ఘాన్‌, ఇరాఖ్‌లపై బాంబుల వర్షం కురిపించిన ఒబామా మమల్ని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. అలా మండిపడిన వారు అఫ్ఘాన్‌, ఇరాఖ్‌లపై బాంబులు కురిపిస్తున్నప్పుడు ఏం చేశారు? ఒబామాను ఖండించారా? చంకలు గుద్దుకొన్నారా? ఒకసారి నిజం ఒప్పుకొని లెంపలేసుకొని ఉంటే బావుండేది.
ఈ వారంలో ముందుకు వచ్చిన మరో అంశాన్ని చూద్దాం… సుప్రీం కోర్టు రాజద్రోహ చట్టాన్ని అమలు చేయరాదని చెప్తూ ఆ చట్టాన్ని గత ఏడాది మే నెల నుండి పెండింగ్‌లో పెట్టింది. కాగా ఆ చట్టాన్ని రద్దు చేయరాదని 22వ లా కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ అవస్థి ఐపిసిలోని సెక్షన్‌ 124ఎ ను అట్టిపెట్టాలని సూచించారు. దేశంలోని పరిస్థితులకు, ఉపా చట్టం, ఎన్‌ఎస్‌ఎ చట్టం సరిపోవని, వలస పాలన కాలం నాటిదైనా సరే రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని అవస్థి చెప్పారు. కాగా ”లా కమిషన్‌ నివేదికను తాము వివరంగా పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది.” రాజద్రోహ చట్టం దుర్వినియోగం కాకుండా తాము కొన్ని చర్యలు సూచించినట్లు లా కమిషన్‌ చెబుతున్నా ఆ మార్పులు ప్రజలను మరింత ఇబ్బంది పెట్టేవేనని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు అంటున్నాయి. లా కమిషన్‌ చైర్మన్‌ తన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచుతూ కశ్మీర్‌ నుండి కేరళ దాకా, పంజాబ్‌ నుండి ఈశాన్య రాష్ట్రాల దాకా ఉన్న దేశ భద్రతను, సమైక్యతను కాపాడాలంటే రాజద్రోహ చట్టం అవసరం అని చెప్పారు. అంటే రాజ్యాంగంలోని ఫెడరల్‌ విలువలను అమలు చేయడం కన్నా, రాజద్రోహ చట్టం అన్న కత్తిని మెడపై వేలాడదీసి కేంద్రం పరిపాలన చేయాలని లా కమిషన్‌ చెప్పినట్లయింది. సుప్రీం కోర్టును కూడా మోడీ ప్రత్యర్థిగా చూస్తున్నట్లు కన్పిస్తుంది. మేము రాజ్యాంగానికి బద్దులపై పరిపాలన చేస్తాం అని అమెరికన్‌ కాంగ్రెస్‌లో మోడీ ఎంత నాటకీయతతో చెప్పినప్పటికీ దేశంలోని దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను అడ్డగోలుగా వాడుకోవడమే మనకు కన్పిస్తుంది. ఆ ధోరణికి చట్టబద్ధత కల్పించడానికి లా కమిషన్‌ సిఫారసులు పనికొస్తాయి. వరవరరావు లాంటి వారు రాజద్రోహం నేరం కింద అరెస్టు అయ్యారు. సంఘ సేవకుడు స్టాన్‌స్వామి ఆ నేరం కింద అరెస్టయి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జైల్లోనే చనిపోయారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. రాజ్యాంగం ప్రకారం అక్కడి లెప్ట్‌నెంట్‌ గవర్నరు రాష్ట్ర మంత్రి వర్గం మాట వినాలని సుప్రీం కోర్టు చెప్తే దాన్ని తలకిందులు చేస్తూ కేంద్రం ఒక ఆర్డినెన్సు తెచ్చింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తనకు పాదాక్రాంతం కావాలన్నదే మోడీ తపనగా కన్పిస్తుంది. అదీ మోడీ మార్కు ఫెడరలిజం.
మోడీ మతసామరస్యం గురించి అమెరికా కాంగ్రెస్‌లో గొప్పలు చెప్పుకోగా, అదే సమయంలో ఇక్కడ ఉత్తరాఖండ్‌లో ఒక పట్టణం నుండి ముస్లింలను అసాంతంగా తరిమేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉత్తరకాశీ జిల్లాని పురోలా పట్టణం నుండి ముస్లింలను తరిమేయడానికి ”దేవభూమి రక్ష అభియాన్‌” అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఉత్తరకాశీ హిందువుల పవిత్ర స్థలం కనుక అక్కడ ఇతరులు ఉండరాదని ఆ సంస్థ వాదననేది స్పష్టంగానే అర్థమవుతోంది. ఆ నేపథ్యంలో 15ఏళ్ల హిందూ బాలికను ఎత్తుకెళ్లడానికి ఇద్దరు యువకులు ప్రయత్నించారని పోలీస్‌ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు నమోదైంది. వెంటనే పట్టణంలో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్న ఉబైద్‌, జితేంద్ర సైనీలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాత కూడా దేవభూమి రక్షా అభియాన్‌ కార్యకర్తలు చాలా మంది ముస్లింలను పట్టణం నుండి బలవంతంగా పంపించేశారు. 82ఏళ్ల ధరం సింగ్‌ నేగి అనే లాయర్‌ తన షాపును కిరాయికి తీసుకొన్న ముస్లింలను ఖాళీ చేయించబోనని గట్టిగా నిలబడ్డారు. ధరంసింగ్‌ నేగి మొత్తబడితే ఆ పట్టణంలోని ముస్లింలందరూ వ్యాపారాలను ఎత్తేసుకొని వలసబాట పట్టాల్సిందే. భారతదేశ పౌరులై ఉండి కూడా బర్మాను వదలి వచ్చిన రోహింగ్యా ల్లాంటి బతుకును వారు గడపవలసి ఉంటుంది. ఇదేపాటి లౌకికవాదమో మన ప్రధానే చెప్పాలి. ఇదిలా ఉండగా నిందితులైన వారి కుటుంబ సభ్యులు కావాలనే తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని, ఫోన్‌ కాల్‌ రికార్డులను పరిశీలించిన పోలీసులకు ఫిర్యాదును ధృవ పరిచే సమా చారం దొరకలేదని చెపుతున్నారు. ఒకవేళ నిందితులపై ఫిర్యాదు నిజమేనని రుజువైనా ఎవరో ఒక ముస్లిం యువ కుడు తప్పు చేశాడని ఒక పట్టణం నుండి ముస్లింలందరూ వెళ్లిపోవాలని ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం. ఆ పట్టణంలోని ముస్లింలపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే ఉత్తరకాశీ ప్రాంతపు బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్‌ జాహిద్‌ కూడా డెహ్రాడూన్‌కు పారిపోడు. దేశంలో తన పార్టీకి చెందిన వారి వల్లే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురువుతుండగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని తమ లౌకిక, ప్రజాస్వామ్య విలువలపై చేసిన ప్రసంగాన్ని ఏమనాలో ప్రజలే చెప్పాలి.

ఎస్‌. వినయకుమార్‌

Spread the love