గాయాల మల్ల యుద్ధం!

ఏ పరీక్ష నాళికా పసిగట్టలేదు
వాడి రక్తంలో పడగవిప్పే పామువిషం!
మామూలు కంటికి కనిపించదు
మనిషి చర్మం కింద సంచరించే మృగం

రాబందువు జన బాంధవుడి వేషంలో
ఓటడిగినప్పుడే గుర్తు పట్టాల్సింది!
ప్రమాదం నెత్తినెక్కి తొక్కే దాకా
బహుశా మనం కళ్ళు మూసుకుంటాం!
పక్షి గుడ్లను సంరక్షించే పదవిలో
పామునే కూర్చోబెడుతాం!

కుర్చీ మదం మందమెక్కినంక
వాడిలో కుబుసం విప్పుకున్న కామం
బుసలు కొడుతున్నదని
కాటునుంచి తప్పించుకున్న
వాళ్ళే కదా గుర్తించగలరు!

పిడిగుద్దుల యుద్ధం చేసే వాళ్ళు
పశువు కొమ్ములకు లొంగిపోరు
వాళ్ళ గొంతులు పిరికిపాలు తాగలేదు!

పంటను కాపాడే రైతు
చీడను గుర్తించినట్లు
దేహాల మీద దాడిచేయాలనుకునే
గొంగళి పురుగును
వాళ్ళు సులభంగానే గుర్తించగలరు!

ప్రత్యర్థితో యుద్ధం
వాళ్ళకు కొత్తేమికాదు గానీ
నిర్లజ్జగా నీతిని వదిలేసిన
మృంగంతో యుద్ధమిది!
గాయాలు వాళ్ళకు కొత్తేమీగాదు
క్రీడా ప్రపంచంలో
మన జెండా ఎగరేసే బరిలో
నెత్తురు చిందినప్పటి గాయాలకన్నా

జుగుప్సాకరమైన వాడి చేతులు చేసిన
గాయానికి సాక్ష్యం చూపమన్నప్పుడే
వాళ్ళింకా గాయపడుంటారు!

గాయాలకు నోళ్ళుంటాయి
గొంతెత్తి నిలదీస్తాయి
గాయాలకు పిడికిళ్లుంటాయి
న్యాయం కోసం పోరాడుతాయి!

చీడ పురుగు పట్టి చూపెట్టాం
మీరూ చీదరించండని
లేత చిగుళ్ళు మించి దులిపేయండని
ఇప్పుడు గాయాలు గొంతెత్తేది
కళ్ళు మూసుకున్న నిర్లక్ష్యం మీద

దేశం కోసం దేహాపు కణం కణం
ఓ రణరంగం చేసిన
వాళ్ల ఆత్మ గౌరవాన్ని కాపాడడమే
ఇప్పుడు దేశ గౌరవమని

చెవులు మూసుకున్న
మౌనం నోరిప్పేదాకా
గొంతెత్తిన గాయాల మల్ల యుద్ధం ఆగదు!
ఈడ్చిపారేయాలని చూసేకొద్దీ
యుద్ధం వేల వేల పిడికిళ్లుగా విస్తరిస్తుంది!
– రహీమొద్దీన్‌,
9010851085

Spread the love